యూఎస్‌తో ట్రేడ్ డీల్‌కు పీటముడి: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ABN , Publish Date - Oct 05 , 2026 | 01:12 PM
అమెరికా, భారత్ మధ్య ట్రేడ్ డీల్ చర్చల్లో పీటముడి పడినట్టే ఉందని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, భారత్ మధ్య ట్రేడ్ డీల్ చర్చల్లో పీటముడి పడినట్టే ఉందని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. ఒకరకంగా చర్చలు స్తంభించినట్టు కనిపిస్తున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. డీల్ ముందుకు సాగే దిశగా ఇరు వర్గాలు అవతలి వారికి రాయితీలు ఇవ్వడం, రాజీ పడటం చాలా కష్టంగా మారిందని అన్నారు. న్యూఢిల్లీలో సోమవారం జరిగిన మ్యూనిక్ లీడర్స్ మీటింగ్‌లో మంత్రి ఈ కామెంట్స్ చేశారు. ఇరు వర్గాలు ఎంతోకొంత రాజీ ధోరణి ప్రదర్శిస్తాయా? లేదా? అన్న దానిపైనే చర్చల్లో పురోగతి ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు. ‘చర్చలు అయితే జరుగుతున్నాయి. కానీ డీల్ కోసం అవతలివారికి ఇచ్చే మినహాయింపుల విషయంలో ఇరు వర్గాలకు కష్టంగా కనిపిస్తోంది’ అని మంత్రి అన్నారు.
సుంకాలు కాదు.. చర్చలే పరిష్కారం..
అమెరికాతో వాణిజ్యం ఇప్పటికీ భారత్‌కే అనుకూలంగా ఉందని అన్నారు. దీని వల్ల తమకు నష్టం జరుగుతోందని భావిస్తున్న అమెరికా వాణిజ్యలోటును కొంతవరకైనా పూడ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. డీల్స్‌పై దేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో మార్పులు వస్తున్నాయని కూడా మంత్రి అన్నారు. ‘సుంకాలు కూడా ఈ చర్చల్లో భాగంగానే ఉండేవి. ఇప్పటికీ ఆ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ సుంకాలు కొత్త పథంలో వెళుతున్నాయి’ అని అన్నారు. అయితే, దేశాలకు ఇప్పటికీ చర్చలే మార్గమని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఇచ్చిపుచ్చుకునే మార్గాలను దేశాలు వెతకాలని సూచించారు.
వివిధ దేశాలు ప్రస్తుతం ద్వైపాక్షిక ఒప్పందాల వైపు మొగ్గు చూపుతున్నాయని అన్నారు. ఇలాంటి ఒప్పందాలే ప్రయోజనకరమని పలు దేశాలు భావిస్తున్నట్టు చెప్పారు. పలుదేశాలకు వర్తించే ఒప్పందాలకంటే ద్వైపాక్షిక ఒప్పందాలపై ఆసక్తి వ్యక్తమవుతోందని అన్నారు. భారత్-ఈయూ మధ్య డీల్‌ను కూడా ద్వైపాక్షిక ఒప్పందంగానే తాను పరిగణిస్తానని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
త్వరలో GST కౌన్సిల్ భేటీ.. సంచలన సంస్కరణలకు శ్రీకారం!
స్థిరంగా పసిడి ధరలు.. ప్రస్తుతం రేట్స్ ఇవీ