బ్యాంకు డిపాజిట్లపై జర జాగ్రత్త
ABN , Publish Date - Feb 15 , 2026 | 04:57 AM
ప్రస్తుత రోజుల్లో ఎవరూ ఇంటి వద్ద ఎక్కువ నగదు ఉంచుకునేందుకు ఇష్టపడరు. ఉంచుకుంటే ఎప్పుడు ఏ దొంగోడు వచ్చి కన్నమేస్తాడో తెలియదు. దీంతో చాలా మంది మధ్య తరగతి ప్రజలు తమ వద్ద ఉన్న..
పరిమితి దాటితే ఐటీ నోటీసులు
ప్రస్తుత రోజుల్లో ఎవరూ ఇంటి వద్ద ఎక్కువ నగదు ఉంచుకునేందుకు ఇష్టపడరు. ఉంచుకుంటే ఎప్పుడు ఏ దొంగోడు వచ్చి కన్నమేస్తాడో తెలియదు. దీంతో చాలా మంది మధ్య తరగతి ప్రజలు తమ వద్ద ఉన్న నగదులో ఎక్కువ భాగాన్ని ఎప్పుడంటే అప్పుడు వెనక్కి తీసుకునేందుకు తమ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసేందుకు ఇష్టపడతారు. ఈ డిపాజిట్లు ఒక పరిమితికి లోబడి ఉంటే ఓకే. పరిమితి దాటితే మాత్రం తిప్పలు తప్పవు. ఆ పరిమితి దాటిని డిపాజిట్ల వివరాలను బ్యాంకులు తప్పనిసరిగా ఆదాయ పన్ను (ఐటీ) శాఖకు తెలియజేస్తాయి. అప్పుడు ఈ ఆదాయం ఎలా వచ్చిందో చెప్పండి అంటూ ఐటీ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది.
పారదర్శకత
పరిమితికి మించి చేసే పెద్ద డిపాజిట్లన్నీ చట్ట విరుద్ధం కాదు. ఒకవేళ ఐటీ అధికారులు అనుమానించి నోటీసులు జారీ చేస్తే.. ఆ డిపాజిట్లకు అవసరమైన ఆదాయం ఎలా వచ్చిందో డిపాజిటర్లు పారదర్శకంగా, చక్కగా వివరించ గలిగి ఉండాలి. చెప్పుకోదగ్గ స్థాయిలో డిపాజిట్ల మొత్తం ఉంటే ఆ ఆదాయం ఎలా వచ్చిందో చెప్పమని అడిగే హక్కు పన్ను అధికారులకు ఉంటుందని ఇటీవల ఢిల్లీలోని ఆదాయ పన్ను శాఖ అప్పిల్లేట్ ట్రైబ్యునల్ (ఐటీఏటీ) స్పష్టం చేసింది. డిపాజిట్లకు సంబంధించిన ఆదాయానికి స్పష్టమైన రికార్డుల ఆధారం కూడా ఉండాలి. లేకపోతే ఐటీ శాఖ దాన్ని పన్నుల ఎగవేత కోసం లెక్కల్లో చూపని నల్లధనంగా పరిగణిస్తుంది.
నగదు డిపాజిట్లే కాదు. బ్యాంకుల నుంచి ఒకేసారి లేదా తరచూ పెద్ద మొత్తంలో నగదు విత్‌డ్రా చేస్తున్నా ఐటీ అధికారుల కన్ను పడే ప్రమాదం ఉంది. ఈ నగదు విత్‌డ్రాయల్స్ మీ ప్రకటిత ఆదాయ వనరులకు మించి ఉంటే బ్యాంకులే ఆ విషయాన్ని ఐటీ అధికారులకు తెలియజేస్తాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మీ నగదు విత్‌డ్రాయల్స్‌కు సంబంధించిన అన్ని రికార్డులు దగ్గర ఉంచుకోవడం మంచిది. ఇలా అన్ని రికార్డులు ఉంచుకుంటే ఐటీ అధికారులు అడిగే అన్ని ప్రశ్నలకు డాక్యుమెంటరీ సాక్ష్యాలతో సమాధానం చెప్పవచ్చు.
