Share News

ఎగుమతి సంస్థలకు మరో ఊరట

ABN , Publish Date - Apr 03 , 2026 | 02:31 AM

కష్టాల్లో ఉన్న దేశీయ ఎగుమతి కంపెనీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక చర్య తీసుకుంది. ఈ కంపెనీలు దిగుమతి చేసుకునే కీలక పెట్రో రసాయన ఉత్పత్తులపై...

ఎగుమతి సంస్థలకు మరో ఊరట

పెట్రోకెమికల్‌ ఉత్పత్తులకు దిగుమతి సుంకం రద్దు

న్యూఢిల్లీ: కష్టాల్లో ఉన్న దేశీయ ఎగుమతి కంపెనీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక చర్య తీసుకుంది. ఈ కంపెనీలు దిగుమతి చేసుకునే కీలక పెట్రో రసాయన ఉత్పత్తులపై ఈ ఏడాది జూన్‌ నెలాఖరు వరకు దిగుమతి సుంకాలను పూర్తిగా ఎత్తివేసింది. దీంతో ఫార్మా, రసాయనాలు, వస్త్ర పరిశ్రమ, ప్లాస్టిక్‌, ప్యాకేజింగ్‌, ఆటోమొబైల్‌ విడిభాగాల తయారీ కంపెనీలు ప్రధానంగా లబ్ది పొందుతాయని భావిస్తున్నారు. పశ్చిమాసియా సంక్షోభ ప్రభావం నుంచి దేశీయ ఎగుమతిదారులను కాపాడేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం రూ.1,800 కోట్ల పన్ను ఆదాయం కోల్పోనుంది. ప్రత్యేక ఆర్థిక మండళ్లలోని ఎగుమతి యూనిట్లు తమ ఉత్పత్తిలో 30 శాతం దేశీయ మార్కెట్లో అమ్ముకునేందుకు అనుమతించిన మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక డ్యూటీ మినహాయింపు ప్రకటించడం విశేషం.

ఆభరణాల దిగుమతులపై ఆంక్షలు: మన దేశానికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) ఉన్న దేశాల నుంచి వచ్చి పడుతున్న బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాల దిగుమతులకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ దిగుమతులను కట్టడి చేస్తూ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎ్‌ఫటీ) గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని తెలిపారు. ఈ దిగుమతులు ఏ స్థాయిలో ఉన్నా ఈ నియంత్రణలు వర్తిస్తాయి. భారత-ఆగ్నేయాసియా దేశాల కూటమి (ఏషియాన్‌) మధ్య ఉన్న ఎఫ్‌టీఏను అడ్డుపెట్టుకుని కొంతమంది నగల వ్యాపారులు థాయ్‌లాండ్‌, ఇండోనేషియాల నుంచి చౌకగా నగల ముసుగులో బంగారం, వెండి, ప్లాటినం దిగుమతి చేసుకుంటూ.. పెద్దఎత్తున పన్ను ఎగవేస్తుండడంతో ప్రభుత్వంఈ చర్య తీసుకుందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి...

ప్రమాదవశాత్తు సంపులో పడి 8 నెలల పసికందు మృతి

రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. యువకుడిపై కత్తులతో దాడి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 03 , 2026 | 02:31 AM