ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల ధరలు భగ్గు
ABN , Publish Date - Nov 21 , 2026 | 05:33 AM
ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుదారులపై సమీప కాలంలో మరింత భారం పడే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి...
ఈ ఏడాది చివరికల్లా 30ు పెరిగే చాన్స్
కౌంటర్‌పాయింట్ నివేదిక
న్యూఢిల్లీ: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుదారులపై సమీప కాలంలో మరింత భారం పడే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ల ధరలు 30 శాతానికి పైగా పెరిగి ఒక్కో ఫోన్ ధర రూ.లక్ష దాటే అవకాశం ఉందని మార్కెట్ పరిశోధన సంస్థ కౌంటర్‌పాయింట్ శుక్రవారం వెల్లడించింది. మెమోరీ చిప్‌ల ధరలు గణనీయంగా పెరగడమే ఇందుకు కారణంగా పేర్కొంది. స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరుగుతున్న కొద్దీ వినియోగదారుల అంచనాలు కూడా పెరుగుతున్నాయి. అధిక ధర చెల్లించడమే కాకుండా అందుకు తగ్గట్టు మొబైల్ ఫోన్ల ప్రాసెసింగ్‌లో వేగం, కెమెరా, బ్యాటరీ సామర్థ్యం, మన్నిక, అమ్మకాల తర్వాత లభించే సర్వీసులు ఉండాలని కోరుకుంటున్నారు. ‘‘కొన్నేళ్ల క్రితం దేశంలో రూ.లక్ష ధర కలిగిన స్మార్ట్‌ఫోన్ అనేది చాలా అరుదుగా ఉండేది. కానీ ఇప్పుడు ఫ్లాగ్‌షిప్ డివైజ్‌ల ధరలు క్రమంగా పెరుగుతుండటంతో ఈ ధర సాధారణమవుతోంది. 2025తో పోల్చితే ఈ ఏడాది చివరినాటికి ఈ స్మార్ట్‌ఫోన్ల ధరలు 30 శాతానికి పైగా పెరిగే అవకాశం ఉంది’’ అని కౌంటర్‌పాయింట్ పేర్కొంది.
మెమోరీ చిప్స్ ధరలే కారణం: మెమోరీ చిప్స్ ధరలు స్మార్ట్‌ఫోన్ల తయారీ వ్యయం పెరగడానికి కారణమవుతున్నాయి. 2025 మొదటి త్రైమాసికంలో మొత్తం ఫోన్ ధరలో మెమోరీ ధర 13ు ఉండగా ఈ ఏడాది చివరి నాటికి ఇది 43 శాతానికి చేరుకోవచ్చని తెలిపింది. కృత్రిమ మేధ (ఏఐ) డేటా సెంటర్ల నుంచి ఏర్పడుతున్న డిమాండ్ కారణంగా డీరామ్ (తాత్కాలిక స్టోరేజ్), ఎన్‌ఏఎన్‌డీ ధరలు పెరిగాయని, దీనివల్ల స్మార్ట్‌ఫోన్ల తయారీలో వినియోగించే విడిభాగాల మొత్తం వ్యయంలో మెమోరీ వాటా 40 శాతానికి పైగా పెరిగిందని పేర్కొంది.
స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో 22% క్షీణత
మెమోరీ చిప్‌ల ధరలు భగ్గుమనడంతో స్మార్ట్‌ఫోన్ల ధరలకు రెక్కలొచ్చాయి. దీని ప్రభావం ఇటీవలే ముగిసిన పండగల సీజన్ (అక్టోబరు 8-నవంబరు 10) అమ్మకాలపై పడింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా ఉన్న భారత్‌లో ఈ పండగల సీజన్‌లో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 22 శాతం పడిపోయినట్టుగా కౌంటర్ పాయింట్ పేర్కొంది. ఈ క్షీణత పండగకు ముందు అంచనా వేసిన దానికన్నా ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. మరోవైపు 2025 పండగల సీజన్ డిస్కౌంట్లు 35-40 శాతం ఉండగా.. ఈసారి 10-25 శాతానికి తగ్గిపోయాయని వెల్లడించింది.
ఈ వార్తలనూ చదవండి:
వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!
ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..