రికార్డు స్థాయిలో రూపాయి పతనం! డాలర్‌తో పోలిస్తే దాదాపు రూ.92కు..
ABN , Publish Date - Jan 29 , 2026 | 11:01 AM
గురువారం రూపాయి మారకం విలువ భారీ స్థాయిలో పతనమైంది. డాలర్‌తో పోలిస్తే 91.98కు చేరుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత కరెన్సీ విలువ నేడు భారీగా పతనమైంది. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికి డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 91.98కు పడిపోయి జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. స్పాట్ మార్కెట్‌లో రూపాయి విలువ ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 2 శాతం మేర పతనమైంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ చూస్తే ఏకంగా 5 శాతం మేర రూపాయి విలువ తగ్గింది. దేశఆర్థికాభివృద్ధి అంచనాలకు మించుతున్నా రూపాయి విలువ పతనం కావడం చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో భారత దేశ జీడీపీ 8.2 శాతం మేర పెరిగిన విషయం తెలిసిందే (Rupee Slides to All time Low).
అయితే, రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ ఇప్పటికే రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. 92 మార్కు కీలక నిరోధం కావడంతో ఈ స్థాయికి మించి పడిపోకుండా ఆర్‌బీఐ చర్యలు తీసుకోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే, రూపాయి విలువను నిర్దిష్ట స్థితికి పరిమితం చేయాలనే టార్గెట్స్ ఏవీ లేవని ఆర్బీఐ గతంలోనే ప్రకటించింది.
రూపాయి క్షీణతకు కారణాలు
రూపాయి పతనానికి పలు కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా విధించిన అధిక సుంకాలు, స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ నిధులు తరలిపోవడం, భారీ స్థాయిలో బంగారం దిగుమతులు, కరెన్సీ మరింత పతనం అవుతుందన్న భయాలు వెరసి రూపాయి క్షీణతకు దారి తీస్తున్నాయి. ఇటీవలే ఈయూతో వాణిజ్య ఒప్పందం కుదిరినా సానుకూల సెంటీమెంట్ బలపడకపోవడం కొసమెరుపు. అమెరికా సుంకాలు అమల్లోకి వచ్చిన నాటి నుంచి భారత కరెన్సీ 7.5 శాతం మేర క్షీణించింది. చైనా కరెన్సీ యువాన్‌తో పోలిస్తే రూపాయి విలువ 7.5 శాతం మేర పతనమైంది. అమెరికా సుంకాల తగ్గుదలలో జాప్యం కారణంగా రూపాయి విలువపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ అధికారులు చెబుతున్నారు. రాబోయే 12 నెలల్లో డాలర్‌లో పోలిస్తే రూపాయి మారకం విలువ 94కు కూడా పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి:
సామాన్యులకు షాక్.. ఊహించని స్థాయిలో పెరిగిన పసిడి ధర
బడ్జెట్ 2026.. పాత పన్ను విధానం కనుమరుగు కానుందా?