Share News

నష్టాల నుంచి భారీ లాభాల్లోకి.. సూచీల రికవరికీ కారణాలేంటి..

ABN , Publish Date - Mar 16 , 2026 | 04:02 PM

ఇరాన్ యుద్ధం కారణంగా వరుసగా నష్టపోతూ వస్తున్న దేశీయ సూచీలు సోమవారం యూటర్న్ తీసుకున్నాయి. ఉదయం నష్టాలతోనే ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నం తర్వాత లాభాల్లోకి వచ్చాయి. ఇంట్రాడే కనిష్ఠంతో పోల్చుకుంటే సెన్సెక్స్ దాదాపు రెండు వేల పాయింట్లు పైకి వచ్చింది.

నష్టాల నుంచి భారీ లాభాల్లోకి.. సూచీల రికవరికీ కారణాలేంటి..
Stock Market

ఇరాన్ యుద్ధం కారణంగా వరుసగా నష్టపోతూ వస్తున్న దేశీయ సూచీలు సోమవారం యూటర్న్ తీసుకున్నాయి. ఉదయం నష్టాలతోనే ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నం తర్వాత లాభాల్లోకి వచ్చాయి. ఇంట్రాడే కనిష్ఠంతో పోల్చుకుంటే సెన్సెక్స్ దాదాపు రెండు వేల పాయింట్లు పైకి వచ్చింది. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం కలిసివచ్చింది.


ఇటీవల బాగా నష్టపోయిన మెటల్, ఆటో, బ్యాంకింగ్, ఎఫ్‌ఎమ్‌సీజీ రంగాలపై పెట్టుబడిదారులు ఆసక్తి చూపించారు. అలాగే హోర్ముజ్ జలసంధి నుంచి భారత ట్యాంకర్లు సురక్షితంగా గమ్యానికి చేరుకోవడం కూడా మదుపర్లలో సానుకూల ప్రభావాన్ని నింపింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలతో రోజును ముగించాయి (Indian stock market).


గత సెషన్ ముగింపు (74,563)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 150 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు వెళ్లింది. ఒక దశలో దాదాపు 600 పాయింట్లు కోల్పోయి 73,949 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరుకుంది. అయితే మధ్యాహ్నం పరిస్థితి మారింది. ఇంట్రాడే కనిష్ఠంతో పోల్చుకుంటే ఒక దశలో సెన్సెక్స్ దాదాపు 2000 పాయింట్లు ఎగబాకింది. చివరకు 938 పాయింట్ల లాభంతో 75,502 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 257 పాయింట్ల లాభంతో 23,408 వద్ద స్థిరపడింది (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో అల్ట్రాటెక్ సిమెంట్, పేటీఎమ్, ఎమ్ అండ్ ఎమ్, గ్రాసిమ్, ట్రెంట్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). బంధన్ బ్యాంక్, ఐఓసీ, హిందుస్థాన్ పెట్రో, బీపీసీఎల్, కేపీఐటీ టెక్నాలజీస్ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 655 పాయింట్లు ఆర్జించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 146 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 92.42గా ఉంది.


ఇవి కూడా చదవండి..

ఆటో డ్రైవర్ అని తేలిగ్గా చూడకండి.. ఇతడు ఒక్క రోజులో ఎంత సంపాదిస్తాడో తెలిస్తే..


మీవి డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో జింక ఎక్కడ దాక్కుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 16 , 2026 | 04:15 PM