Share News

పసిడికి భారీగా తగ్గిన డిమాండ్.. 70 శాతం కోత

ABN , Publish Date - May 30 , 2026 | 08:39 PM

దిగుమతి సుంకాల పెంపు తరువాత భారత్‌లో బంగారానికి డిమాండ్ ఏకంగా 70 శాతం మేర పడిపోయిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

పసిడికి భారీగా తగ్గిన డిమాండ్.. 70 శాతం కోత
Gold Demand Drop in India

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో బంగారానికి డిమాండ్ భారీగా తగ్గింది. ఏకంగా 70 శాతం మేర పడిపోయింది. లోహాలపై కేంద్రం దిగుమతి సుంకాన్ని పెంచడంతో డిమాండ్‌లో భారీగా కోత పడింది. మే 27తో ముగిసిన 15 రోజుల వ్యవధిలో బంగారానికి డిమాండ్ అంతకుముందు ఇదే కాలంతో పోలిస్తే 25 టన్నుల నుంచి 7.5 టన్నులకు పడిపోయిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఫారెక్స్ నిల్వలను పొదుపు చేసేందుకు కేంద్రం మే 13న దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచిన విషయం తెలిసిందే.

బంగారు నగల అమ్మకాలు తగ్గిపోయాయని దేశవ్యాప్తంగా బంగారం షాపుల వారు చెప్పినట్టు ఇండియన్ బులియన్ అండ్ జ్యూవెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) పేర్కొంది. దిగుమతి సుంకాన్ని పెంచాక డిమాండ్‌లో దాదాపు 70 శాతం కోత పడినట్టు తమకు సమాచారం అందిందని పేర్కొంది. బంగారం విక్రయాలకు సంబంధించి దేశంలో అసంఘటిత రంగం వాటా 65 శాతమని, ఈ రంగంపైనే అధిక ప్రభావం కనిపిస్తోందని ఐబీజేఏ జాతీయ సెక్రటరీ తెలిపారు. సుంకం పెంపు తరువాత బంగారంపై పన్ను భారం (జీఎస్టీతో సహా..) 9.18 శాతం నుంచి 18.45 శాతానికి పెరిగిందని అన్నారు.


సుంకాల భారానికి తోడు ఇంధన, ఆహార ధరలు కూడా పెరగడంతో వినియోగదారులు బంగారంపై ఖర్చులను వాయిదా వేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలన్న ప్రధాని మోదీ పిలుపు కూడా ప్రభావం చూపించిందని చెబుతున్నాయి. ఇది అధిక మాసం కూడా కావడంతో బంగారం కొనుగోళ్లు తగ్గాయని నగల వ్యాపారులు అంటున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

క్లెయిమ్‌ చేయని డిపాజిట్ల కోసం ప్రత్యేక పోర్టల్‌

Updated Date - May 30 , 2026 | 08:56 PM