హాస్టల్ సర్వీస్‌లకు జీఎస్‌టీ వర్తిస్తుందా..
ABN , Publish Date - Sep 13 , 2026 | 01:17 AM
చదువు కోసం సొంత ఊరిని వదిలి నగరాలకు వచ్చే విద్యార్ధులు.. ఉద్యోగం కోసం మరో ప్రాంతానికి వెళ్లే యువత.. వీరిలో చాలా మంది హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహాల్లోనే ఉంటున్నారు.
చదువు కోసం సొంత ఊరిని వదిలి నగరాలకు వచ్చే విద్యార్ధులు.. ఉద్యోగం కోసం మరో ప్రాంతానికి వెళ్లే యువత.. వీరిలో చాలా మంది హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహాల్లోనే ఉంటున్నారు. దీంతో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో పీజీ సదుపాయం ఇప్పుడు ఒక పెద్ద వ్యాపారంగా మారింది. ముఖ్యంగా మహిళలు అయుతే విడిగా రూమ్ బదులు పీజీలో ఉంటే రక్షణ కూడా ఉంటుందని భావిస్తుంటారు. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే.. పీజీ సదుపాయాల్లో సౌకర్యవంతమైన గదితో పాటు భోజనం, వైఫై, లాండ్రీ ఇతర హౌస్ కీపింగ్ సౌకర్యాలు ఉంటుండటంతో చాలా మంది వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ అందించే సేవలు, రూముల ఆధారంగా నెలకు రూ.10,000 నుంచి రూ.25,000 వరకు వసూలు చేసే పీజీలు కూడా ఉన్నాయి. మరి ఈ మొత్తంపై జీఎస్‌టీ ఉంటుందా అనే విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి.
షరతులతోనే మినహాయింపు
హాస్టళ్లు, పీజీలకు జీఎస్‌టీ వర్తిస్తుందా అంటే వర్తిస్తుందనే చెప్పాలి. అయితే కొన్ని నిబంధనలకు లోబడి జీఎ స్‌టీ నుంచి మినహాయింపు కూడా లభిస్తుంది. అవేమిటంటే.. ఒక వ్యక్తి నుంచి నెలకు వసూలు చేసే మొత్తం రూ.20,000 మించకూడదు. అలాగే ఆ వసతి కనీసం వరుసగా 90 రోజుల పాటు అందించాలి. ఈ రెండు షరతులు నెరవేరితేనే జీఎ్‌సటీ మినహాయింపు లభిస్తుంది. మరి రూమ్ రెంట్ రూ.20,000 లోపు ఉండి ఇతర సేవలు అంటే భోజనం, ఇంటర్నెట్, లాండ్రీ ఇవన్నీ కలిపినప్పుడు రూ.20,000 దాటితే.. అప్పుడు కాంపోజిట్ సప్లయ్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. కాంపోజిట్ సప్లయ్ అంటే ఒక ప్రధాన సప్లయ్ ఉండి.. దానికి అనుసంధానంగా సహజమైన ఇతర సర్వీ్‌సలు ఉంటాయి.
ఉదాహరణకు ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ తో పాటు లోడింగ్, అన్ లోడింగ్ సర్వీస్ లు . ఇక్కడ ప్రధాన సప్లయ్ అనేది ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్.. కాగా లోడింగ్, అన్ లోడింగ్ ఇతర సర్వీసులు ఇవి సహజ సిద్ధంగా ఒక దానితో ఒకటి ముడిపడి ఉన్న సర్వీసులు . కాబట్టి దీనికి వసూలు చేసే మొత్తం మీద ట్రాన్స్‌పోర్ట్ సర్వీసుకు జీఎస్‌టీ వర్తిస్తుంది. అలాగే హాస్టల్ లేదా పీజీ సదుపాయం, ఇతర సేవలు అంటే లాండ్రీ, భోజనం, ఇంటర్నెట్ వంటి సేవలందిస్తే.. వాటికి వసూలు చేసే మొత్తాన్ని కూడా ప్రధాన సర్వీస్ అయిన రూమ్ రెంట్ కింద కలపాలి. అలా కలపగా వచ్చిన మొత్తం రూ.20,000 దాటితే అప్పుడు జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది.
ఇలా అర్ధం చేసుకోవచ్చు..
రమేష్.. హైదరాబాద్‌లో ఉద్యోగంలో చేరి ఒక పీజీలో నెలకు రూ.15,000 చెల్లిస్తూ 6 నెలలు ఉన్నాడనుకుందాం. అతను చెల్లిస్తున్న మొత్తం రూ.20,000 లోపే ఉంది. పైగా 90 రోజుల కంటే ఎక్కువ కాలం అక్కడే ఉన్నాడు. అందువల్ల జీఎస్‌టీ మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ రమేష్ తీసుకున్న ఇతర సర్వీ్‌సలు అంటే లాండ్రీ, భోజనం, ఇంటర్నెట్ కలిపి నెలకు ఒక రూ.6,000 అయ్యిందనుకుందాం. అంటే నెలకు అతను చెల్లించే మొత్తం రూ.20,000 దాటింది. కాబట్టి జీఎస్‌టీ మినహాయింపు రాదు. అదే రమేష్ నెలకు రూ.15,000 చెల్లించినా, రెండు నెలలకే గది ఖాళీ చేస్తే.. అప్పుడు 90 రోజుల షరతు నెరవేరదు. కాబట్టి సదరు పీజీ యాజమాన్యం.. రమేష్ చెల్లించిన మొత్తం మీదజీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే రెంట్ రూ.20,000 లోపు ఉండటం ఒక్కటే సరిపోదు. 90 రోజుల నిరంతర వసతి కూడా తప్పనిసరి.
ఇక్కడే పీజీ నిర్వాహకులకు ఒక సమస్య ఎదురవుతుంది. ఒక ఉద్యోగి 6 నెలలు ఉంటానని చెప్పి పీజీలో చేరాడు. అద్దె నెలకు రూ.10,000. కానీ 60 రోజులకే ఉద్యోగం మారటమో, ఇతర కారణంతో రూమ్ ఖాళీ చేశాడు. అప్పుడు వాస్తవంగా 90 రోజుల వసతి పూర్తి కాలేదు. కాబట్టి ఆ వ్యక్తి నుంచి వసూలు చేసిన మొత్తం మీద జీఎ్‌సటీ చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి విషయాల్లో నిర్వాహకులు జాగ్రత్త వహించాలి.
ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే రూ.20,000 పరిమితిని ఒక వ్యక్తికి, ఒక నెలకు చొప్పున చూడాలి. ఒక గదిలో ఇద్దరూ ఉంటూ అద్దె రూ.30,000 అయినా అప్పుడు జీఎస్‌టీ వర్తించదు. అలాగే ఒక పీజీలో 100 మంది ఉన్నారనుకుందాం. 80 మంది నెలకు రూ.15,000 చెల్లిస్తున్నారు. మరో 20 మంది ప్రత్యేకమైన గదులు, అదనపు సౌకర్యాలు తీసుకుని రూ.22,000 చెల్లిస్తున్నారు. అందరూ ఒకే పీజీలో ఉన్నప్పటికీ 20 మందికి సంబంధించి మాత్రమే జీఎస్‌టీ వర్తిస్తుంది. అలాగే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) కూడా దామాషా పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది.
రాంబాబు గొండాల
గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.