Share News

ఏపీలో నాల్కో అల్యూమినియం స్మెల్టర్‌ ప్లాంట్‌

ABN , Publish Date - Sep 30 , 2026 | 02:55 AM

ఆంధ్రప్రదేశ్‌లో 5 లక్షల టన్నుల సామర్థ్యంతో కూడిన అల్యూమినియం స్మెల్టర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగానికి చెందిన నేషనల్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌ (నాల్కో) యోచిస్తోంది.

ఏపీలో నాల్కో అల్యూమినియం స్మెల్టర్‌ ప్లాంట్‌
NALCO

కోల్‌కతా: ఆంధ్రప్రదేశ్‌లో 5 లక్షల టన్నుల సామర్థ్యంతో కూడిన అల్యూమినియం స్మెల్టర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగానికి చెందిన నేషనల్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌ (నాల్కో) యోచిస్తోంది. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు నాల్కో సీఎండీ బీపీ సింగ్‌ మంగళవారం తెలిపారు. నాల్కో ఉత్పత్తి చేసే అల్యూమినం ఆక్సైడ్‌ (అల్యూమినా) నుంచి స్వచ్ఛమైన అల్యూమినియంను వెలికి తీసేందుకు ఈ ప్లాంట్‌ తోడ్పడుతుంది. నాల్కో ప్రస్తుతం ఏడాదికి 21 లక్షల టన్నుల అల్యూమినా ఉత్పత్తి చేస్తోంది. 2027-28 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించనున్న కొత్త రిఫైనరీతో ఈ సామర్థ్యం 31 లక్షల టన్నులకు చేరుకోనుంది.

అలాగే, కంపెనీ ప్రస్తుతం 1.3 లక్షల టన్నుల అల్యూమినాను విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ఏపీలో ప్రారంభించాలనుకుంటున్న అల్యూమినియం స్మెల్టర్‌ ప్లాంట్‌ ద్వారా కంపెనీ ఉత్పత్తి చేసే మొత్తం అల్యూమినాను స్వచ్ఛమైన అల్యూమినియంగా మార్చుకొని దేశీయంగా విక్రయించాలనుకుంటున్నట్లు సింగ్‌ తెలిపారు.

Updated Date - Sep 30 , 2026 | 03:07 AM