ఈ-వే బిల్లులో కొత్త మార్పు..
ABN , Publish Date - Aug 09 , 2026 | 03:24 AM
జీఎస్‌టీ చట్టం ప్రకారం నిర్ణీత విలువకు మించి వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించే సందర్భాల్లో ఈ-వే బిల్ తీసుకోవాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. సాధారణంగా...
జీఎస్‌టీ చట్టం ప్రకారం నిర్ణీత విలువకు మించి వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించే సందర్భాల్లో ఈ-వే బిల్ తీసుకోవాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. సాధారణంగా వస్తువులను ఎవరు కొనుగోలు చేస్తారో.. వారికే సరుకు పంపటం జరుగుతుంది. అయితే వ్యాపార లావాదేవీల్లో బిల్లు ఒకరి పేరుతో ఉండి.. సరుకు మాత్రం మరొకరికి పంపే సందర్భాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, పెద్ద కంపెనీలు, ఆన్‌లైన్ వ్యాపారాల్లో ఇటువంటి లావాదేవీలు సాధారణంగా జరుగుతుంటాయి. ఇలాంటి లావాదేవీల్లో సరుకు వాస్తవంగా ఎవరికి చేరుతుందో మరింత స్పష్టంగా తెలుసుకోవటానికి జీఎస్‌టీ నెట్‌వర్క్ ఈ-వే బిల్ విధానంలో కొత్త మార్పు తీసుకువచ్చింది. దీని ప్రకారం బిల్ టు/షి్‌ప-టు లావాదేవీల్లో సరుకు అంతిమంగా అందుకునే వ్యక్తికి జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ ఉంటే.. అతని రిజిస్ట్రేషన్ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సరుకు అందుకునే వ్యక్తికి జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ లేకుంటే యూఆర్‌పీ.. అంటే అన్‌రిజిస్టర్డ్ పర్సన్ అని నమోదు చేయవచ్చు. ఈ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధన గురించి వ్యాపారస్తులు అవగాహన కలిగి ఉండాలి.
బిల్-టు/షిప్-టు అంటే: దీన్ని ఒక ఉదాహరణతో సులభంగా అర్ధం చేసుకోవచ్చు. ఏలూరులో ఉండే అనంత్ అనే వ్యాపారి తనకు కావాల్సిన సరుకును ఎప్పుడు రాజమండ్రిలోని రమేశ్ అనే వ్యాపారి వద్ద కొనుగోలు చేస్తున్నాడు. అలాగే ఈ సారి కూడా తనకు కావాల్సిన వస్తువుల లిస్ట్‌ను రమేశ్‌కు పంపాడు. అయితే తన దగ్గర సమయానికి ఆ వస్తువులు అందుబాటులో లేకపోవటంతో రమేశ్, విజయవాడలోని శ్రీనివాస్ అనే మరో వ్యాపారస్తునికి ఈ ఆర్డర్ మొత్తం పంపాడు. అలాగే సరుకు రాజమండి వచ్చి తిరిగి ఏలూరు పోవటం అంటే సమయం వృధా, రవాణా ఖర్చులు అధికం కూడా. కాబట్టి శ్రీనివా్‌సతో ఆ సరుకును నేరుగా అనంత్‌కు పంపమని సూచించటం జరిగింది. వ్యాపార లావాదేవీల్లో ఇలా సరుకు పంపించటం చాలా సాధారణం. ఇక్కడి ఎవరికి ఎవరు కస్టమర్ అని ఆలోచిస్తే రమేశ్‌కు అనంత్ కస్టమర్ కాగా.. శ్రీనివా్‌సకు రమేశ్ కస్టమర్. అంటే శ్రీనివాస్ ఇన్వాయి్‌సను రమేశ్‌కు ఇస్తాడు. రమేశ్ తన ఇన్వాయి్‌సను అనంత్‌కు ఇస్తాడు. కానీ సరుకు మాత్రం శ్రీనివాస్ నుంచి నేరుగా అనంత్‌కు చేరుతుంది. దీన్నే బిల్ టు/షిప్ టు విధానం అంటారు. అంటే బిల్ (ఇన్వాయిస్) ఒకరి పేరుతో ఉంటే, షిప్పింగ్ అంటే డెలివరీ వేరే వ్యక్తి పేరుతో ఉంటుంది.
