Share News

బంగారు ఆభరణాలపై జీఎస్‌టీ ఎలా..

ABN , Publish Date - Sep 27 , 2026 | 01:46 AM

బంగారం మన భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్య భాగం. పెళ్లి అనే కాకుండా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా బంగారం తప్పనిసరి. అలాగే కేవలం ఆభరణాలనే కాకుండా పసిడిని పెట్టుబడిగా చూసే...

బంగారు ఆభరణాలపై జీఎస్‌టీ ఎలా..

బంగారం మన భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్య భాగం. పెళ్లి అనే కాకుండా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా బంగారం తప్పనిసరి. అలాగే కేవలం ఆభరణాలనే కాకుండా పసిడిని పెట్టుబడిగా చూసే వారు చాలా మంది ఉంటారు. ఇతర స్థిర చరాస్థుల మాదిరిగా బంగారంలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇటీవలి కాలంలో బంగారం ధర విపరీతంగా పెరగటంతో వెండితో కూడా ఆభరణాలు తయారు చేయటం మొదలుపెట్టారు. వెండితో చేసిన ఆభరణాల పైన బంగారం కవరింగ్‌ చేస్తుండటంతో ఈ నగలకు ఆదరణ పెరుగుతోంది.

నగల బిల్లింగ్‌లో..

బంగారం నగల బిల్లింగ్‌లో చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. తూకం, తరుగు, మజూరీని కూడా బిల్‌లో కలపాల్సి ఉంటుంది. అలాగే బంగారం నగలో అందం, వైవిధ్యం కోసం వివిధ రకాల విలువైన రాళ్లు అంటే.. వజ్రం, పగడం, పచ్చ, కెంపు వంటి వాటిని ఉపయోగిస్తుంటారు. వీటి విలువ ఆధారంగా కూడా బిల్‌ చేసే పద్ధతి మారుతుంది. అంటే రాళ్ల విలువను బట్టి మొత్తం నగ స్థూల బరువును మాత్రమే పరిగణనలోకి తీసుకుని బంగారం విలువ ప్రకారం గణించటం ఒక పద్ధతి కాగా, నికర బరువు ప్రకారం బంగారం ధర లెక్కించి, రాళ్ల ధర విడిగా కలపటం మరొక పద్ధతి. తరుగు, మజూరీ విడివిడిగా లెక్కించటమనేది సంప్రదాయ పద్ధతి కాగా, వాటి స్థానంలో గ్రాముకు ఇంత చొప్పున ‘అదనపు విలువ’ను జోడించటం కొత్తగా వచ్చిన కార్పొరేట్‌ పద్ధతి. అలాగే చాలా సందర్భాల్లో పాత బంగారాన్ని ఇచ్చి కొత్త నగలను ‘ఎక్స్ఛేంజ్‌’ కింద తీసుకుంటారు.

అయితే జీఎస్‌టీకి సంబంధించి ఈ విషయంలో కొంత గందరగోళం ఉంది. ముఖ్యంగా పాత గొలుసు ఇచ్చి కొత్తది తీసుకున్నప్పుడు ఎంత మొత్తంపై పన్ను పడాలి? మన బంగారంతో ఆభరణం చేయిస్తే కూడా అదే లెక్క వర్తిస్తుందా? వెండి ఆభరణాలకు పన్ను వేరుగా ఉంటుందా? తరుగు, మజూరీలకు కూడా జీఎస్‌టీ వర్తిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు మీ కోసం...


ఎలా లెక్కించాలి?

సాధారణంగా బంగారు, వెండి ఆభరణాలకు జీఎస్‌టీ 3 శాతం. మరి ఈ 3 శాతాన్ని కేవలం బంగారం విలువపైనే లెక్కించాలా? అంటే కాదు.. ఆ ఆభరణానికి సంబంధించిన మొత్తం విలువ అంటే మజూరీ, తరుగు కలుపుకొని లెక్కించాలి. మజూరీని విడిగా చూపిస్తే దాని మీద జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేదని చాలా మంది భావిస్తుంటారు. కానీ అది తప్పు. కొత్త ఆభరణాన్ని దుకాణమే విక్రయిస్తున్నప్పుడు, దాని విక్రయానికి సంబంధించిన మేకింగ్‌ చార్జీలు కూడా పన్ను విలువలో భాగమే. బిల్లులో బంగారం విలువను, మజూరీని వేర్వేరు వరుసల్లో చూపించినంత మాత్రాన అవి రెండు స్వతంత్ర సరఫరాలు కావు. ఉదాహరణకు బంగారం విలువ రూ.లక్ష. తయారీ చార్జీలు రూ.10,000 అయితే, ఇతర సర్దుబాట్లు లేవనుకుంటే రూ.1,10,000పై 3ు.. అంటే రూ.3,300 జీఎస్‌టీ. మొత్తం బిల్లు రూ.1,13,300.

