Share News

మీ ఎల్పీజీ సిలిండర్‌లో గ్యాస్ తక్కువగా ఉందా? ఇలా చెక్ చేయండి..!

ABN , Publish Date - Aug 17 , 2026 | 11:25 AM

మీరు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌లో గ్యాస్.. ఉండాల్సినంతే ఉందా? లేక తక్కువ గ్యాస్ వస్తోందా? అసలు ఈ గ్యాస్ బరువు తూకం ఎలా వేయాలి.. వినియోగదారులు మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి.. పూర్తి వివరాల కోసం ఈ కథనం చదవండి..

మీ ఎల్పీజీ సిలిండర్‌లో గ్యాస్ తక్కువగా ఉందా? ఇలా చెక్ చేయండి..!

వంట గ్యాస్‌లో కమర్షియల్(వాణిజ్య) గ్యాస్, గృహ వినియోగ గ్యాస్ ఉంటుంది. హోటళ్లు, ఇతర వ్యాపార అవసరాల కోసం వాణిజ్య గ్యాస్‌ను వినియోగిస్తారు. దీని బరువు 19 కేజీలు ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీలలో వినియోగించే గ్యాస్ ఇంకాస్త ఎక్కువ బరువే ఉంటుంది. ఇక ఇళ్లలో వినియోగించే గ్యాస్ బరువు 14.2 కిలోలు ఉంటుంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ గ్యాస్ సిలిండర్లపై ప్రింట్/పెయింట్‌తో రాస్తారు. మరి మీరు వినియోగించే గ్యాస్ బరువు దానిపై పేర్కొన్నంతే ఉంటుందా? బరువు ఏమైనా తక్కువుగా ఉంటుందా? తాజాగా గ్యాస్ బరువుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ చర్చ నడుస్తోంది. ఓ వ్యక్తి తాను బుక్ చేసుకున్న గ్యాస్‌ సిలిండర్‌లో తక్కువ గ్యాస్ ఉందని ఆరోపిస్తూ వీడియో చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. గ్యాస్ బరువు అంశం చర్చనీయాంశంగా మారింది.

మీరు కూడా గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నారా? మీ గ్యాస్ సిలిండర్ బరువు తక్కువగా ఉందన్న అనుమానం వస్తోందా? అయితే, గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసే ముందు.. కొన్ని విషయాలను తప్పకుండా చెక్ చేయండి. తద్వారా గ్యాస్ సిలిండర్‌లో ఎంత గ్యాస్ ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు.


ఒక ఎల్పీజీ సిలిండర్‌లో ఎంత గ్యాస్ ఉంటుంది?

సాధారణంగా గృహాలలో వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్‌లో 14.2 కిలోల గ్యాస్ ఉంటుంది. ఇది గ్యాస్ బరువు. ఖాళీ సిలిండర్‌ బరువు వేరే ఉంటుంది. ఖాళీ సిలిండర్ బరువును టేర్ వెయిట్ అంటారు. ఖాళీ సిలిండర్ బరువు 15 నుంచి 15.6 కిలోల వరకు ఉంటుంది. ఇదే విషయం సిలిండర్‌పైనా రాసి ఉంటుంది. అంటే.. 14.2 కిలోల గ్యాస్ బరువు, 15.6 కిలోల సిలిండర్ బరువు మొత్తం కలిపి 29.8 కిలోల బరువు ఉండాలి. ఫుల్ సిలిండర్ తీసుకున్నప్పుడు, గ్యాస్ ఖాళీ అయిన తరువాత సిలిండర్ బరువును బేరీజు వేసుకుంటే మీకు ఎంత గ్యాస్ వస్తుందనేది క్లారిటీ వస్తుంది.

ఎల్పీజీ సిలిండర్ బరువు తక్కువగా ఉందని అనుమానం వస్తే.. వెంటనే గ్యాస్ డెలివరీ బాయ్‌ను అడిగి ఆ గ్యాస్ సిలిండర్‌ను తూకం వేయవచ్చు. సరైన బరువును ధృవీకరించుకోవచ్చు. ఒకవేళ గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తి సిలిండర్ బరువును తనిఖీ చేయడానికి నిరాకరిస్తే లేదా డెలివరీ సమయంలో గ్యాస్ సిలిండర్ బరువు తక్కువగా ఉంటే.. మీరు గ్యాస్ ఏజెన్సీకి ఫిర్యాదు చేయవచ్చు.


ఎల్పీజీ సిలిండర్ సీల్‌ను కూడా చెక్ చేయాలి..

సిలిండర్ కొనుగోలు చేసేటప్పుడు దాని బరువుతో పాటు.. సీల్‌ను కూడా తప్పకుండా చెక్ చేయండి. సిలిండర్ సీల్ పగిలి ఉండకూడదు. ఒకవేళ సీల్ పగిలిపోయినా, ఏ విధంగానైనా తారుమారు చేసినట్లు అనిపించినా.. సిలిండర్‌ను స్వీకరించే ముందు డెలివరీ ఏజెన్సీతో మాట్లాడి వారికి తెలియజేయాలి.

ఇక నుంచి ఎస్పీజీ సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు దానిని నేరుగా ఇంట్లోకి తీసుకురాకుండా.. సిలిండర్ బరువును చెక్ చేయండి. అలాగే సీల్‌ను కూడా చెక్ చేయండి. ఇలా చేయడం వల్ల చిన్న చిన్న మోసాల బారిన పడకుండా ఉంటారు.

Updated Date - Aug 17 , 2026 | 11:28 AM