Share News

చమురు ఉత్పత్తిని పెంచాలని ఒపెక్‌ ప్లస్‌ నిర్ణయం

ABN , Publish Date - Jul 06 , 2026 | 11:08 AM

పశ్చిమాసియాలో ఉద్రిక్తత తగ్గిన నేపథ్యంలో ముడి చమురు ఉత్పత్తి పెంచాలని ఒపెక్ ప్లస్ (OPEC+) కూటమికి చెందిన 7 దేశాలు నిర్ణయం తీసుకున్నాయి.

చమురు ఉత్పత్తిని పెంచాలని ఒపెక్‌ ప్లస్‌ నిర్ణయం
OPEC+ oil production

ఇంటర్‌‌నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తత తగ్గిన నేపథ్యంలో ముడి చమురు ఉత్పత్తి పెంచాలని ఒపెక్ ప్లస్ (OPEC+) కూటమికి చెందిన 7 దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఒపెక్ ప్లస్‌కు చెందిన సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, కువైట్, కజక్‌స్థాన్‌, అల్జీరియా, ఒమన్ దేశాలు ఆగస్టు నుంచి రోజుకు 1,88,000 బారెళ్ల అదనపు ఆయిల్ ఉత్పత్తి చేయడానికి అంగీకరించాయి. ఒపెక్ కూటమి నెలవారీ ఆయిల్ ఉత్పత్తిని పెంచడం ఇది వరుసగా ఐదవసారి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలను స్థిరంగా ఉంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


ఆయిల్ ఉత్పత్తిని పెంచడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో చమురు కొరత లేకుండా చూస్తూనే.. ధరలు మరీ పడిపోకుండా సమతుల్యతను కాపాడాలని ఒపెక్ భావిస్తోంది. గ్లోబల్ మార్కెట్లో చమురు ధరల్లో వచ్చే మార్పులు ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు, ద్రవ్యోల్బణంపై నేరుగా ప్రభావం చూపుతాయి. గత మార్చి నెలలో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 120 డాలర్ల వరకు చేరింది.


ఇప్పుడు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో ధరలు మళ్లీ పాత స్థితికి చేరుకున్నాయి. ప్రస్తుతం బ్యారెల్‌ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 72 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఒపెక్ ప్లస్ దేశాల అదనపు ఆయిల్ ఉత్పత్తి వల్ల భారత్ లాంటి చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే దేశాలకు కొంత ఉపశమనం లభించనుంది. దేశంలో చమురు ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి

వింబుల్డన్ ఓపెన్: చరిత్ర సృష్టించిన జకోవిచ్.. ఫెదరర్ రికార్డు బద్దలు

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

Updated Date - Jul 06 , 2026 | 11:36 AM