Share News

ఆన్‌లైన్‌లో అద్దె చెల్లిస్తున్నారా..? అయితే ఈ విషయాల్లో జాగ్రత్త..!

ABN , Publish Date - Aug 19 , 2026 | 12:24 PM

ఇంటి అద్దెను యూపీఐ లేదా ఇతర ఆన్‌లైన్ మార్గాల్లో చెల్లించడం వల్ల సిబిల్ స్కోర్ దెబ్బతింటుందా? క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లించి.. బిల్లును ఆలస్యంగా రీపేమెంట్ చేస్తే ఏమవుతుంది? సిబిల్ స్కోర్ దెబ్బతినకుండా ఉండాలంటే ఏం చేయాలి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

ఆన్‌లైన్‌లో అద్దె చెల్లిస్తున్నారా..? అయితే ఈ విషయాల్లో జాగ్రత్త..!

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా ఇప్పుడు డిజిటల్ యుగం నడుస్తోంది. అందరూ డిజిటల్ చెల్లింపులకే అలవాటు పడ్డారు. కారు దగ్గర నుంచి కాఫీ వరకు ఏది కొనాలన్న నగదు రహిత లావాదేవీలనే ఆశ్రయిస్తున్నారు. ఇంటి అద్దెను కూడా ఆన్‌లైన్‌లో చెల్లించడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఇలాంటి చెల్లింపులు క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఆన్‌లైన్‌లో అద్దె చెల్లించినంత మాత్రాన క్రెడిట్ స్కోరుకు వాటిల్లే ముప్పేమీ లేదని, కానీ ఈ చెల్లింపులకు సంబంధించిన ఆర్థిక ప్రవర్తన స్కోరుపై ప్రభావం చూపుతుందని రెంటన్‌పే సీఈఓ సారిక శెట్టి తెలిపారు. ఒకవేళ అద్దెను క్రెడిట్‌పై తీసుకుని కడితే, దాన్ని సక్రమంగా తిరిగి చెల్లించాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఆలస్యం జరిగితే క్రెడిట్ స్కోరుపై దెబ్బపడుతుందని చెప్పుకోచ్చారు.


క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లిస్తే..

కొంతమంది నెలవారీ అద్దెను క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తుంటారు. ఇలా చెల్లించడం వల్ల అద్దె మొత్తం కార్డు బకాయిలో చేరుతుంది. ఆ మొత్తాన్ని గడువులోగా పూర్తిగా చెల్లించకుండా వాయిదా వేస్తే వడ్డీ, ఇతర ఛార్జీలు పెరగడంతో పాటు క్రెడిట్ వినియోగం కూడా పెరగవచ్చు. అధిక క్రెడిట్ వినియోగం, రీపేమెంట్‌లో ఆలస్యం లేదా మిస్‌డ్ పేమెంట్లు సిబిల్ స్కోర్(CIBIL)పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.


‘మినిమమ్ డ్యూ’ మాత్రమే కడుతున్నారా?

క్రెడిట్ కార్డు బిల్లులో మినిమమ్ డ్యూ అమౌంట్ మాత్రమే చెల్లించడం వల్ల ఆ నెల చెల్లింపు పూర్తయినట్టుగా భావించకూడదు. మిగిలిన బకాయిపై వడ్డీ, ఇతర ఛార్జీలు వర్తించే అవకాశం ఉంటుంది. సిబిల్(CIBIL) కూడా సకాలంలో, పూర్తి చెల్లింపులపై దృష్టి పెట్టాలని సూచిస్తోంది. అందువల్ల అద్దె కోసం క్రెడిట్ కార్డును తరచూ ఉపయోగించే వారు ప్రతి నెలా వచ్చే కార్డు బిల్లును పూర్తిగా, గడువులోగా చెల్లించే సామర్థ్యం ఉందా? లేదా? అనేది ముందుగానే చూసుకోవాలి.


అద్దెను ‘ఈఎంఐ’లా భావించండి..

ప్రతి నెల అద్దె ఒక తప్పనిసరి ఖర్చు. అందువల్ల దానిని ఇతర నెలవారీ బాధ్యతల మాదిరిగానే ముందుగానే బడ్జెట్ చేసుకోవడం మంచిది. అద్దె కోసం క్రెడిట్‌ను ఉపయోగిస్తే, దానికి సంబంధించిన కార్డు బిల్లును కూడా నెలవారీ ఆర్థిక బాధ్యతగా పరిగణించాలి. సకాలంలో చెల్లింపులు చేయడం వల్ల క్రెడిట్ హిస్టరీని మెరుగ్గా నిర్వహించుకోవచ్చు. మరోవైపు ఆలస్యాలు, బకాయిలు, అధిక వినియోగం వంటి అంశాలు రుణదాతల దృష్టిలో మీ క్రెడిట్ సామర్థ్యంపై ప్రభావం చూపవచ్చు.


యూపీఐ(UPI) ద్వారా అద్దె చెల్లిస్తే సమస్యా?

సాధారణంగా మీ బ్యాంకు ఖాతా నుంచి యూపీఐ ద్వారా నేరుగా అద్దె చెల్లించడం వల్ల సిబిల్ స్కోర్ తగ్గదు. సిబిల్ స్కోర్ ప్రధానంగా రుణాలు, క్రెడిట్ కార్డులు వంటి క్రెడిట్ ఖాతాలకు సంబంధించిన చెల్లింపు చరిత్ర, క్రెడిట్ వినియోగం తదితర సమాచారంపై ఆధారపడుతుంది. అయితే అద్దె చెల్లించేందుకు క్రెడిట్ కార్డు, లోన్ లేదా ఇతర క్రెడిట్ సదుపాయాన్ని ఉపయోగించినప్పుడు దాని రీపేమెంట్‌ను నిర్లక్ష్యం చేయకూడదు.


ఆన్‌లైన్ అద్దె చెల్లింపుల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

  • నమ్మకమైన, సురక్షితమైన ప్లాట్‌ఫామ్‌నే ఉపయోగించాలి.

  • చెల్లింపునకు ముందు గ్రహీత వివరాలను సరిచూసుకోవాలి.

  • ప్రతి నెల అద్దె చెల్లించిన తర్వాత ట్రాన్సాక్షన్ రసీదు/స్క్రీన్‌షాట్ భద్రపరచుకోవాలి.

  • క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే బిల్లును గడువులోగా చెల్లించాలి.

  • వీలైనంత వరకు మొత్తం కార్డు బిల్లును చెల్లించాలి. కేవలం మినిమమ్ డ్యూ‌పై ఆధారపడకూడదు.

  • క్రెడిట్ కార్డు పరిమితిలో అధిక భాగాన్ని నిరంతరం ఉపయోగించకుండా జాగ్రత్తపడాలి. అధిక క్రెడిట్ యుటిలైజేషన్ క్రెడిట్ ప్రొఫైల్‌పై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.

  • మీ సిబిల్ రిపోర్టును క్రమం తప్పకుండా పరిశీలించి, గుర్తు తెలియని ఖాతాలు/ఎంక్వైరీలు ఉంటే వెంటనే సంబంధిత సంస్థను సంప్రదించాలి.

  • సిబిల్ ప్రతి క్యాలెండర్ ఇయర్‌లో ఒక ఉచిత సిబిల్ స్కోర్ అండ్ రిపోర్ట్‌ను(CIBIL Score & Report)ను అందిస్తోంది.

Updated Date - Aug 19 , 2026 | 12:24 PM