బ్యాంకర్లూ హద్దులు దాటొద్దు
ABN , Publish Date - Feb 24 , 2026 | 06:37 AM
అవసరం ఉన్నా లేకపోయినా బ్యాంకులు ఖాతాదారులకు బీమా పాలసీలు, ఇతర ఆర్థిక పెట్టుబడుల ఉత్పత్తులను అంటగట్టడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు....
కీలక వ్యాపారాలే మీకు ముఖ్యం
బీమా పాలసీలతో వేధించవద్దు
పసిడి దిగుమతులపై బేఫికర్
పీఎ్‌సబీల విలీనాలపై ఇంకా రోడ్‌మ్యాప్ లేదు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ముంబై: అవసరం ఉన్నా లేకపోయినా బ్యాంకులు ఖాతాదారులకు బీమా పాలసీలు, ఇతర ఆర్థిక పెట్టుబడుల ఉత్పత్తులను అంటగట్టడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పద్దతులకు స్వస్తి చెప్పి తమ కీలక వ్యాపారమైన డిపాజిట్ల సేకరణ, రుణ వితరణపై దృష్టి పెట్టాలని కోరారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కేంద్ర బోర్డు సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గృహ రుణం, వాహన రుణం ఇలా ఏ రుణం తీసుకున్నా బ్యాంకులు బలవంతంగా తమ చేత ఏదో ఒక బీమా పాలసీ కొనిపిస్తున్నాయని ఇటీవల బ్యాంకు ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు పెరిగి పోయాయి. ఈ అక్రమాలకు చెక్ పెడుతూ ఆర్‌బీఐ ఇటీవల కొన్ని మార్గదర్శకాలు విడుదల చేయడంపై ఆర్థిక మంత్రి సీతారామన్ హర్షం వ్యక్తం చేశారు.
బంగారం ధరలు
కేంద్ర బ్యాంకులు భారీగా కొనడం వల్లే భారత్‌తో పాటు ప్రపంచవ్యాపం్తగా బంగారం ధరలు అనూహ్యంగా పెరిగాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రభుత్వం, ఆర్‌బీఐ పసిడి దిగుమతులను నిశితంగా గమనిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతానికైతే ఈ దిగుమతులు ఆందోళనకర స్థాయిలో లేవన్నారు. గత ఏడాది ఏప్రిల్-డిసెంబరు మధ్య కాలంలో మన పసిడి దిగుమతులు 5,000 కోట్ల డాలర్లకు చేరాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది వంద కోట్ల డాలర్లు మాత్రమే ఎక్కువని సీతారామన్ చెప్పారు.
సుంకాలపై ఇప్పుడే ఏమీ చెప్పలేం
ట్రంప్ సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టి వేయడంపై మాట్లాడేందుకు ఆర్థిక మంత్రి నిర్మల నిరాకరించారు. ఈ అంశంపై ఇప్పుడు మాట్లాడడం తొందరపాటు అవుతుందన్నారు. ఈ తీర్పు పర్యవసానాలను కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సమీక్షిస్తోందన్నారు.
పీఎస్‌బీల విలీనాలు
ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) విలీనాలకు సంబంధించి ప్రస్తుతం తమ వద్ద ఎలాంటి రోడ్‌మ్యాప్ లేదని సీతారామన్ స్పష్టం చేశారు. అయితే వికసిత భారత్ కోసం ఏర్పాటు చేసే ఉన్నత స్థాయి బ్యాంకింగ్ కమిటీ ఈ విషయాన్ని పరిశీలిస్తుందన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన ఈ కమిటీ విధివిధానాలను ఇంకా రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం జరిగిన ఆర్‌బీఐ కేంద్ర బోర్డు సమావేశంలోనూ పీఎ్‌సబీల విలీనంపై చర్చించలేదన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాధన సాకారం కావాలంటే దేశంలో మూడు నాలుగు అంతర్జాతీయ స్థాయి మెగా బ్యాంకులు ఏర్పడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడున్న 12 పీఎ్‌సబీల విలీనాల ద్వారా ఈ లక్ష్యం సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
పాపం.. స్నేహితుడికి సాయం చేయాలనుకున్నాడు.. రూ.7 కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్నాడు..