వచ్చే 6-8 నెలల్లో ఎంఎఫ్ ఏయూఎం రూ.100 లక్షల కోట్లకు..
ABN , Publish Date - Sep 19 , 2026 | 02:02 AM
దేశీయంగా మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) విభాగం శరవేగంగా వృద్ధి చెందుతోందని భారత మ్యూచువల్ ఫండ్స్ సమాఖ్య (యాంఫీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ ఎన్ చలసాని అన్నారు. శుక్రవారం నాడిక్కడ ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎంఎఫ్ రంగం ఏటా 20 శాతం వరకు వృద్ధిని నమోదు చేస్తూ వస్తోందని, ఈక్విటీ మార్కెట్లపై ప్రజలకు అవగాహన పెరుగుతుండటంతో పాటు అందుకనుగుణంగా పెట్టుబడి సాధనాలు ఉండటం ఈ రంగానికి కలిసి వస్తోందన్నారు.
యాంఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ ఎన్ చలసాని
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): దేశీయంగా మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) విభాగం శరవేగంగా వృద్ధి చెందుతోందని భారత మ్యూచువల్ ఫండ్స్ సమాఖ్య (యాంఫీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ ఎన్ చలసాని అన్నారు. శుక్రవారం నాడిక్కడ ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎంఎఫ్ రంగం ఏటా 20 శాతం వరకు వృద్ధిని నమోదు చేస్తూ వస్తోందని, ఈక్విటీ మార్కెట్లపై ప్రజలకు అవగాహన పెరుగుతుండటంతో పాటు అందుకనుగుణంగా పెట్టుబడి సాధనాలు ఉండటం ఈ రంగానికి కలిసి వస్తోందన్నారు. కాగా దేశంలో ప్రస్తుతం 57కు పైగా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (ఏఎంసీ) ఉండగా ఈ సంస్థల నిర్వహణలో రూ.87 లక్షల కోట్లకు పైగా ఆస్తులు (ఏయూఎం) ఉన్నాయన్నారు. దేశ జీడీపీలో ఇది 27 శాతానికి సమానమని ఆయన పేర్కొన్నారు. భారత్ నిలకడైన వృద్ధి నమోదు చేస్తూ వస్తుంటే ఈక్విటీ మార్కెట్లు కూడా అదే స్థాయిలో వృద్ధిని సాధించే అవకాశం ఉందన్నారు. అప్పుడు ఎంఎఫ్ సంస్థల నిర్వహణలో ఉన్న ఏయూఎం కూడా రూ.100 లక్షల కోట్ల మార్కును అధిగమించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితులను ప్రకారం రానున్న 6-8 నెలల్లో ఏయూఎం ఈ మార్కును అందుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు వెంకట్ వెల్లడించారు. ప్రస్తుతం ఎంఎఫ్ విభాగంలో దేశవ్యాప్తంగా 6.3 కోట్ల మంది ఇన్వెస్టర్లు ఉన్నట్లు తెలిపారు.
ఏపీ, తెలంగాణ వాటా రూ.2.95 లక్షల కోట్లు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మ్యూచువల్ ఫండ్స్‌కు మంచి ఆదరణ లభిస్తోందని వెంకట్ అన్నారు. ఈ ఏడాది జూలై నాటికి మొత్తం ఎంఎఫ్ ల నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో (ఏయూఎం).. తెలుగు రాష్ట్రాల వాటా రూ.2.95 లక్షల కోట్లుగా ఉందని ఆయన వివరించారు. ఇందులో తెలంగాణ వాటా రూ.2,12,856 కోట్లుగా ఉండగా ఏపీ వాటా రూ.82,409 కోట్లుగా ఉందన్నారు. తెలంగాణలో ఒక్క హైదరాబాద్ ఏయూఎం వాటానే రూ.1,84,261 కోట్లుగా ఉండగా ఏపీలోని విశాఖపట్నం ఏయూఎం రూ.16,614 కోట్లు, విజయవాడ వాటా రూ.8,337 కోట్లుగా ఉందన్నారు. తెలంగాణలో ఎంఎఫ్ మదుపరులు 82.24 లక్షలుగా ఉంటే ఏపీలో 79.44 లక్షలుగా ఉన్నారని తెలిపారు
సిప్‌లకు ఆదరణ: దేశవ్యాప్తంగా క్రమానుగత పెట్టుబడుల (సిప్)కు ఆదరణ పెరుగుతూ వస్తోందని, ప్రతి నెలా ఈ పెట్టుబడుల్లో సుమారు 20 శాతం వరకు వృద్ధి నమోదవుతోందని వెంకట్ తెలిపారు. ఈ ఏడాది జూలైలో సిప్‌ల రూపంలో రూ.32,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. రానున్న నెలల్లో ఇది రూ.35,000 కోట్లకు పెరగవచ్చని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో 26.09 లక్షల సిఫ్ ఫోలియోలు ఉండగా ఏయూఎం రూ.47,975 కోట్లుగా ఉంది. అలాగే ఏపీలో 26.47 లక్షల ఫోలియోలతో ఏయూఎం రూ.26,820 కోట్లుగా ఉంది.