బ్యాంకింగ్‌లో కొత్త నిబంధనలు
ABN , Publish Date - Mar 29 , 2026 | 02:45 AM
ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతోంది. అదే సమయంలో బ్యాంకింగ్‌లోనూ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అవేమిటంటే...
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి.. పెరగనున్న సర్వీస్ చార్జీలు
ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతోంది. అదే సమయంలో బ్యాంకింగ్‌లోనూ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అవేమిటంటే?
సేఫ్టీ రూల్స్
ఇటీవల డిజిటల్ బ్యాంకింగ్ బాగా పెరిగిపోయింది. దీంతో సైబర్ కేటుగాళ్లూ పెరిగిపోయారు. డెబిట్, క్రెడిట్ కార్టులతో పాటు వాటి పిన్ నంబర్లనీ చోరీ చేసి ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులు డిజిటల్ లావాదేవీల చెల్లింపుల కోసం రెండంచెల సేఫ్టీ విధానాలను అమలు చేయబోతున్నాయి. ఈ లావాదేవీల కోసం ఖాతాదారులు ఇక ఓటీపీ ఒక్కటి ఎంటర్ చేస్తే సరిపోదు. పాస్‌వర్డ్‌తో పాటు ఎంపిన్ (మొబైల్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్) కూడా ఎంటర్ చేస్తేనే ఆ లావాదేవీ పూర్తవుతుంది. లావాదేవీల మొత్తం ఎక్కువగా ఉంటే చెకింగ్ ప్రాసెస్ మరింత కఠినంగా ఉంటుంది. దీనివల్ల చెల్లింపుల ప్రక్రియ కొంత ఆలస్యం కావచ్చు.
ఏటీఎం చార్జీలు పైకి
ప్రస్తుతం బ్యాంకు కస్టమర్లు తమకు ఖాతా ఉన్న బ్యాంకుల ఏటీఎంల నుంచి నెలకు ఐదు వరకు ఉచిత నగదు విత్‌డ్రాయల్స్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి కొన్ని బ్యాంకులు యూపీఐ ఆధారిత నగదు విత్‌డ్రాయల్స్‌ను కూడా ఇందులో కలుపుతున్నారు. అంటే యూపీఐ లేదా ఏటీఎం కార్డు ద్వారా ఇక నెలకు ఐదుసార్లు మాత్రమే నగదు తీసుకోవటానికి అనుమతిస్తారు. అంతకు మించితే ఒక్కో లావాదేవీకి రూ.23 చార్జీతో పాటు జీఎస్‌టీ బాదుడు తప్పదు. దీనివల్ల తరచు గా లేదా ఒక మాదిరిగా ఏటీఎం, యూపీఐ లావాదేవీలు చేసే ఖాతాదారులపై ఏడాదికి రూ.400 నుంచి రూ.800 వరకు భారం పడుతుందని భావిస్తున్నారు.
ఏటీఎం విత్‌డ్రాయల్స్‌పై పరిమితి
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) వంటి కొన్ని బ్యాంకులు డెబిట్ కార్డుల ద్వారా చేసే నగదు ఉపసంహరణలపై పరిమితులు పెట్టాయి. డెబిట్ కార్డు ద్వారా రోజూ ఒకేసారి పెద్దమొత్తంలో నగదు విత్‌డ్రా చేసే వారిపై ఇది తీవ్ర ప్రభావం చూపించనుంది. దీంతో ఇక వీరు ఈ కార్డుల ద్వారా అనేక సార్లు లేదా డిజిటల్ లావాదేవీల ద్వారా తమ నగదు విత్‌డ్రాయల్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
మార్పులు ఎందుకంటే?
దేశంలో డిజిటల్ బ్యాంకింగ్ కార్యకలాపాలు ముఖ్యంగా యూపీఐ ఆధారిత కార్యకలాపాల పరిమాణం భారీగా పెరిగిపోతోంది. దీంతో సైబర్ మోసాలు పెరిగిపోయి రక్షణ ఏర్పాట్లను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఖర్చులు పెరిగి పోవడంతో బ్యాంకులు ఏటీఎం సర్వీస్ చార్జీలు పెంచక తప్పడం లేదు
ఎవరిపై భారం?
తరచూ ఎటీఎంలు, యూపీఐ లావాదేవీలు జరిపే ఖాతాదారులు
బ్యాంకులు తరచుగా పంపించే అలర్ట్స్, స్టేట్‌మెంట్లు పెద్దగా చూడని ఖాతాదారులు
నగదు ఉపసంహరణలు ఎక్కువగా చేసే చిన్న వ్యాపారులు, రిటైరీలు
ఏం చేయాలంటే ?
మీ నెలవారీ ఏటీఎం, యూపీఐ ఉపసంహరణలు పరిమితులకు లోబడి ఉన్నాయో లేదో తరచూ చెక్ చేసుకోవాలి
సైబర్ కేటుగాళ్ల నుంచి రక్షణ కోసం బ్యాంకులు సూచించిన అన్ని భద్రతా నిబంధనలు పాటించడం
తరచుగా బ్యాంకులు పంపించే అలర్ట్‌లు, లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం
ఏదైనా లావాదేవీపై అనుమానం వస్తే వెంటనే బ్యాంకుకు తెలియజేయాలి
వీలైనంత వరకు విత్‌డ్రాయల్స్‌తగ్గించి డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత ఇవ్వడం
మోసాల నుంచి రక్షణ
కొత్త నిబంధనలతో బ్యాంకింగ్ మోసాలకు కూడా చెక్‌పడనుంది. అదెలాగంటే ?
బ్యాంకు నిర్లక్ష్యం కారణంగా లేదా ఏదైనా మోసంతో ఖాతాదారుడు నష్టపోతే మూడు రోజుల్లోగా ఆ విషయాన్ని బ్యాంకుకు తెలియజేస్తే.. ఖాతాదారుడు మోసపోయిన సొమ్ముకు పూర్తి రక్షణ లభిస్తుంది
ఒకేవేళ నాలుగు నుంచి ఏడు రోజుల్లో తెలియజేసినా పరిమిత స్థాయులో రక్షణ లభిస్తుంది
మోసాల ఫిర్యాదుల కోసం బ్యాంకులు 24 గంటలు పని చేసేలా ఒక రిపోర్టింగ్ చానల్ ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించాలి
ఇవీ చదవండి:
పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!
గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు