త్వరలో GST కౌన్సిల్ భేటీ.. సంచలన సంస్కరణలకు శ్రీకారం!
ABN , Publish Date - Oct 05 , 2026 | 12:18 PM
ఈ నెల 7న GST కౌన్సిల్ 57వ భేటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేంద్రం సంచలన సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఈ నెల 7న GST కౌన్సిల్ 57వ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో కేంద్రం సంచలన సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా GST అరెస్టు నిబంధనల రద్దు దిశగా కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. వ్యాపారులపై అరెస్టు చర్యలను తొలగించి కేవలం పన్ను వసూలు, జరిమానాలు మాత్రమే విధించేలా ప్రతిపాదనపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా, కేసుల నమోదు పరిమితి రూ.1 కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచే యోచనలో GST కౌన్సిల్ ఉంది.
సప్లైయర్ తప్పు చేసినా పన్ను చెల్లించిన కొనుగోలుదారుల ITC రద్దు చేయబోమని ఆర్థిక శాఖ సంకేతాలు ఇచ్చింది. రూ.10,000 కంటే తక్కువ పన్ను వివాదాలపై నోటీసుల రద్దు చేయడంతో పాటు దాదాపు 11.3 లక్షల కేసుల ఉపసంహరించుకునే అవకాశం ఉందని సమాచారం. ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్, వాహనాల సర్వీసింగ్, టెలికామ్ టవర్లకు కూడా ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ వర్తింప చేస్తారని తెలుస్తోంది. ఇకపై 10 రోజుల్లోనే రీఫండ్ అక్నాలెడ్జ్‌మెంట్, రిస్క్ అసెస్‌మెంట్ ద్వారా 90% క్లెయిమ్స్ ఆటోమేటిక్‌గా విడుదల చేసే అంశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది.
ఎగుమతిదారులకు బంపర్ ఆఫర్
విదేశీ బ్రాంచ్‌ల ద్వారా జరిగే సర్వీసులు, SEZ సరఫరాలను ఇకపై 'ఎగుమతులు'గానే పరిగణించే అవకాశం ఉందని సమాచారం. ఈ-కామర్స్ వ్యాపారులకు ఊరటనిచ్చేలా చిన్న వ్యాపారులు ఇతర రాష్ట్రాల్లోని వేర్‌హౌస్‌నే బిజినెస్ అడ్రస్‌గా వాడుకోవడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈవే బిల్లులకు సంబంధించి ఇకపై ఆధారాలు ఉంటేనే, సీనియర్ అధికారుల అనుమతితో మాత్రమే రోడ్డుపై వాహనాల తనిఖీలు చేసే ప్రతిపాదనలకు కూడా కేంద్రం ఆమోదం చెప్పే అవకాశం ఉంది. రూ. 5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్నవారికి త్రైమాసిక చెల్లింపులతో ఐచ్ఛిక వార్షిక రిటర్న్ వెసులుబాటు, ఆలస్య రుసుముల నుంచి మినహాయింపును కూడా కల్పించనున్నారు. ఆరోగ్య రంగంలో దిగుమతి చేసుకునే మరో 7 అరుదైన వ్యాధుల ఔషధాలకు పన్ను మినహాయింపు ఇవ్వనున్నారు. జీఎస్టీ పన్ను కోత తరువాత ఈసారి తీసుకోబోయే నిర్ణయాలు అతిపెద్ద సంస్కరణలుగా నిలుస్తాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
స్థిరంగా పసిడి ధరలు.. ప్రస్తుతం రేట్స్ ఇవీ
పండగ సీజన్ అమ్మకాల్లో రెండంకెల వృద్ధి