పారదర్శకతే ఆయుధం
ఆదాయ పన్ను శాఖ నోటీసుల నుంచి తప్పించుకోవాలంటే నిజాయితీ, స్పష్టత అత్యంత ముఖ్యం. ఎప్పుడూ మన ఆదాయాన్ని స్పష్టంగా వెల్లడించాలి. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ లావాదేవీల కోసం డిజిటల్ చానల్స్ ఉపయోగించుకోవాలి. చట్టపరమైన అన్ని నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి. ఇలా చేస్తే మనశ్శాంతితో పాటు ఆర్థికంగా మన పేరు ప్రతిష్ఠలు కూడా పెరుగుతాయి.
రూ.10 లక్షల
నిబంధన
ప్రతి వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకు మించిన బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. అంతకు మించితే మాత్రం బ్యాంకులు, సహకార బ్యాంకులు ఆ విషయాన్ని ఐటీ శాఖకు తెలుపుతాయి. అప్పుడు ఐటీ శాఖ ఆ డిపాజిట్లకు అవసరమైన ఆదాయం ఎలా వచ్చిందో చెప్పండి అంటూ నోటీసులు జారీ చేస్తుంది. అప్పుడు అన్ని ఆధారాలతో ఆ ఆదాయం ఎలా వచ్చిందో ఐటీ అధికారులకు వివరించాలి. ఆస్తుల అమ్మకం, వ్యాపార లాభాలు లేదా చట్టబద్దమైన బహుమతుల ద్వారా... ఇలా ఎలా వచ్చినా దానికి సంబంధించిన వివరాలు రికార్డులతో సహా ఐటీ అధికారులకు సమర్పించాలి.
నోటీసులు అందితే ఏం చేయాలి?
ఐటీ శాఖ నుంచి నోటీసులు అందినంత మాత్రాన ఆ వ్యక్తి తప్పు చేసినట్టు కాదు. అప్పుడు ఏమి చేయాలంటే..
జూ గాభరా పడకుండా ప్రశాంతంగా కూర్చుని ఏ ప్రత్యేక కారణంతో నోటీసు జారీ చేశారో
తెలుసుకోవాలి.
ఆదాయ వనరులను తెలిపే బ్యాంకు స్టేట్‌మెంట్లతో పాటు ఆదాయ వనరులను తెలిపే ఆస్తుల అమ్మకం పత్రాలు, వ్యాపార ఆదాయమైతే అందుకు సంబంధించిన రికార్డులు, బహుమతుల వివరాలు ఐటీ అధికారులకు సమర్పించాలి.
ఆలస్యం చేయకుండా అన్ని వివరాలు అధికారులకు సమర్పించాలి. నోటీసులకు ఆలస్యంగా స్పందిస్తే జరిమానా కూడా పడే అవకాశం ఉంది.
నిర్ణీత సమయంలో ఆదాయానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు సమర్పిస్తే చాలా వరకు సమస్య నుంచి బయట పడవచ్చు.
నోటీసులు తప్పించుకునే మార్గాలు
డిపాజిట్లకు సంబంధించిన అన్ని లావాదేవీలు పారదర్శకంగా ఉండాలి. ఇందుకు ఈ కింది చర్యలు ఎంతగానో ఉపయోగపడతాయి.
ఏటా బ్యాంకులు, సహకార బ్యాంకుల్లో చేసే డిపాజిట్ల మొత్తం రూ.10 లక్షలు మించకుండా చూసుకోవాలి.
పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేస్తుంటే ఆ ఆదాయం ఎలా వచ్చిందో స్పష్టమైన రికార్డులు కలిగి ఉండాలి.
యూపీఐ, నెఫ్ట్ లేదా ఆర్‌టీజీఎస్ వంటి డిజిటల్ లావాదేవీల ద్వారా మనం చేసిన చెల్లింపులన్నీ డిజిటల్ రూపంలో భద్రంగా ఉంటాయి.
ఐటీ రిటర్న్‌లో ఆదాయ మార్గాల వివరాలన్నీ వెల్లడించటం మంచిది.
ఐటీ అధికారులు పంపిన నోటీసుల్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే సానుకూలంగా సమాధానం ఇవ్వాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్ర క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం..
ముంబైలో కుప్పకూలిన మెట్రో పిల్లర్.. ఏం జరిగిందంటే.?