కుప్పకూలిన రూపాయి.. డాలర్‌తో పోల్చితే రికార్డు స్థాయిలో పతనం
ABN , Publish Date - Mar 04 , 2026 | 05:45 PM
ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకూ తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఈ పరిణామాలు భారత్‌ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. రూపాయి విలువ భారీగా పడిపోయింది. గతంలో ఎప్పుడూ లేనంతంగా రికార్డు స్థాయిలో క్షీణించి.. డాలర్‌తో పోల్చితే ఏకంగా 92 రూపాయలు దాటింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో రూపాయి విలువ భారీగా పతనమైంది. ముడి చమురు ధరలు పెరగడంతో బుధవారం అమెరికా డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 67 పైసలు క్షీణించి ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయి 92.16కు చేరింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీ అమ్మకాలు, విదేశీ ఇన్వెస్టర్లు నిధులను ఉపసంహరించుకోవడమే భారత కరెన్సీ పతనానికి కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. రూపాయి విలువ పతనం వల్ల విదేశీ నిధులు తరలిపోయి కంపెనీల లాభాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో బంగారం, వెండితో పాటు డాలర్ ప్రాబల్యంతో స్టాక్ మార్కెట్లు కూడా భారీ స్థాయిలో పతనమయ్యాయి. మూడు రోజులుగా వరుస నష్టాలతో డీలాపడిన భారతీయ స్టాక్ మార్కెట్లు.. నాలుగో రోజూ తీవ్ర నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయంగా ముదురుతున్న యుద్ధ మేఘాలు దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఇవాళ ట్రేడింగ్‌లో దలాల్ స్ట్రీట్ చరిత్రలో నిలిచిపోయే భారీ పతనాన్ని చవిచూసింది. ఓ దశలో 1,700 పాయింట్ల మేర క్షీణంచిన సెన్సెక్స్.. చివరకు కాస్త కోలుకుని 1122 పాయింట్ల నష్టంతో గట్టెక్కింది. ఉదయం 78525 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్(క్రితం రోజు ముగింపు 80,238) ఇంట్రాడేలో 78,443 కనిష్ఠ స్థాయికి చేరింది. చివరకు 79,116 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా ఓ దశలో 500 పాయింట్ల పతనాన్ని చవిచూసి.. చివరకు 385 పాయింట్ల నష్టంతో 24,480 వద్ద ముగిసింది. దీంతో ఇన్వెస్టర్ల లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
కొద్ది రోజుల కిందటే 91 రూపాయల మార్క్‌ను దాటిన రూపాయి విలువ.. అనతి కాలంలోనే 92ను కూడా దాటడం ఆందోళనకర అంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అంతర్జాతీయ లావాదేవీలన్నీ డాలర్ మీదే ఆధారపడి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి విలువ 90ని దాటడంతో దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ఒత్తిడిలోకి నెట్టే అవకాశముంది. గతంలో ఎప్పుడూ ఇంత భారీ స్థాయిలో రూపాయి విలువ పతనమవ్వలేదు. ఈ యుద్ధం మరికొన్ని రోజులపాటు ఇలాగే కొనసాగితే మార్కెట్లు మరింత కుంగిపోయే ప్రమాదం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగు వేయాలని హెచ్చరిస్తున్నారు.
ఇవీ చదవండి:
ఇరాన్ యుద్ధం.. పెరగనున్న వంటింటి బడ్జెట్..