Train Ticket: ఆధార్ అథెంటికేషన్ ఉన్నవారికి.. నేటి నుంచి IRCTC టికెట్ బుకింగ్ సమయం పొడిగింపు
ABN , Publish Date - Jan 05 , 2026 | 04:36 PM
రైలు టికెట్లు దొరకాలంటే, ప్రస్తుతం ఎంత భారంగా మారిందో మనందరికీ తెలుసు. బుకింగ్ స్టార్ట్ అయిన సెకన్లలో టికెట్లు అయిపోతున్నాయి. తత్కాల్ బుకింగ్స్ విషయానికొస్తే ఆ టైమ్ లో అసలు యాప్ ఓపెన్ కాని పరిస్థితులు ఉన్నాయి.
ఆంధ్రజ్యోతి, జనవరి 5: ట్రైన్‌లో ప్రయాణించాలంటే, టికెట్ తప్పనిసరి. ఆ టికెట్ పొందాలంటే, ఐఆర్‌సీటీసీ యాప్ ద్వారా బుక్ చేసుకోవడం లేదా రైల్వేస్టేషన్లు, ఇంకా అధీకృత సెంటర్ల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే, రైలు టికెట్లు దొరకాలంటే, ప్రస్తుతం ఎంత భారంగా మారిందో మనందరికీ తెలుసు. బుకింగ్ స్టార్ట్ అయిన సెకన్లలో టికెట్లు అయిపోతున్నాయి. తత్కాల్ బుకింగ్స్ విషయానికొస్తే ఆ టైమ్ లో అసలు యాప్ ఓపెన్ కాని పరిస్థితులు ఉన్నాయి.
ఇంకా చెప్పాలంటే, కీలక సమయాల్లో రైలు టికెట్లు బుక్ చేసుకోవడమనేది సామాన్యులకు ఒక ప్రహసనమనే చెప్పాలి. చాలా మంది ఈ విధానాన్ని అపహాస్యం చేస్తూ టికెట్ల దందా చేస్తున్నారనేది ఇప్పుడు ఐఆర్‌సీటీసీ కూడా ఒప్పుకుంటోంది. అందుకనే టికెట్ల బుకింగ్స్‌కు సంబంధించి అనేక మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా ఐఆర్‌సీటీసీ యాప్ వాడే వారికి ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేసింది.
గతేడాది అక్టోబర్ 1 నుంచే జనరల్ టికెట్ రిజర్వేషన్‌కూ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేసింది. ఫలితంగా ఐఆర్‌సీటీసీ యాప్‌నకు ఆధార్ లింక్ చేసిన వారు మాత్రమే మొదటి 15 నిమిషాల్లో టికెట్లు బుకింగ్ చేసుకునే వీలు కల్పించారు. డిసెంబర్ 29, 2025 నుంచి ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఆధార్ అథెంటికేషన్ ఖాతాలకే బుకింగ్ సాధ్యమవుతుంది. ఇక ఇప్పుడు ఈ సమయాన్ని మరింత పొడిగించారు.
జనవరి 5వ తేదీ అంటే ఈరోజు నుంచి 8 గంటల పాటు బుకింగ్ సమయం కల్పిస్తున్నారు. అంటే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రైన్ టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. ఈ సమయంలో కేవలం ఆధార్ అథెంటికేషన్ ఉన్న వెరిఫైడ్ యూజర్లు మాత్రమే టికెట్ రిజర్వేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆధార్ వెరిఫై చేయని వారు ఆ తర్వాత మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల టికెట్ల బుకింగ్ అక్రమాలకు చెక్ పెట్టాలని భారతీయ రైల్వే భావిస్తోంది.
అంతేకాదు, జనవరి 12వ తేదీ నుంచి ఈ సమయం 14 గంటలకు పెరగనుంది. అంటే ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పెంచనున్నారు. ఈ సమయంలో కేవలం ఆధార్ వెరిఫైడ్ ప్రయాణికులు మాత్రమే టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. దీంతో పూర్తిగా అక్రమార్కులకు చెక్ పడనుందని రైల్వే శాఖ అంటోంది.
అటు, తత్కాల్ టికెట్లకు సైతం 2025, జులై 1 నుంచే ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. 2025, జులై 15 నుంచి పీఆర్ఎస్ కౌంటర్లు, ఏజెంట్ల ద్వారా తత్కాల్ టికెట్లు బుకింగ్ చేసినా ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు. అలాగే అడ్వాన్స్ రిజర్వేషన్ సమయంలో బుకింగ్ రూల్స్ కఠినతరం చేశారు.
అయినప్పటికీ సాధారణ ఐఆర్‌సీటీసీ యూజర్లు తత్కాల్ బుకింగ్స్ వంటి కీలక సమయంలో చేసే బుకింగ్స్ తీరు పెద్దగా మారలేదని పెదవి విరుస్తుండటం గమనార్హం.
దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా? ఈ ఆయుర్వేద చిట్కాలు ట్రై చేయండి.!
సూర్య నమస్కారాలు చేస్తే ఇన్ని లాభాలా..