Share News

చమురు, బులియన్‌ ధరల సెగ

ABN , Publish Date - May 27 , 2026 | 05:33 AM

చమురు సెగ, బులియన్‌ మార్కెట్‌ ఆర్థికవేత్తలను సైతం భయపెడుతోంది. ఈ ప్రభావం రిటైల్‌ మార్కెట్‌పై పడి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-26)లో రిటైల్‌ ద్రవ్యోల్బణం...

చమురు, బులియన్‌ ధరల సెగ

ఆర్థికవేత్తల అంచనా

5 శాతానికి చేరనున్న రిటైల్‌ ద్రవ్యోల్బణం

  • ‘రెపో’ పెంపుపై ఆర్‌బీఐ వేచి చూసే ధోరణి

న్యూఢిల్లీ: చమురు సెగ, బులియన్‌ మార్కెట్‌ ఆర్థికవేత్తలను సైతం భయపెడుతోంది. ఈ ప్రభావం రిటైల్‌ మార్కెట్‌పై పడి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-26)లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5 శాతం మించి పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో 3.4 శాతంగా ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 3.48 శాతానికి చేరింది. గత 11 రోజుల్లో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపె నీలు (ఓఎంసీ) మూడు విడతలుగా లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను సగటున రూ.7.5 వరకు పెంచాయి. దీనికి తోడు బంగారం, వెండి దిగుమతులపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ నెల 13న 6 శాతం నుంచి ఒక్కసారిగా 15 శాతానికి పెంచింది. 3 శాతం ఐజీఎ్‌సటీని కూడా కలుపుకుంటే పసిడి, వెండి దిగుమతులపై 18 శాతం పన్ను పోటు పడుతుంది. దీంతో ఈ నెల (మే) రిటైల్‌ ద్రవ్యోల్బణం 4 నుంచి 4.5 శాతానికి, వచ్చే నెల (జూన్‌) 4.5 నుంచి 5 శాతానికి ఎగబాకే అవకాశం ఉందని ఈవై ఇండియా చీఫ్‌ పాలసీ అడ్వైజర్‌ డీకే శ్రీవాస్తవ చెప్పారు. మే నెల రిటైల్‌ ద్రవ్యోల్బణ వివరాలు జూన్‌ 12న విడుదలవుతాయి.

రెపో రేటు

యథాతథం!

రిటైల్‌ ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కీలక ‘రెపో’ రేటును పెంచడం భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) చేసే పని. అయితే రిటైల్‌ ద్రవ్యోల్బణం ప్రభుత్వ నిర్దేశిత 6 శాతానికి లోబడి ఉన్నంత వరకు ఆర్‌బీఐ ఇందుకు సిద్ధపడకపోవచ్చని భావిస్తున్నారు. దీంతో వచ్చే నెల 5న జరిగే ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో ఆర్‌బీఐ రెపో రేటును ప్రస్తుత 5.25 శాతం వద్దే కొనసాగించే అవకాశం ఉందని ఆర్థికవేత్తల అంచనా. ధరల సెగ ఇలానే కొనసాగి రిటైల్‌ ద్రవ్యోల్బణం 5 శాతం మించిపోతే మాత్రం ఆగస్టులో జరిగే ఎంపీసీ సమావేశం రెపో రేటు పెంపునకు మొగ్గు చూపుతుందని శ్రీవాస్తవ అన్నారు. అయుతే ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చి డైరెక్టర్‌ మేఘా ఆరోరా మాత్రం జూన్‌ నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం 4 శాతం మించినా, 5 శాతానికి చేరకపోవచ్చంటున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐకి నిర్దేశించిన 6 శాతం లక్ష్యానికి లోబడే ఉంటుంది. దీంతో జూలై వరకు దేశంలో కీలక వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చని భావిస్తున్నారు.


అక్టోబరు

నుంచి తప్పదు

పశ్చిమాసియా యుద్ధానికి ఇప్పట్లో తెరపడే సూచనలు కనిపించడం లేదు. అమెరికా-ఇరాన్‌ 90 రోజుల యుద్ధ విరమణకు అంగీకరించాయని వార్తలు వచ్చినా, అమెరికా మంగళవారం మరోసారి ఇరాన్‌పై విరుచుకుపడింది. దీంతో బ్యారల్‌ చమురు ధర 100 డాలర్లకు ఎగబాకింది. పరిస్థితులు ఇలానే కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరు నుంచి ఆర్‌బీఐ రెపో రేటును పెంచక తప్పదని బార్‌క్లేస్‌ ఇండియా ప్రధాన ఆర్థికవేత్త ఆస్థా గుద్వానీ చెప్పారు. గత నెలలో జరిగిన ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఈ ఆర్థిక సంవత్సరం బ్యారల్‌ చమురు ధర 85 డాలర్ల వద్ద కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం ఇది 100 నుంచి 115 డాలర్ల మధ్య దోబూచులాడుతోంది. దీంతో మన ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆటుపోట్లకు లోనవుతోంది.

ఈ నేపథ్యంలో జూన్‌ 5న జరిగే ఎంపీసీ సమావేశం ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు అంచనాలను కూడా 6.9 శాతం నుంచి 6.7 శాతానికి కుదించే అవకాశం ఉందని బార్‌క్లేస్‌ అంచనా. క్రిసిల్‌ పరపతి రేటింగ్‌ సంస్థ ప్రధాన ఆర్థికవేత్త దీప్తి దేశ్‌పాండే కూడా ఈ ఆర్థిక సంవత్సరం సగటు రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.1 శాతం వద్ద కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. బ్యారల్‌ చమురు సగటు ధర 95 డాలర్ల వద్ద కొనసాగినా, ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం 5 శాతం మించకపోవచ్చని ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్‌ చెప్పారు.

ఇవి కూడా చదవండి..

ఎండల్లో కూల్ టెక్నిక్.. స్కూటీకి ఏసీని ఎలా అమర్చాడో చూడండి..

నష్టాలతో ప్రారంభమై కోలుకున్నాయి.. సూచీలకు స్వల్ప లాభాలు..

Updated Date - May 27 , 2026 | 05:33 AM