NPS Vatsalya: వెయ్యి రూపాయలను ఇన్వెస్ట్ చేస్తే రూ.11.57 కోట్లు సొంతం చేసుకునే ఛాన్స్! ఎలాగంటే..
ABN , Publish Date - Jan 17 , 2026 | 07:27 PM
బిడ్డలకు ఆర్థిక భద్రతను కల్పించాలనుకునే తల్లిదండ్రులు అందరూ ఎన్‌పీఎస్ వాత్సల్య పథకంలో పెట్టుబడి పెట్టాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ పథకంలో దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా భారీ సంపదను సమకూర్చుకునే అవకాశం ఉందని అంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: తమ పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించాలని తల్లిదండ్రులందరూ కోరుకుంటారు. ఈ లక్ష్యం చేరుకునేందుకు ఉపకరించే పెట్టుబడి సాధనమే ‘ఎన్‌పీఎస్ వాత్సల్య యోజన’. చిన్న పిల్లల పేరిట ఇందులో పెట్టుబడి పెడితే వారి భవిష్యత్తుకు చక్కని భద్రత లభిస్తుంది (NPS Vatsalya).
ఇన్వెస్ట్‌మెంట్ ఇలా..
‘ఎన్‌పీఎస్ వాత్సల్య’లో నెల నెలా రూ.1000 పెట్టుబడి పెట్టిన కొన్నేళ్ల తరువాత కళ్లు చెదిరే మొత్తాన్ని సొంతం చేసుకోవచ్చని అనుభవజ్ఞులు చెబుతున్నారు. నవజాత శిశువులు మొదలు 18 ఏళ్ల లోపు మైనర్‌ల పేరిట ఎన్‌పీఎస్ వాత్సల్య పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. దీర్ఘకాలికంగా ఇది మంచి రాబడిని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు 60 ఏళ్ల పాటు నెలకు రూ.వెయ్యి చొప్పున పెట్టుబడులను కొనసాగిస్తే మొత్తం రూ.11.57 కోట్ల సంపద సమకూరే అవకాశం ఉంటుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు. ముఖ్యంగా చివరి 20 ఏళ్లల్లో సంపద వృద్ధి అమితంగా ఉంటుందని అంటున్నారు. ఇలాంటి దీర్ఘకాలిక పెట్టుబడుల్లో ఏటా 14 శాతం సగటు వార్షిక వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉంది. కాంపౌండింగ్ విధానంలో దీర్ఘకాలిక పెట్టుబడులు వేగంగా వృద్ధి చెందడమే ఈ స్థాయి రాబడులకు కారణమని ఫైనాన్షియల్ నిపుణులు చెబుతున్నారు.
ఇక వాత్సల్య పథకంలోని పెట్టుబడులను అవసరమైన సందర్భాల్లో పాక్షికంగా వెనక్కు తీసుకునే సౌలభ్యం కూడా ఉంది. విద్య, మెడికల్ ఎమర్జెన్సీ అవసరాల కోసం పెట్టుబడిలో గరిష్ఠంగా 25 శాతం వరకూ వెనక్కు తీసుకోవచ్చు. అయితే, పథకంలో చేరిన మూడేళ్ల తరువాతే ఇలాంటి విత్‌డ్రాల్స్‌కు అవకాశం ఉంటుంది. అది కూడా 18 ఏళ్ల లోపు రెండు మార్లు, ఆపై 21 ఏళ్ల లోపు మరో రెండు సార్లు ఇలా పెట్టుబడిని విత్‌డ్రా చేసుకోవచ్చు.
పిల్లలు మేజర్లు అయ్యాక ఎన్‌పీఎస్ వాత్సల్య అకౌంట్‌ను సాధారణ ఎన్‌పీఎస్ అకౌంట్‌లా వారే స్వయంగా నిర్వహించుకోవచ్చు. కాబట్టి, తమ సంతానానికి ఆర్థిక భద్రతను కల్పించాలనుకునే వారికి ఈ పథకంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చదవండి:
తక్కువ పెట్టుబడితో భారీ లాభాలిచ్చే బిజినెస్.. ఒక్కసారి ట్రై చేసి చూడండి..
ఇంట్లో కంప్యూటర్ ఉంటే చాలు.. ఈ ఐడియాతో లక్షల్లో సంపాదన..