Share News

దేశీ మదుపరి.. గ్లోబల్‌ సెర్చ్‌!

ABN , Publish Date - Sep 27 , 2026 | 01:56 AM

అమెరికన్‌ కంపెనీల షేర్లు సహా అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడులపై భారతీయ మదుపరుల ఆసక్తి వేగంగా పెరుగుతోంది. గూగుల్‌ ట్రెండ్స్‌ తాజా డేటా ప్రకారం.. గ్లోబల్‌ మార్కెట్లలో..

దేశీ మదుపరి.. గ్లోబల్‌ సెర్చ్‌!

  • విదేశీ మార్కెట్లలో పెట్టుబడులపై భారతీయుల్లో పెరిగిన ఆసక్తి

  • గడిచిన ఏడాది కాలంలో 5,000ు పెరిగిన ఇంటర్నెట్‌ సెర్చ్‌లు

అమెరికన్‌ కంపెనీల షేర్లు సహా అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడులపై భారతీయ మదుపరుల ఆసక్తి వేగంగా పెరుగుతోంది. గూగుల్‌ ట్రెండ్స్‌ తాజా డేటా ప్రకారం.. గ్లోబల్‌ మార్కెట్లలో పెట్టుబడులకు సంబంధించి గడిచిన ఏడాది కాలంలో భారతీయ ఇన్వెస్టర్ల ఇంటర్నెట్‌ సెర్చ్‌ (శోధన)లు ఏకంగా 5,000 శాతానికి పైగా పెరిగాయి. అంతేకాదు, ఆర్‌బీఐ డేటా ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారతీయులు పెట్టుబడులు పెట్టేందుకు 260 కోట్ల డాలర్లు (సుమారు రూ.24,700 కోట్లు) విదేశీ మార్కెట్లకు తరలించారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2024-25)లో నమోదైన 169 కోట్ల డాలర్ల పెట్టుబడులతో పోలిస్తే 56 శాతం అధికం ఇది.

కొత్తేమీ కాదండోయ్‌..

భారతీయులు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం కొత్త ట్రెండ్‌ ఏమీ కాదు. కాకపోతే, ఈ మధ్య కాలంలో వేగం పుంజుకుంది. ఇందుకోసం చాలా కాలం క్రితమే ఆర్‌బీఐ లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎ్‌స)ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా మైనర్లు సహా భారత వాసులు ఏదైనా ఆర్థిక సంవత్సరంలో 2.50 లక్షల డాలర్ల వరకు విదేశాలకు పంపే వీలుంటుంది.

పెట్టుబడులు ఎలాగంటే..

మదుపరులు ప్రధానంగా 4 మార్గాల ద్వారా అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు.

  • అంతర్జాతీయ మ్యూచువల్‌ ఫండ్లు: ఫీడర్‌ ఫండ్లు భారతీయుల పెట్టుబడులను విదేశాల్లోని తమ మాతృఫండ్లలోకి తరలిస్తాయి.

  • గ్లోబల్‌ ఈటీఎ్‌ఫలు: డీమ్యాట్‌ ఖాతా ద్వారా ఆయా ఇండెక్స్‌ల్లో పెట్టుబడులు పెట్టవచ్చు.

  • అంతర్జాతీయ బ్రోకింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌: వీటి ద్వారా అమెరికా స్టాక్స్‌, ఈటీఎ్‌ఫలతో పాటు ఏదైనా కంపెనీకి చెందిన ఒక షేరు విలువలో కొంత శాతం పెట్టుబడిగానూ పెట్టే వీలుంటుంది.

  • ఎన్‌ఎ్‌సఈ ఐఎక్స్‌, ఇండియా ఐఎన్‌ఎక్స్‌ గ్లోబల్‌ యాక్సె్‌స (బీఎస్‌ఈ): ఐఎ్‌ఫఎ్‌ససీఏ నియంత్రణలోని ఈ అంతర్జాతీయ ఎక్స్ఛేంజ్‌ల ద్వారా భారతీయులు, ప్రవాసులు యూఎస్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు.


13.4 రెట్లు

2020 జూన్‌తో పోలిస్తే ఈ జూన్‌లో భారతీయులు విదేశీ మార్కెట్లలో ఈక్విటీ, బాండ్లలో పెట్టుబడుల కోసం పంపిన సొమ్ము విలువలో వృద్ధి ఇది, 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025-26లో పెట్టుబడులు 5.6 రెట్లు పెరిగాయి.

4 శాతం

ప్రపంచవ్యాప్త స్టాక్‌ మార్కెట్ల మొత్తం విలువలో భారత్‌ వాటా కేవలం 4 శాతమే. అంటే, ఈక్విటీ మదుపరులకు 96 శాతం పెట్టుబడి అవకాశాలు విదేశీ మార్కెట్లలోనే ఉన్నాయన్నమాట.

25.4 శాతం

గత ఆర్థిక సంవత్సరం అమెరికా కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టిన భారతీయులకు లభించిన రిటర్నులు ఇవి. అందులో ఎస్‌ అండ్‌ పీ సూచీ 14 శాతం వృద్ధితో పాటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 శాతానికి పైగా క్షీణతతో యూఎస్‌ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టిన భారతీయులకు భారీ ప్రతిఫలాలు దక్కాయి.

అందరి ఫేవరేట్‌ ఎన్‌విడియా

అమెరికాకు చెందిన ఏఐ చిప్‌ల తయారీ దిగ్గజం ఎన్‌విడియా షేరు అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే భారతీయ మదుపరులందరి ఫేవరేట్‌గా నిలిచింది. మైక్రాన్‌, మెటా, మైక్రోసాఫ్ట్‌, ఏఎండీ, శాన్‌డి్‌స్క, బ్రాడ్‌కామ్‌, గూగుల్‌, టెస్లా స్టాక్‌ టాప్‌ టెన్‌ స్థానాల్లో నిలిచాయి. కొద్ది నెలల క్రితం అమెరికా మార్కెట్లో నమోదైన ఎలాన్‌ మస్క్‌ కంపెనీ స్పేస్‌ఎక్స్‌ షేర్లలోనూ ఇండియన్‌ ఇన్వెస్టర్లు గణనీయంగా పెట్టుబడులు పెట్టారు.

ఇవి కూడా చదవండి:

శుభ్‌మన్ గిల్ గాయంపై స్పందించిన టీమిండియా

నేను చేయాల్సిన పని మిగిలే ఉంది.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

Updated Date - Sep 27 , 2026 | 01:56 AM