హెచ్‌డీఎఫ్‌సీ పార్ట్ టైమ్ ఛైర్మన్ రాజీనామా.. షేర్ల విలువ పతనం
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:47 PM
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పార్ట్ టైమ్ ఛైర్మన్ రాజీనామా చేయడంతో సంస్థ షేర్లు గురువారం దాదాపు 9 శాతం మేర పతనమయ్యాయి. తన వ్యక్తిగత విలువలకు సంస్థ విధానాలకు మధ్య పొసగక తప్పుకుంటున్నట్టు ఆయన తెలిపారు. సంస్థలో ఎలాంటి తప్పూ జరగలేదని కూడా ఆయన తేల్చి చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో అతిపెద్ద ప్రైవేటు రంగ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు గురువారం భారీ కుదుపునకు లోనయ్యాయి. గంటల వ్యవధిలోనే దాదాపు 9 శాతం మేర పతనమయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పార్ట్‌టైమ్ ఛైర్మన్ బాధ్యతల నుంచి అతాను చక్రబర్తి వైదొలగడంతో షేర్ విలువ పతనమైంది. గంటల వ్యవధిలోనే పతనమైన షేర్లు ఒకానొక దశలో 52 వారాల కనిష్ఠాన్ని తాకాయి.
బ్యాంకులో తప్పులు జరిగినట్టు తాను చెప్పలేదని చక్రబర్తి స్పష్టం చేశారు. తన భావజాలానికి సంస్థ విధానాలకు పొంతన కుదరలేదని రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. సంస్థలో గత రెండు సంవత్సరాలుగా చోటుచేసుకున్న మార్పులు తన వ్యక్తిగత విలువలకు భిన్నంగా ఉన్నాయని చెప్పారు. తాను తప్పుకోవడానికి ఇది తప్ప మరే కారణం లేదని స్పష్టం చేశారు.
మరోవైపు ఈ పరిణామంపై సంస్థ మాజీ సీఈఓ కేకీ మిస్త్రీ కూడా స్పందించారు. చక్రబర్తి తప్పుకున్న నేపథ్యంలో మిస్త్రీని పార్ట్ టైమ్ ఛైర్మన్‌గా సంస్థ నియమించింది. అంతర్గత సమస్యలు ఉన్నాయన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అతాను రాజీనామా లేఖలో ఆయన నిర్ణయానికి సంబంధించిన పూర్తి అంశాలు బోర్డుకు అందలేదని కూడా చెప్పారు. ఇక బ్యాంకుపై మదుపర్ల విశ్వాసం మరింత బలోపేతమయ్యే దిశగా చర్యలు తీసుకుంటామని హెచ్‌డీఎఫ్‌సీ సీఈఓ శశిధర్ జగదీశన్ వాటాదారులతో పేర్కొన్నారు. చక్రబర్తి తప్పుకున్న నేపథ్యంలో అదనపు బాధ్యతలను సంస్థ డిప్యూటీ ఎమ్‌డీ కైజాద్ భరూచా కూడా స్వీకరించారు.
ఈ వార్తలూ చదవండి:
కుదిరితే ఉద్యోగుల స్థానంలో ఏఐ.. కంపెనీల అభిప్రాయం ఇదే
ఉగాది రోజున గుడ్ న్యూస్.. పసిడి ధరలో భారీ కోత