అయితే ఈ విధానం ఈ-వే బిల్ వ్యవస్థలో ఎప్పటి నుంచో ఉంది. కాకుంటే సరుకు వాస్తవంగా అందుకుంటున్న వ్యక్తి అంటే అనంత్‌కు సంబంధించిన జీఎస్‌టీ నంబర్ ఇప్పటి దాకా వేయటం అనేది తప్పనిసరి కాదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన నిబంధన ప్రకారం.. శ్రీనివాస్ అనే వ్యక్తి సరుకును రమేశ్ పేరు మీద పంపుతున్నప్పటికీ అది అంతిమంగా చేరేది అనంత్‌కు కాబట్టి రమేశ్ జీఎస్‌టీ వివరాలతో పాటు అనంత్ జీఎస్‌టీ వివరాలు కూడా తప్పనిసరిగా నమోదు చేయాలి. ఒకవేళ అనంత్‌కు రిజిస్ట్రేషన్ లేకుంటే ‘యూఆర్‌పీ’ (అన్ రిజిస్టర్డ్ పర్సన్) అని నమోదు చేయవచ్చు.
బిల్ ఫ్రమ్.. షిప్ ఫ్రమ్: అలాగే ఈ లావాదేవీల్లో బిల్ ఫ్రమ్, షిప్ ఫ్రమ్ అనే లావాదేవీ కూడా ఉంటుంది. అంటే బిల్ ఒకరి దగ్గరి నుంచి వస్తుంటే సరుకు మరొకరి దగ్గరి నుంచి వస్తుందని అర్ధం. అలాంటి సందర్భంలో అంతిమ కొనుగోలుదారుడి జీఎ్‌సటీ వివరాలు అవసరం లేదు. మరి ఒక లావాదేవీ బిల్-టు/షి్‌ప-టు కిందకు వస్తుందా లేదా బిల్ ఫ్రమ్, షిప్ ఫ్రమ్ కిందకు వస్తుందా అనేది ఈ-వే బిల్ ఎవరు తయారు చేస్తున్నారు అనే కోణంలో చూడాలి.
కాంబినేషన్ ట్రాన్సాక్షన్..: అలాగే కాంబినేషన్ ట్రాన్సాక్షన్ అనే ఇంకో రకం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో గూడ్స్ పంపే వ్యక్తి కూడా వేరే వ్యక్తి, గూడ్స్ అందుకునే వ్యక్తి కూడా వేరే వ్యక్తి కావచ్చు. అంటే ఇక్కడ నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉండవచ్చు.
ఉదాహరణకు ‘ఏ’ అనే వ్యక్తి తన కస్టమర్ అయిన ‘బీ’కి సరుకు పంపమని ‘సీ’కి చెప్పాడు. సీ వద్ద సరుకు అందుబాటులో లేకపోవటంతో తాను ‘డీ’ అనే వ్యక్తికి పురమాయిస్తాడు. ఇక్కడ నిజంగా సరుకు పంపే వ్యక్తి అయిన ‘డీ’కి సరుకు అంతిమంగా పొందే ‘బీ’కి ఎలాంటి సంబంధం ఉండదు. అయినప్పటికీ,. ఈ-వే బిల్‌లో ‘షిప్-టు’ అనే కాలమ్ కింద ‘బీ’కి సంబంధించిన జీఎస్‌టీ వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సాధారణ లావాదేవీలో అంటే సప్లయర్ ఎవరికైతే ఇన్వాయిస్ జారీ చేస్తాడో, సరుకు కూడా అదే వ్యక్తికి పంపితే అది బిల్-టు/షిప్ టు విధానంలోకి రాదు. అలాగే సరుకును కొనుగోలుదారునికి చెందిన మరో గోడౌన్ లేదా అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినె్‌సకు పంపినా దాన్ని బిల్ టు/షి్‌ప-టుగా భావించకూడదు. అంటే, సరుకు కొనుగోలు చేసిన వ్యక్తి, సరుకు పొందే వ్యక్తికి సంబంధించి జీఎస్‌టీ సంఖ్య వేర్వేరుగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని బిల్-టు/షి్‌ప-టుగా భావించాలి. అలా లేకుంటే దాన్ని సాధారణ లావాదేవీగానే నమోదు చేయాలి.
గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.
రాంబాబు గొండాల
ఈ వార్తలు కూడా చదవండి
ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే..
డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