Share News

ఫార్మాపైనా యుద్ధ మేఘాలు

ABN , Publish Date - Mar 18 , 2026 | 02:21 AM

పశ్చిమాసియా యుద్ధం దేశీయ ఫార్మా పరిశ్రమను కలవర పెడుతోంది. ఈ యుద్ధంతో ముడి చమురు నుంచి తయారు చేసే ఫార్మా ప్రధాన ముడి పదార్ధాలైన బెంజిన్‌, టొల్యూన్‌, ఇథిలిన్‌ వంటి పెట్రో రసాయనాల...

ఫార్మాపైనా యుద్ధ మేఘాలు

  • ముడి పదార్ధాల సరఫరాకు అడ్డంకులు

  • కృత్రిమ కొరతతో ధరల పెంపు

  • కొండెక్కిన ఉత్పత్తి వ్యయాలు

పశ్చిమాసియా యుద్ధం దేశీయ ఫార్మా పరిశ్రమను కలవర పెడుతోంది. ఈ యుద్ధంతో ముడి చమురు నుంచి తయారు చేసే ఫార్మా ప్రధాన ముడి పదార్ధాలైన బెంజిన్‌, టొల్యూన్‌, ఇథిలిన్‌ వంటి పెట్రో రసాయనాల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆస్పిరిన్‌, పారాసిటమాల్‌, పెన్సిలిన్‌, యాంటీబయాటిక్స్‌, యాంటీహిస్టామైన్స్‌, సెడేటివ్స్‌ వంటి నిత్యావసర ఔషధాల తయారీకి ఈ పెట్రో రసాయనాలు కీలకం. ప్రస్తుతం దేశంలో వీటి నిల్వలు రెండు మూడు నెలల అవసరాలకు మించి లేవు. ఈ ఉద్రిక్తతలు ఎక్కువ రోజులు కొనసాగితే చైనా నుంచి సరఫరా అయ్యే యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ) సరఫరాకీ కొరత తప్పదని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

కృత్రిమ కొరత

సందట్లో సడేమియాలా ప్రస్తుత పరిస్థితులను ఆసరాగా చేసుకుని ఈ పెట్రో రసాయనాలను ఫార్మా కంపెనీలకు సరఫరా చేసే కంపెనీలు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచేశాయి. దీంతో ఫార్మా కంపెనీల ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోయాయి. ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు నిత్యావసర ఔషధాల ధరలు పెంచేందుకు అనుమతించాలని ఫార్మా కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి. వ్యాధి నిర్ధారణ పరికరాల్లో ఉపయోగించే ప్లాస్టిక్‌ విడి భాగాల ధరలైతే గత రెండు వారాల్లో దాదాపు 50 శాతం పెరిగాయి. సిరంజీలు, క్యాథెటెర్స్‌ వంటి వాటి తయారీ కోసం ఉపయోగిస్తున్న పీఎన్‌జీ గ్యాస్‌ ధర పెరగటం కూడా ఇందుకు కారణంగా ఉంది.


మూడింతలు పెరిగిన రవాణా చార్జీలు

మన దేశం నుంచి పెద్ద మొత్తంలో జెనరిక్‌ ఔషధాలు, వ్యాక్సిన్లు అమెరికా, యూరప్‌, అఫ్రికా, పశ్చిమాసియా దేశాలకు ఎగుమతవుతాయి. అతితక్కువ లాభాలతోనే మన కంపెనీలు ఈ దేశాలకు నాణ్యమైన జెనరిక్‌ ఔషధాలు ఎగుమతి చేస్తున్నాయి. ప్రస్తుత ఉద్రిక్తతలతో ఉత్పత్తి వ్యయాలతో పాటు రవాణా ఖర్చు లు భారీగా పెరిగిపోయాయి. తాజా ఉద్రిక్తత ల తో అమెరికా, యూరప్‌ దేశాలకు జరిగే నౌకా రవాణా ఎర్ర సముద్రం, హోర్ముజ్‌ జలసంధికి బదులు కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ నుంచి వెళ్లాల్సి వస్తోంది. దీంతో కంటైనర్‌ చార్జీలు రెండు మూడు రెట్లు, విమాన రవాణా చార్జీలు 15 నుంచి 30 శాతం వరకు పెరిగాయి. రవాణా సమయం కూడా 10-15 రోజులు అదనంగా పెరిగింది.

ప్రభుత్వమే ఆదుకోవాలి

దీంతో కాంట్రాక్టు ప్రకారం పాత ధరలతో ఈ ఔషదాలు ఎగుమతి చేస్తే నష్టాలు తప్ప లాభాలు మిగిలే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాన ముడి పదార్ధాల ధరలను నియంత్రించడంతో పాటు పెరిగిన నౌకా, విమాన రవాణ చార్జీల్లో కొంత ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తే తప్ప ప్రస్తుత పరిస్థితి నుంచి గట్టెక్కే మార్గం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి..

సెలవు ఇవ్వలేదని.. బ్యాంక్ మేనేజర్‌ను కాల్చేసిన గార్డ్..

మీ కళ్లకు పరీక్ష.. ఈ గడ్డిలో పాము ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 18 , 2026 | 02:21 AM