తడిసి మోపెడవుతున్న ఏఐ ఖర్చులు.. మైక్రోసాఫ్ట్ పొదుపు చర్యలు
ABN , Publish Date - Jul 08 , 2026 | 07:58 PM
ఏఐ అవసరాల కోసం ఇతర కంపెనీలపై ఎక్కువగా ఆధారపడే మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం సొంతంగా ఏఐ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటోంది. ఏఐ ఖర్చుల భారం పెరుగుతున్న నేపథ్యంలో సొంత మోడల్స్‌పై దృష్టి సారించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐ ఖర్చుల భారం అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ పొదుపు మంత్రం పఠిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మైక్రోసాఫ్ట్ గత కొంతకాలంగా తన యాప్స్‌లో ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ సంస్థల ఏఐ మోడల్స్‌ను వినియోగిస్తోంది. అయితే, ఇటీవల వీటిని పక్కన పెట్టి సొంతంగా అభివృద్ధి చేసుకున్న మోడల్స్‌ను యాప్స్‌లో వినియోగిస్తున్నట్టు సమాచారం. ఎక్సెల్, ఔట్‌లుక్ వంటి వాటిల్లో ప్రస్తుతం ఎమ్ఏఐ మోడల్ యూజర్ల ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ వార్తలపై మైక్రోసాఫ్ట్ ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
మైక్రోసాఫ్ట్ ప్లాన్ ఇదీ..
మైక్రోసాఫ్ట్ సొంతంగా అభివృద్ధి చేసుకున్న మోడల్స్ ప్రస్తుతం సంస్థలోని కొన్ని పనులను మాత్రమే చేస్తున్నాయి. అయితే, సొంత ఏఐ మోడల్స్ వైపు మైక్రోసాఫ్ట్ మళ్లుతోందంటే వాటి సామర్థ్యం గతంలో కంటే మెరుగైనట్టేనని నిపుణులు చెబుతున్నారు. మరింత తక్కువ ఖర్చుతో వీటిని మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేయగలుగుతోందని అంటున్నారు. సొంతంగా అభివృద్ధి చేసుకున్న మోడల్స్ వినియోగాన్ని పెంచుతున్నామని మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం చీఫ్ సులేమాన్ జూన్ లోనే వెల్లడించారు. ఓపెన్ ఏఐ సంస్థతో మైక్రోసాఫ్ట్‌కు సుదీర్ఘ భాగస్వామ్యం ఉంది. ఫలితంగా ఓపెన్ ఏఐ మోడల్స్ కాస్త తక్కువ ధరకే మైక్రోసాఫ్ట్‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇలా ఎక్కువ కాలం కొనసాగదని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. సొంతంగా ఏఐ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి సారించింది.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. ఒక్కరోజులో రూ.8.4 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి
ఈపీఎఫ్‌ఓ చందాదారులకు గుడ్‌న్యూస్..!