Share News

బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐ.. నోటిఫై చేసిన కేంద్రం

ABN , Publish Date - May 02 , 2026 | 06:52 PM

ఇన్సూరెన్స్‌ రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐని అనుమతిస్తూ కేంద్రం తాజాగా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు పార్లమెంటు గతేడాది ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐ.. నోటిఫై చేసిన కేంద్రం
Insurance

ఇంటర్నెట్ డెస్క్: బీమా రంగంలో ఆటోమేటిక్ రూట్‌‌లో 100 శాతం ఎఫ్‌డీఐకి (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) అనుమతిస్తూ చట్టానికి చేసిన మార్పులను కేంద్రం తాజాగా నోటిఫై చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే, ఎల్‌ఐసీలో మాత్రం ఈ తరహా పెట్టుబడులు 20 శాతానికి పరిమితమని కూడా ఆర్థిక శాఖ తన ప్రకటనలో స్పష్టం చేసింది. దీంతో, విదేశీ పెట్టుబడి దారులు భారతీయ ఇన్సూరెన్స్ కంపెనీల్లో నేరుగా పెట్టుబడి పెట్టేందుకు మార్గం సుగమమైంది. అయితే, ఈ పెట్టుబడులకు ఐఆర్‌డీఏ అనుమతులు అవసరమని కూడా ఆర్థిక శాఖ తన ప్రకటనలో తెలిపింది.


బీమా కంపెనీల్లో ఆటోమేటిక్ రూట్‌లో విదేశీ పెట్టుబడులను 74 శాతం నుంచి 100 శాతానికి పెంచుతూ పార్లమెంటు గతేడాది కొత్త బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే. సబ్కా బీమా సబ్కీ రక్షా బిల్లు పేరిట ఇన్సూరెన్స్ చట్టంలో సవరణలకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. బిల్లుపై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లుతో ఇన్సూరెన్స్ రంగంలోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయని అన్నారు. దేశ నలుమూలలకూ ఇన్సూరెన్స్ సేవలు విస్తరిస్తాయని చెప్పారు.


అప్పటికే విదేశీ పెట్టుబడులకు మార్గాలు ఉన్నప్పటికీ చేయాల్సింది ఇంకా ఎంతో ఉందని కూడా ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు. వివిధ కారణాలతో భారత్‌లో భాగస్వామ్య కంపెనీలు లభించక మిన్నకుండిపోయిన విదేశీ కంపెనీలు దేశంలోకి వస్తాయని చెప్పారు. ఇది అంతిమంగా వినియోగదారులకు లాభం చేకూరుస్తుందని మంత్రి అన్నారు. ఈ రంగంలో పోటీ పెరిగి యూజర్లకు ఇన్సూరెన్స్ ప్రీమియం‌ల భారం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

విమాన సర్వీసులను నిలిపివేసిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్

జీఎస్‌టీ వసూళ్లలో సరికొత్త రికార్డు

Updated Date - May 02 , 2026 | 07:18 PM