Share News

మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ లేఆఫ్స్.. 4,800 మంది ఉద్యోగుల తొలగింపు

ABN , Publish Date - Jul 06 , 2026 | 09:47 PM

మైక్రోసాఫ్ట్‌లో మరోసారి లేఆఫ్స్ జరిగాయి. దాదాపు 4,800 మంది ఈసారి ఉద్వాసనకు గురయ్యారు. సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో సుమారు 2.1 శాతం మంది ఈసారి లేఆఫ్స్‌లో జాబ్స్ కోల్పోయారు.

మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ లేఆఫ్స్.. 4,800 మంది ఉద్యోగుల తొలగింపు
Microsoft Layoffs

ఇంటర్నెట్ డెస్క్: మైక్రోసాఫ్ట్‌లో మరోసారి లేఆఫ్స్ జరిగాయి. దాదాపు 4,800 మంది ఈసారి ఉద్వాసనకు గురయ్యారు. సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో సుమారు 2.1 శాతం మంది ఈసారి లేఆఫ్స్‌లో జాబ్స్ కోల్పోయారు. నూతన ఆర్థిక సంవత్సరంలో కాలుపెట్టిన తరుణంలో ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది.

మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ ఏమీ కోల్‌మన్ ఈ లేఆఫ్స్ గురించి ఉద్యోగులకు అంతర్గత నోటీసులో తెలియజేశారు. మైక్రోసాఫ్ట్ కార్యకలాపాల్లో వస్తున్న మార్పుల్లో భాగంగా లేఆఫ్స్ చేపట్టామని తెలిపారు. కస్టమర్లు, పెట్టుబడులు, ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో లేఆఫ్స్ తప్పలేదని వ్యాఖ్యానించారు. వేగంగా మారిపోతున్న టెక్ రంగంలో కస్టమర్ల అంచనాలను అందుకునేందుకు మైక్రోసాఫ్ట్ శ్రమిస్తోందని తెలిపారు. ఈ ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేయడం లేదని కూడా కోల్‌మన్ స్పష్టం చేశారు. అయితే, ఏఐతో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని అన్నారు.


కొత్త ఆర్థిక సంవత్సరంలో కాలు పెట్టే ఈ సమయంలో మైక్రోసాఫ్ట్‌లో ఏటా తొలగింపులు చోటుచేసుకుంటూ ఉంటాయి. గతేడాది మేలో 6 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రస్తుతం సంస్థలో సుమారు 2.2 లక్షల మంది ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

మైక్రోసాఫ్ట్ పనితీరుపై ఇన్వెస్టర్లలో అసంతృప్తి కనిపిస్తున్న తరుణంలో లేఆఫ్స్ చోటుచేసుకున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏఐపై మైక్రోసాఫ్ట్ భారీగా పెట్టుబడులు పెడుతుండటంతో సంస్థ ఇన్వెస్టర్లలో ఆందోళన కనిపిస్తోంది. పెట్టుబడికి తగిన రాబడి ఎప్పుడు వస్తుందన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెలలో మైక్రోసాఫ్ట్ షేర్ విలువ 19 శాతం మేర పడిపోయింది.


ఈ వార్తలనూ చదవండి:

చమురు ఉత్పత్తిని పెంచాలని ఒపెక్‌ ప్లస్‌ నిర్ణయం

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

Updated Date - Jul 06 , 2026 | 09:56 PM