స్పెసిఫైడ్ ప్రెమిసెస్ నిబంధనలు....
ABN , Publish Date - Jun 14 , 2026 | 03:26 AM
హోటల్ రంగంలో ఉన్న వారికి స్పెసిఫైడ్ ప్రెమిసెస్ అంటే అవగాహన ఉండే ఉంటుంది. ఇంతకు ముందు ఉన్న నిర్వచనం ప్రకారం ఏదైనా ఒక హోటల్‌లో....
హోటల్ రంగంలో ఉన్న వారికి స్పెసిఫైడ్ ప్రెమిసెస్ అంటే అవగాహన ఉండే ఉంటుంది. ఇంతకు ముందు ఉన్న నిర్వచనం ప్రకారం ఏదైనా ఒక హోటల్‌లో ఏ ఒక్క రూమ్‌కు సంబంధించిన డిక్లేర్డ్ టారిఫ్ రూ.7,500 కంటే మించి ఉంటే ఆ హోటల్ స్పెసిఫైడ్ ప్రెమిసెస్ కిందకు వస్తుంది.
ఒక హోటల్‌లో రకరకాల రూములు ఉంటాయని తెలిసిందే. స్టాండర్డ్, ఎగ్జిక్యూటివ్, డీలక్స్, సూట్ రూమ్ ఇలా. ఏదేనీ రూమ్‌కు డిక్లేర్డ్ టారిఫ్ రోజుకు రూ.7,500 మించి ఉంటే ఆ హోటల్‌ను స్పెసిఫైడ్ ప్రెమిసెస్ గా వ్యవహరిస్తారు. ఇలా స్పెసిఫైడ్ ప్రెమిసెస్ కిందకు వచ్చే హోటల్‌లోని రెస్టారెంట్లకు 18శాతం జీఎస్‌టీ వర్తిస్తుంది. ఒకవేళ ఆ హోటల్ స్పెసిఫైడ్ ప్రెమిసెస్‌కు కిందకు రాకుంటే, అప్పుడు మామూలు జీఎస్‌టీ 5 శాతమే వర్తిస్తుంది. డిక్లేర్డ్ టారిఫ్ అంటే, టారిఫ్ కార్డులో లేదా ఇతర ప్రదేశాల్లో ప్రకటించే ధర.
ఉదాహరణకు ఒక హోటల్ వెబ్‌సైట్‌లో లేదా టారిఫ్ కార్డులో రూమ్ ధర రూ.7,500 కంటే ఎక్కువ ఉండొచ్చు. డిస్కౌంట్ పోను రూము వాస్తవ ధర రూ.7,500 కంటే తక్కువ ఉండొచ్చు. అయినా ఆ హోటల్ స్పెసిఫైడ్ ప్రెమిసెస్ కిందకు వస్తుంది. కేవలం టారిఫ్ కార్డులోని ధరను బట్టి (డిక్లేర్డ్ టారిఫ్) ఆ హోటల్‌ను స్పెసిఫైడ్ ప్రెమిసెస్‌గా గుర్తించటంతో సంబంధిత రెస్టారెంట్ సేవల మీద 18 శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని గత సంవత్సరం ప్రభుత్వం ఈ నిర్వచనాన్ని సవరించటం జరిగింది. అయినప్పటికీ దీని మీద చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అందులోని ముఖ్య విషయాలు..
వాస్తవ అద్దెను బట్టే..
కొత్త నిర్వచనం ప్రకారం ఒక హోటల్ స్పెసిఫైడ్ ప్రెమిసెస్ కిందకు వస్తుందా లేదా అనేది డిక్లేర్డ్ టారిఫ్‌ను బట్టి కాకుండా వాస్తవంగా వసూలు చేసే అద్దెను బట్టి నిర్ణయించటం జరుగుతుంది. అది కూడా కిందటి ఆర్థిక సంవత్సరంలోని అద్దెను బట్టి ఉంటుంది. ఏదేనీ హోటల్.. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఏదేనీ క్యాటగిరీ రూమ్‌కు రూ.7,500 మించి అద్దె వసూలు చేసినప్పుడు మాత్రమే ఆ హోటల్ ఈ ఆర్థిక సంవత్సరం స్పెసిఫైడ్ ప్రెమిసెస్ క్యాటగిరీ కిందకు వస్తుంది. దీనివల్ల టారిఫ్ కార్డు ప్రకారం రూమ్ అద్దె రూ.7,500 పైన ఉన్నప్పటికీ వాస్తవ అద్దె రూ.7,500 కంటే తక్కువ ఉంటే అది స్పెసిఫైడ్ ప్రెమిసెస్ కిందకు రాదు. అప్పుడు రెస్టారెంట్ సర్వీ్‌సకు 5 శాతం జీఎస్‌టీ చెల్లిస్తే సరిపోతుంది.
తేడాలు ఏమిటంటే..