పాత బంగారం ఇచ్చినప్పుడు పన్ను తగ్గుతుందా?

చాలా మంది కొనుగోలుదారులు పాత బంగారాన్ని ఇచ్చి కొత్త నగ కొంటున్నప్పుడు, పాత నగ మేరకు జీఎస్‌టీ వర్తించదనే భావనలో ఉంటారు. పై ఉదాహరణలో చూస్తే ఆభరణం విలువ తయారీ చార్జీలతో కలిపి రూ.1,10,000 అయ్యింది కదా. ఇప్పుడు కొనుగోలుదారుడు రూ.50,000 విలువైన పాత బంగారాన్ని ఇచ్చాడనుకుందాం. అప్పుడు కొత్త నగ నికర విలువ రూ.60,000 అవుతుంది. కాబట్టి దీని మీదనే జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుందని భావిస్తుంటారు. కొంత మంది వర్తకులకు కూడా ఇదే అనుమానం ఉంటుంది.

దీన్ని సులువుగా అర్ధం చేసుకోవాలంటే, జీఎస్‌టీ అనేది కేవలం ‘నగదు’కు మాత్రమే వర్తించదు. జీఎస్‌టీ చెల్లించాల్సింది ‘కన్సిడరేషన్‌’ మీద అని తెలుసుకోవాలి. కన్సిడరేషన్‌ అంటే ఒక వ్యాపారి తాను అందించే సరఫరాకు గాను పొందే ‘ప్రతిఫలాని’కి సంబంధించిన మొత్తం విలువ. ఇక్కడ నగ విలువ రూ1,10,000. కొనుగోలుదారుడు ఆ విలువ మొత్తాన్ని కొంత ‘నగదు’ గాను, కొంత పాత బంగారం రూపంలోనూ చెల్లిస్తున్నాడు. అంటే, అతను చెల్లించే మొత్తం విలువ రూ.1,10,000 కు సమానమవుతుంది. జీఎ్‌సటీ అనేది మొత్తం విలువ మీద అమలవుతుంది. కాబట్టి పాత నగ విలువను డిస్కౌంట్‌ కింద భావించరాదు. ఇకపోతే బంగారంలో వజ్రాలు, పచ్చలు లాంటి విలువైన రాళ్లు ఉన్నా లేదా అంతగా ఖరీదు లేని సాధారణ రాళ్లు ఉన్నా, అసలు ఎలాంటి రాళ్లు పొదగని సాధారణ నగ అయినా.. మొత్తం విలువ మీద జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది.


మన బంగారంతో చేయుంచుకుంటే..

కొన్ని సార్లు మనకు తెలిసిన స్వర్ణకారుడు ఉంటే, అతనికే బంగారం ఇచ్చి నచ్చిన విధంగా నగలు చేయించుకుంటాం. దానికి గానూ కేవలం తయారీ చార్జీ మాత్రమే వసూలు చేస్తారు. అలాంటప్పుడు ‘తయారీ చార్జీ’ మీద మాత్రమే.. అది కూడా సదరు స్వర్ణకారుడికి జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ ఉంటేనే.. జీఎస్‌టీ చెల్లిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ లావాదేవీ అమ్మకం కిందకు రాదు. సర్వీస్‌ కిందకు వస్తుంది. కాబట్టి 3 శాతం జీఎస్‌టీ అనేది ఇక్కడ వర్తించదు. నిబంధనల ప్రకారం (సదరు లావాదేవీ జాబ్‌ వర్క్‌ నిబంధన కిందకు వస్తుందా లేదా అనే అంశాన్ని బట్టి) 5 లేదా 18 శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ పన్ను కేవలం తయారీ చార్జీ మీద మాత్రమే ఉంటుంది. పైన చెప్పిన నియమ నిబంధనలన్నీ వెండి వస్తువులకు కూడా వర్తిస్తాయి.

రాంబాబు గోండోల

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

ఇవి కూడా చదవండి:

శుభ్‌మన్ గిల్ గాయంపై స్పందించిన టీమిండియా

నేను చేయాల్సిన పని మిగిలే ఉంది.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

Updated Date - Sep 27 , 2026 | 01:46 AM