జియో ఐపీఓ రికార్డుల హోరు
ABN , Publish Date - Oct 24 , 2026 | 03:45 AM
మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన టెలికాం, డిజిటల్ సేవల అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్) ఐపీఓ సరికొత్త రికార్డులు సృష్టించింది
ప్రపంచంలో తొలిసారిగా కోటికి పైగా దరఖాస్తులు
ఇష్యూ చివరి రోజు నాటికి 22.19 రెట్ల సబ్‌స్ర్కిప్షన్
మొత్తం రూ.7.4 లక్షల కోట్ల విలువైన బిడ్ల దాఖలు
న్యూఢిల్లీ: మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీ్‌సకు చెందిన టెలికాం, డిజిటల్ సేవల అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్) ఐపీఓ సరికొత్త రికార్డులు సృష్టించింది. శుక్రవారంతో ముగిసిన ఈ మెగా ఐపీఓకు 22.19 రెట్ల సబ్‌స్ర్కిప్షన్ లభించింది. యాంకర్ ఇన్వెస్టర్లు మినహా మిగతా విభాగాల ఇన్వెస్టర్లకు ఆఫర్ చేసిన 19.75 కోట్ల షేర్లకు గాను 438.3 కోట్ల షేర్ల కొనుగోలుకు బిడ్లు వచ్చాయి. ఆ బిడ్ల విలువ రూ.4.9 లక్షల కోట్లు. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి లభించిన రూ.2.5 లక్షల బిడ్లతో కలిపితే.. మొత్తం బిడ్ల విలువ రికార్డు స్థాయిలో రూ.7.4 లక్షల కోట్లకు చేరుకుంది. అంతేకాదు, ఐపీఓలో పెట్టుబడుల కోసం అనూహ్యంగా 1.39 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. ప్రపంచంలో ఒక ఐపీఓకు వచ్చిన అప్లికేషన్లలో ఇదే అత్యధికం. 2024 అక్టోబరులో సోలార్ పరికరాల తయారీదారు వారీ ఎనర్జీస్ ఐపీఓకు 97.34 లక్షల అప్లికేషన్లు నమోదయ్యాయి.
ఈ ఐపీఓలో అర్హులైన సంస్థాగత కొనుగోలుదారుల (క్యూఐబీ)కు కేటాయించిన 4.9 కోట్ల షేర్లకు గాను 345.8 కోట్ల షేర్ల కొనుగోలుకు బిడ్లు దాఖలయ్యాయి. అంటే, ఈ విభాగ షేర్లకు ఏకంగా 70.55 రెట్ల సబ్‌స్ర్కిప్షన్ లభించింది. ఈ ఇష్యూలో అత్యధిక రెట్ల బిడ్లు నమోదైన విభాగమిదే.
సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేసిన షేర్లకు గాను 14 రెట్ల బిడ్లు రాగా.. రిటైల్ మదుపరుల నుంచి 2.72 రెట్ల సబ్‌స్ర్కిప్షన్ లభించింది. రిలయన్స్ వాటాదారులకు కేటాయించిన షేర్లకు 7.60 రెట్ల బిడ్లు, ఉద్యోగుల విభాగం నుంచి 2.93 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి.
సాధారణంగా ఐపీఓల బిడ్డింగ్ సమయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. రికార్డు స్థాయి బిడ్లను ప్రాసెసింగ్ చేసేందుకు వీలుగా స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు తొలిసారిగా జియో ఐపీఓ బిడ్డింగ్ సమయాన్ని 7 గంటల వరకు పొడిగించాయి