ప్రభావశీల మహిళల చేతుల్లో రూ.39 లక్షల కోట్ల ఆస్తులు
ABN , Publish Date - Jul 31 , 2026 | 03:32 AM
దేశంలో పారిశ్రామిక, వ్యాపార రంగాలతో పాటు పలు రంగాల్లో అత్యంత ప్రభావవంతమైన మహిళలతో కూడిన 2026 క్యాండేర్ హురున్ ఇండియా విమెన్ లీడర్స్ జాబితా గురువారం...
క్యాండేర్ హురున్ ఇండియా విమెన్ లీడర్స్ జాబితా విడుదల
జాబితాలో రోష్ని నాడార్, ప్రియా నాయర్, అపోలో సిస్టర్స్
న్యూఢిల్లీ: దేశంలో పారిశ్రామిక, వ్యాపార రంగాలతో పాటు పలు రంగాల్లో అత్యంత ప్రభావవంతమైన మహిళలతో కూడిన 2026 క్యాండేర్ హురున్ ఇండియా విమెన్ లీడర్స్ జాబితా గురువారం విడుదలైంది. ఈ జాబితాలో 117 మంది మహిళలకు స్థానం లభించింది. గతేడాది జాబితాలోని 97 మందితో పోల్చితే ఈసారి 21 శాతం పెరిగారు. ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న మహిళల నిర్వహణలోని సంస్థల ఎంటర్‌ప్రైజ్ విలువ, మార్కెట్ క్యాపిటలైజేషన్, సంపద రూ.39 లక్షల కోట్లుగా ఉంది. ఈ మొత్తం ఫిన్లాండ్ జీడీపీకన్నా అధికం కావడం విశేషం. గత ఏడాది జాబితాలో 9 విభాగాలు ఉండగా.. ఈసారి 12 విభాగాలతో జాబితా రూపొందించారు. జాబితాలోని 117 మందిలో 84 శాతం మంది సొంత కష్టంతో ఎదిగినవారే కావడం విశేషం.
కేటగిరీల విషయానికి వస్తే.. ‘వెల్త్ మల్టీప్లయర్స్’ విభాగంలో హెచ్‌సీఎల్ టెక్ చైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా అగ్రస్థానంలో నిలిచారు. ఈమె నెట్‌వర్త్ రూ.2.84 లక్షల కోట్లు.
‘ప్రొఫెషనల్ సీఈఓ’ విభాగంలో హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ ప్రియా నాయర్ ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఈమె రూ.5,06,600 కోట్ల విలువైన కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు .
అపోలో హాస్పిటల్స్‌కు చెందిన ప్రీతా రెడ్డి (68), సునీతా రెడ్డి (67)లు సంయుక్తంగా ‘వెటరన్స్ కేటగిరీ’లో అగ్రస్థానంలో ఉన్నారు. వీరి గ్రూప్ విలువ రూ.1,21,000 కోట్లకు మించి ఉంది.
రెన్యూ పవర్ సహ వ్యవస్థాపకురాలు వైశాలి నిగమ్ సిన్హా ‘న్యూ ఎకానమీ’ కేటగిరీలో ప్రథమ స్థానంలో ఉన్నారు. ఈ కంపెనీ విలువ రూ.22,230 కోట్లుగా ఉంది.
ఈ జాబితాలోని వారి సగటు వయసు 48 ఏళ్లు. 19 నుంచి 86 ఏళ్ల మధ్య వయసు వారు జాబితాలో ఉన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
కువైట్‌లోని చైనా కంపెనీపై ఇరాన్ దాడి
కుట్రపూరిత వీసా కేసు.. అమెరికా నుంచి భారతీయుడి బహిష్కరణ