అయితే స్పెసిఫైడ్ ప్రెమిసెస్ ఉన్న హోటల్‌కు, లేని హోటల్‌కు గల తేడా ఏమిటంటే, స్పెసిఫైడ్ ప్రెమిసెస్‌లో రెస్టారెంట్ సేవలకు 18 శాతం పన్ను చెల్లించాల్సి ఉండగా, దీనికి సంబంధించిన ఇన్‌పుట్స్ లేదా ఇన్‌పుట్ సర్వీసుల మీద ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) తీసుకునే సౌలభ్యం ఉంటుంది. ఇక నాన్ స్పెసిఫైడ్ ప్రెమిసెస్‌లో ఉన్న రెస్టారెంట్ సర్వీసులకు పన్ను 5 శాతమే ఉంటుంది కానీ ఐటీసీ తీసుకునే వెసులుబాటు లేదు. అంటే ఏ హోటల్‌లో అయితే రూమ్ అద్దె రూ.7,500 లేదా అంతకు తక్కువ ఉంటుందో, ఆ హోటల్‌కు సంబంధించిన రెస్టారెంట్ సర్వీసులకు ఇన్‌పుట్ ట్యాక్స్ సౌలభ్యం ఉండదు. మరి వీరు ఇన్‌పుట్ ట్యాక్స్ పొందాలంటే, ఆ హోటల్ స్పెసిఫైడ్ ప్రెమిసెస్ క్యాటగిరి కిందకు వచ్చి ఉండాలి. అందుకని స్పెసిఫైడ్ ప్రెమిసెస్ క్యాటగిరీలో కొన్ని మార్పులు చేయటం జరిగింది.
స్పెసిఫైడ్ క్యాటగిరీలోకి రావాలంటే..
పైన చెప్పినట్లు గత సంవత్సరం రూమ్ రెంట్ రూ.7,500 పైన ఉంటే, ఆ హోటల్ కచ్చితంగా స్పెసిఫైడ్ ప్రెమిసెస్ కిందకు వస్తుంది. ఒకవేళ చిన్న హోటల్స్ వారు కూడా అంటే రూమ్ రెంట్ రూ.7,500 కంటే తక్కువ ఉన్న వారు కూడా ఈ క్యాటగిరీ కావాలనుకుంటే జనవరి 1 నుంచి మార్చి 31లో Annexure-vii అనే అప్లికేషన్‌ను దాఖలు చేయటం ద్వారా తదుపరి ఆర్థిక సంవత్సరానికి స్పెసిఫైడ్ ప్రెమిసెస్ కింద నమోదు కావచ్చు. అంటే 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 2026 జనవరి 1 నుంచి మార్చి 31 లోపు సదరు అప్లికేషన్ దాఖలు చేసి ఉండాలి. ఒకవేళ కొత్తగా హోటల్ రంగంలోకి వచ్చే వారు రిజిస్ట్రేషన్ సమయంలోనే Annexure-viii అనే అప్లికేషన్‌ను దాఖలు చేయటం ద్వారా స్పెసిఫైడ్ ప్రెమిసెస్ కింద నమోదు కావచ్చు. (Annexure-viii ను 15 రోజుల్లోపు దాఖలు చేయాలి). ఒకసారి స్పెసిఫైడ్ ప్రెమిసెస్ ఐచ్ఛికాన్ని ఎంచుకున్న తర్వాత అది ఎల్లప్పటికి ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం Annexure-vii ను దాఖలు చేయనవసరం లేదు. ఒకవేళ ఈ క్యాటగిరీ నుంచి బయటకు రావాలంటే Annexure-ix అనే అప్లికేషన్‌ను దాఖలు చేయాలి. ఇది కూడా జనవరి 1 నుంచి మార్చి 31లోపు చేయాలి. ఉదాహరణకు స్పెసిఫైడ్ ప్రెమిసెస్‌లో ఉన్న వ్యక్తి 2027-28 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ క్యాటగిరీ నుంచి బయటకు రావాలంటే 2027 జనవరి 1 నుంచి మార్చి 31 లోపు Annexure-ix ను దాఖలు చేయాలి.
ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన మరికొన్ని విషయాలు ఏమిటంటే.. రూమ్ రెంట్‌ను బట్టి స్పెసిఫైడ్ ప్రెమిసెస్ క్యాటగిరీ కింద వచ్చిన వ్యక్తులకు ఎలాంటి ఆప్షన్ ఉండదు. రూమ్ రెంట్ తక్కువ ఉండి స్పెసిఫైడ్ ప్రెమిసెస్ క్యాటగిరీలోకి రావాలనుకున్న వారికి లేదా వచ్చిన తర్వాత వెలుపలికి వెళ్లాలనుకున్న వారికి మాత్రమే పైన తెలిపిన అప్లికేషన్లు ఉపయోగపడతాయి.
ఇకపోతే, ఒక సంస్థకు ఒకే జీఎస్‌టీ కింద వివిధ ప్రదేశాల్లో హోటల్స్ ఉంటే, ప్రతి హోటల్‌కు విడివిడిగా అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. దీనివల్ల తమకు కావాల్సిన హోటల్స్‌కు మాత్రమే స్పెసిఫైడ్ ప్రెమిసెస్ క్యాటగిరి కోరుకునే సౌలభ్యం ఉంటుంది. ఒకసారి ఈ క్యాటగిరి కింద నమోదైన తర్వాత ఆర్థిక సంవత్సరం మధ్యలో వెలుపలికి రావటం కుదరదు. మార్పులు ఏమైనా ఉంటే తదుపరి ఆర్థిక సంవత్సరం నుంచి మాత్రమే సాధ్యపడుతుంది.