Share News

సంక్షోభ సమయంలోనూ వృద్ధి రయ్‌..రయ్‌!

ABN , Publish Date - Sep 01 , 2026 | 03:51 AM

పశ్చిమాసియా సంక్షోభ సమయంలోనూ భారత ప్రగతి చక్రం అంచనాలకు మించిన వేగంతో దూసుకెళ్లింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్‌-జూన్‌) జీడీపీ...

సంక్షోభ సమయంలోనూ వృద్ధి రయ్‌..రయ్‌!

జూన్‌ త్రైమాసికంలో 7.8 శాతం జీడీపీ వృద్ధి రేటు

న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభ సమయంలోనూ భారత ప్రగతి చక్రం అంచనాలకు మించిన వేగంతో దూసుకెళ్లింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్‌-జూన్‌) జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైంది. ఈ ఏడాది జనవరి-మార్చితో ముగిసిన త్రైమాసికంలో నమోదైన 8.6 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే కాస్త తగ్గినప్పటికీ, గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఇదే కాలానికి నమోదైన 6.9 శాతంతో పోలిస్తే బాగానే పుంజుకుంది. ముఖ్యంగా, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరా అంతరాయాలు, ధరాఘాతంతో పాటు ప్రపంచ డిమాండ్‌ బలహీనపడిన సమయంలోనూ దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి చెందడం విశేషం. తద్వారా ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బడా ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ తన అగ్రస్థానాన్ని కొనసాగించింది.

ఆర్‌బీఐ అంచనా కంటే అధికం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి వృద్ధి రేటు 6.7 శాతంగా, ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 7 శాతంగా నమో దు కావచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. తాజా గణాంకాలు ఆర్‌బీఐ అంచనాను సైతం మించాయి. దేశంలో ఆర్థిక కార్యకలాపాల జోరును ఇది నొక్కి చెబుతున్నది.

జీడీపీ రూ.81.36 లక్షల కోట్లు

కేంద్ర గణాంకాల శాఖ సోమవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ జూన్‌ త్రైమాసికంలో స్థిర ధరల ఆధారిత జీడీపీ లేదా వాస్తవిక జీడీపీ రూ.81.36 లక్షల కోట్లుగా నమోదైంది. గత ఏడాదిలో ఇదే సమయానికి నమోదైన రూ.75.46 లక్షల కోట్ల జీడీపీతో పోలిస్తే 7.8 శాతం అధికమిది. కాగా, ఈ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ప్రస్తుత ధరల ఆధారిత జీడీపీ లేదా నామినల్‌ జీడీపీ రూ.88.27 లక్షల కోట్లుగా ఉంది. క్రితం సంవత్సరంలో నమోదైన రూ.80 లక్షల కోట్లతో పోలిస్తే 10.3 శాతం వృద్ధి కనబరిచింది. కాగా, 2026-27 తొలి త్రైమాసికానికి జోడించిన స్థూల విలువ (జీవీఏ) 8.2 శాతంగా నమోదైంది.

భారత్‌ మరోసారి వికసించింది. వినాశనాన్ని జోస్యంగా చెప్పిన వారికి మళ్లీ భంగపాటే మిగిలింది. తాజా వృద్ధి రేటు అసాధారణ ఘనకార్యం. అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ఇంధన షాక్‌, సరఫరా అంతరాయాలు ఎదురైన సమయంలోనూ దేశ ప్రజల సమిష్ఠి బలంతోనే ఈ వృద్ధి సాధ్యమైంది.

నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఇవి కూడా చదవండి

ఎడ్యుకేషన్ హబ్‌గా హుస్నాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్

రామ మందిరానికి రూ.4 కోట్ల విరాళం.. అకౌంట్లో మాత్రం రూ.3!

Updated Date - Sep 01 , 2026 | 03:53 AM