హోండా నుంచి రెండు కొత్త కార్లు
ABN , Publish Date - May 23 , 2026 | 05:50 AM
జపాన్ కార్ల తయారీ దిగ్గజం హోండా..2030 నాటికి భారత మార్కెట్లోకి కొత్తగా పది మోడళ్లను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇందులో ఎలక్ట్రిక్ కార్లతో పాటు కాంపాక్ట్ ఎస్‌యూవీ వాహనాలు కూడా...
సిటీ, జెడ్‌ఆర్-వీ విడుదల
ద్వితీయార్ధంలో విపణిలోకి ఎలక్ట్రిక్ కారు
హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్ తకాషి నకజిమ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): జపాన్ కార్ల తయారీ దిగ్గజం హోండా..2030 నాటికి భారత మార్కెట్లోకి కొత్తగా పది మోడళ్లను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇందులో ఎలక్ట్రిక్ కార్లతో పాటు కాంపాక్ట్ ఎస్‌యూవీ వాహనాలు కూడా ఉండనున్నాయని తెలిపింది. శుక్రవారం భారత మార్కెట్లోకి సరికొత్త వెర్షన్ హోండా సిటీతో పాటు ప్రీమియం ఎస్‌యూవీ జెడ్‌ఆర్-వీ కార్లను హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సీఐఎల్) తీసుకువచ్చింది. ఈ సందర్భంగా హెచ్‌సీఐఎల్ ప్రెసిడెంట్, సీఈఓ తకాషి నకజిమ మాట్లాడుతూ.. వచ్చే నాలుగేళ్లలో మార్కెట్లోకి మొత్తం 10 మోడళ్లు తీసుకురానున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా శుక్రవారం సిటీ హైబ్రిడ్‌తో పాటు జెడ్‌ఆర్-వీ హైబ్రిడ్ కార్లను మార్కెట్లోకి తీసుకురాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మరో నాలుగు కొత్త కార్లను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. హోండా వృద్ధికి అపార అవకాశాలు ఉన్న మార్కెట్లలో టాప్-3లో భారత్ ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా 2028 నుంచి భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా 4 మీటర్ల పొడవు, మిడ్‌సైజ్ విభాగంలో మోడళ్లను తయారు చేయనున్నట్లు నకజిమ తెలిపారు.
అలాగే ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కారును తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నకజిమ వెల్లడించారు. కాగా హోండా సిటీ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని, వీటి ధరలు రూ.11.99 లక్షల నుంచి రూ.17.14 లక్షల మధ్యన ఉన్నాయని హెచ్‌సీఐఎల్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బహాల్ తెలిపారు. అయితే జెడ్‌ఆర్-వీ బుకింగ్స్‌ను శుక్రవారం నుంచి ప్రారంభించామని, జూలైలో ధరలను ప్రకటించి డెలివరీలను ప్రారభించనున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
బిహార్‌కీ ఓ ఐపీఎల్ టీమ్ ఉండాలి: బిలియనీర్ అనిల్ అగర్వాల్
సీఎస్కే వైఫల్యానికి అసలు కారణం ఇదే: సెహ్వాగ్