Share News

మార్కెట్లో రికవరీ సెన్సెక్స్‌

ABN , Publish Date - Jan 23 , 2026 | 03:10 AM

గ్రీన్‌లాండ్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక మెట్టు దిగి రావడం, భారత్‌తో వాణిజ్య ఒప్పందం త్వరలో సిద్ధం కానుందన్న సంకేతం ఇవ్వడంతో...

మార్కెట్లో రికవరీ సెన్సెక్స్‌

398 పాయింట్లు అప్‌

ముంబై: గ్రీన్‌లాండ్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక మెట్టు దిగి రావడం, భారత్‌తో వాణిజ్య ఒప్పందం త్వరలో సిద్ధం కానుందన్న సంకేతం ఇవ్వడంతో గురువారం ఈక్విటీ మార్కెట్లు రికవరీ బాట పట్టాయి. మూడు రోజుల నష్టాలకు తెర దించిన సెన్సెక్స్‌ 397.74 పాయింట్ల లాభంతో 82,307.37 వద్ద ముగియగా నిఫ్టీ 132.40 పాయింట్లు లాభపడి 25,289.90 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 873.55 పాయింట్లు, నిఫ్టీ 278.25 పాయింట్లు లాభపడినా ఆ స్థాయిల్లో నిలదొక్కుకోలేకపోయాయి. అయితే కనిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల మద్దతు లభించిందని విశ్లేషకులంటున్నారు. గ్రీన్‌లాండ్‌ విషయంలో అమెరికాకు, యూరోపియన్‌ దేశాలకు మధ్యన ఏర్పడిన అవగాహనతో ప్రపంచ స్థాయిలో ఉద్రిక్తతలు ఉపశమించడం ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు పురి గొల్పిందని వారన్నారు.

ఐపీఓ ద్వారా ఫోన్‌పేలో

వాల్‌మార్ట్‌ 12% వాటా విక్రయం

బెంగళూరు ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ఫోన్‌పే పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి రెడీ అవుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ ఐపీఓ ద్వారా ఫోన్‌పేలో వాల్‌మార్ట్‌ 12 శాతం వాటాను విక్రయించనుంది. దీంతో పాటు చిన్న వాటాదారులైన మైక్రోసాఫ్ట్‌, టైగర్‌ గ్లోబల్‌ కూడా తమ వాటాలు విక్రయించనున్నాయి. ఇష్యూలో భాగంగా మొత్తం 5.07 కోట్ల వాటాలు విక్రయించనున్నట్టు ఫోన్‌పే సెబీకి సవరణలతో సమర్పించిన తాజా దరఖాస్తులో తెలిపింది. అయితే ఈ ఐపీఓలో తాజా షేర్ల జారీ ఏమీ ఉండదు. కంపెనీ విలువను 1,500 కోట్ల డాలర్లుగా (రూ.1.44 లక్షల కోట్లు) పరిగణించి 150 కోట్ల డాలర్లు (రూ.14,400 కోట్లు) సమీకరించే అవకాశం ఉందని అంచనా. అక్టోబరులో టాటా క్యాపిటల్‌ జారీ చేసిన 170 కోట్ల డాలర్ల ఇష్యూ తర్వాత రెండో పెద్ద ఇష్యూ ఇదే అవుతుంది. కాగా ఫోన్‌ పేలో వాల్‌మార్ట్‌ 71.77ు వాటాలు కలిగి ఉంది. ఐపీఓ ద్వారా వాల్‌మార్ట్‌ 9 శాతానికి సమానమైన 4.59 కోట్ల షేర్లను విక్రయించనుంది.

ఇవి కూడా చదవండి..

అవును.. మా దగ్గర రహస్య ఆయుధాలు ఉన్నాయి.. షాకింగ్ న్యూస్ చెప్పిన అమెరికా అధ్యక్షుడు..

మీ బ్రెయిన్‌కు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో జిరాఫీ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Jan 23 , 2026 | 03:10 AM