వచ్చే నెలలో జియో ఐపీఓ ఫైలింగ్!
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:58 AM
దేశంలో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) తన డిజిటల్, టెలికాం సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు...
ముంబై: దేశంలో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) తన డిజిటల్, టెలికాం సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు అనుమతి కోరుతూ సెబీకి వచ్చే నెలలో ప్రాథమిక ముసాయిదా పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించనున్నట్లు తెలిసింది. మార్చి చివరినాటికే ఐపీఓ పత్రాలు సమర్పించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవడంతో పాటు ఉద్రిక్తతలు ఎంతకాలం కొనసాగుతాయనే విషయంపై అనిశ్చితి నెలకొనడంతో ఫైలింగ్‌ను వాయిదా వేసుకుంది. ఐపీఓ నిర్వహణ కోసం జియో ఏకంగా 17 మర్చంట్ బ్యాంకింగ్ సంస్థలను నియమించుకుంది. అంతర్జాతీయ దిగ్గజాలైన గోల్డ్‌మన్ శాక్స్, మోర్గాన్ స్టాన్లీ, సిటీ గ్రూప్, జేపీ మోర్గాన్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఐపీఓ ద్వారా జియో ప్లాట్‌ఫామ్స్ 2.5 శాతం వరకు వాటాను విక్రయించే అవకాశం ఉంది. కంపెనీ 17,000 కోట్ల డాలర్ల (దాదాపు రూ.15.64 లక్షల కోట్లు) వరకు మార్కెట్ విలువను ఆశిస్తోంది. ఈ లెక్కన జియో ఐపీఓ ద్వారా రూ.40,000 కోట్ల వరకు నిధులు సమీకరించే అవకాశాలున్నాయి. తద్వారా భారత క్యాపిటల్ మార్కెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఐపీఓ కానుంది.
ఇవి కూడా చదవండి
ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..