సబ్సిడీల భారం తడిసి మోపెడు
ABN , Publish Date - Mar 30 , 2026 | 02:43 AM
పశ్చిమాసియా యుద్ధం భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాల్‌గా మారుతోందని ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ తాజాగా ఒక నివేదికలో హెచ్చరించింది. ‘2026 పశ్చిమాసియా యుద్ధం, దాని...
తగ్గనున్న ఎన్‌ఆర్‌ఐల నిధుల ప్రవాహం
డాలర్‌తో 96 స్థాయికి రూపాయి
ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ అంచనా
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాల్‌గా మారుతోందని ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ తాజాగా ఒక నివేదికలో హెచ్చరించింది. ‘2026 పశ్చిమాసియా యుద్ధం, దాని పర్యవసానాలు’ పేరుతో ఈ సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. ఈ యుద్ధంతో ప్రభుత్వాలపై సబ్సిడీల భారం ముఖ్యంగా ఎరువుల సబ్సిడీల భారం రూ.30,000 కోట్ల మేర పెరుగుతుందని హెచ్చరించింది. ఎరువుల పరిశ్రమకు ప్రధాన ముడి పదార్ధమైన ఎల్‌ఎన్‌జీ, అమ్మోనియా సరఫరాలకు ఇప్పటికే ఆటంకాలు ఏర్పడి ధరలు పెరిగిన విషయాన్ని గుర్తు చేసింది. ఇవి చాలవన్నట్టు దిగుమతి చేసుకునే యూరియా, డీఏపీ ఎరువుల ధరలు ఇప్పటికే 50 నుంచి 100ు కొండెక్కాయని తెలిపింది. పెరుగుతున్న చమురు ధర దేశ విదేశీ చెల్లింపులను కూడా దెబ్బతీయనుందని తెలిపింది. బ్యారెల్ ముడి చమురు ధర 10 డాలర్లు పెరిగినా, దేశ మూలధన ఖాతా లోటు (సీఏడీ) 1,500 కోట్ల డాలర్లు (సుమారు రూ.1.4 లక్షల కోట్లు) పెరిపోతుందని అంచనా వేసింది.
ఎన్‌ఆర్‌ఐలకూ కష్టాలే : పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఆ ప్రాంతంలోని ప్రవాస భారతీయులు మన దేశానికి పంపించే నిధులపైనా పడనుందని తెలిపింది. ఏటా ఎన్‌ఆర్‌ఐలు మన దేశానికి పంపించే నిధుల్లో 38ు ఈ ప్రాంతం నుంచే వస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. తాజా యుద్ధ ప్రభావంతో ఇరాన్‌కు చేరువలో ఉన్న యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ వంటి దేశాల్లో ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోవడంతో అక్కడి ఎన్‌ఆర్‌ఐలు పనులు లేక ఖాళీగా కూర్చున్నట్టు తెలిపింది. ఇది వారు దేశానికి పంపించే నిధులనూ ప్రభావితం చేస్తుందని అంచనా వేసింది.
రూపాయి మరింత కిందికే !: గల్ఫ్ తాజా యుద్ధంతో డాలర్‌తో రూపాయి మారకం రేటు ఇప్పటికే ‘బేర్’మంటోంది. ప్రస్తుతం రూ.94 పైన ట్రేడవుతోంది. ఈ యుద్ధానికి త్వరలో ముగింపు లేకపోతే స్వల్ప కాలంలోనే రూపాయి 96 స్థాయిని తాకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఎఫ్‌పీఐల ప్రస్తుత భారీ అమ్మకాలకు ఈ భయాలే ప్రధాన కారణమని ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ పేర్కొంది.
ఇలా ఎదుర్కొందాం: సిఐఐ
కీలక ముడి పదార్ధాలు, ఇంధనం, తుది వస్తువుల తయారీకి అవసరమైన వస్తువుల నిల్వలు పెంచుకోవాలి.
భవిష్యత్‌లో ఎదురయ్యే సరఫరా ఆటంకాలను తట్టుకునేలా మౌలిక సదుపాయాలు, నిల్వల వ్యవస్థలను మెరుగుపరుచుకోవాలి.
ఇంధన ధరలను స్థిరంగా ఉంచుకోవడం ద్వారా లాజిస్టిక్స్ ఖర్చులు, ధరలను అదుపు చేయాలి.
సరఫరా ఆటంకాలను అధిగమించేందుకు కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలి.
పరిశ్రమ వర్గాలు శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంఽధనాలకు త్వరగా మారాలి.
కంపెనీలు తమ క్యాంటిన్లలో ఎల్‌పీజీకి బదులు ఎలక్ట్రిక్ లేదా బయో ఇంధనాలు వినియోగించేలా ప్రోత్సహించాలి.
అంతర్గత సామర్ధ్యాలు పెంచుకోవడం ద్వారా కంపెనీలు ఉద్యోగ రక్షణ పాటించాలి.
త్వరిత చెల్లింపుల ద్వారా పెద్ద కంపెనీలు ఎంఎ్‌సఎంఈలను ఆదుకోవాలి.
ఎగుమతిదారులు, తయారీదారులు తమ రిస్క్ మేనేజ్‌మెంట్ సామర్ధ్యాన్ని పెంచుకోవాలి.
ఇవీ చదవండి:
పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!
గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు