Share News

ఇన్ఫోసిస్ తదుపరి సీఈఓగా ఆశిష్ కుమార్ దాస్

ABN , Publish Date - Jul 23 , 2026 | 06:41 PM

ఇన్ఫోసిస్ సంస్థ తదుపరి సీఈఓగా ఆశిష్ కుమార్ దాస్ ఎంపికయ్యారు. సీఈఓ బాధ్యతలకు ఆయనను బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఎంపిక చేసినట్టు ఇన్ఫోసిస్ తాజాగా వెల్లడించింది.

ఇన్ఫోసిస్ తదుపరి సీఈఓగా ఆశిష్ కుమార్ దాస్
Infosys Next CEO Ashiss Kumar Dash

ఇంటర్నెట్ డెస్క్: ఇన్ఫోసిస్ సంస్థ తదుపరి సీఈఓగా ఆశిష్ కుమార్ దాస్ ఎంపికయ్యారు. సీఈఓ బాధ్యతలకు ఆయనను బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఎంపిక చేసినట్టు ఇన్ఫోసిస్ తాజాగా వెల్లడించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ నియామకం అమల్లోకి రానుంది. ప్రస్తుతం సలీల్ పరేఖ్ ఇన్ఫోసిస్ సీఈఓగా ఉన్నారు. దాదాపు 9 సంవత్సరాలుగా ఆయన సంస్థను ముందుండి నడిపిస్తున్నారు. సలీల్ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 31తో ముగుస్తుంది.

ప్రస్తుతం ఆశిష్ ఇన్ఫోసిస్‌కు చెందిన ఎనర్జీ వర్టికల్‌తో పాటు పలు విభాగాలకు నేతృత్వం వహిస్తున్నారు. సంస్థలో ఆయనకు 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఏఐ రాకతో సాఫ్ట్‌వేర్ రంగం కీలక మార్పులకు లోనవుతున్న తరుణంలో ఇన్ఫోసిస్‌లోని అనుభవజ్ఞుడైన ఆశిష్‌కు సీఈఓ బాధ్యతలు అప్పగించేందుకు సంస్థ మొగ్గు చూపించింది.


ఆశిష్ నియామకంపై ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తదుపరి సీఈఓ ఎవరనే విషయంలో బోర్డు మొదటి నుంచీ స్పష్టతతో ఉంది. ఇన్ఫోసిస్‌కు ఉన్న విశ్వసనీయత, విలువలను కొనసాగిస్తూ సంస్థలో సాహసోపేత మార్పులను తీసుకొచ్చే వ్యక్తిగా సీఈఓ ఉండాలని అనుకున్నాము’ అని ఆయన పేర్కొన్నారు. తన వాణిజ్య మెళకువలు, సాంకేతికతపై అవగాహనతో సంస్థను ఆశిష్ ముందుండి నడిపిస్తారని ఆశిస్తున్నట్టు ఇన్ఫోసిస్ పేర్కొంది.

ఈ వార్తలనూ చదవండి:

భారీగా పెరిగిన పసిడి ధరలు.. ప్రస్తుతం మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

ముడిచమురు పైపైకి.. కొనసాగుతున్న నష్టాలు..

Updated Date - Jul 23 , 2026 | 06:48 PM