ఆసియా కుబేరుడు అదానీ
ABN , Publish Date - Apr 18 , 2026 | 05:09 AM
అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ ఆసియాలోకెల్లా అత్యంత సంపన్నుడిగా అవతరించారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. శుక్రవారం నాటికి అదానీ ఆస్తి 9,260 కోట్ల డాలర్ల....
ముకేశ్ సంపదకు భారీ గండి
అంబానీని వెనక్కి నెట్టి అగ్రస్థానానికి..
రూ.8.61 లక్షల కోట్లకు పెరిగిన ఆస్తి
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ ఆసియాలోకెల్లా అత్యంత సంపన్నుడిగా అవతరించారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. శుక్రవారం నాటికి అదానీ ఆస్తి 9,260 కోట్ల డాలర్ల (రూ.8.61 లక్షల కోట్లు)కు పెరిగింది. దాంతో ఆయన భారత్‌తో పాటు ఆసియాలోని అత్యంత ధనవంతుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి అగ్రస్థానానికి ఎగబాకారు. అదానీ కంపెనీల షేర్లలో ర్యాలీ ఇందుకు దోహదపడింది. గురువారం ఆయన నెట్‌వర్త్ ఏకంగా 356 కోట్ల డాలర్ల మేర ఎగబాకింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 810 కోట్ల డాలర్ల మేర వృద్ధి చెందింది. కాగా, ముకేశ్ అంబానీ 9,080 కోట్ల డాలర్ల (రూ.8.44 లక్షల కోట్లు) సంపదతో రెండో స్థానానికి పరిమితమయ్యారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు భారీగా క్షీణించడం ఇందుకు కారణమైంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అంబానీ సంపద 1,690 కోట్ల డాలర్ల మేర తగ్గింది.
అదానీ 19.. అంబానీ 20
ప్రపంచ బిలియనీర్ల ర్యాంకింగ్స్‌లో అదానీ 19, అంబానీ 20వ స్థానాల్లో ఉన్నారు. వరల్ట్ టాప్-20లోని భారతీయ సంపన్నులు వీరిద్దరే. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ 65,600 కోట్ల డాలర్ల (రూ.61 లక్షల కోట్ల పైమాటే) ఆస్తితో ప్రపంచ నం.1గా కొనసాగుతున్నారు. రెండో స్థానంలో ఉన్న ల్యారీ పేజ్ ఆస్తితో పోలిస్తే రెట్టింపు కంటే అధికమిది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సహ వ్యవస్థాపకుడైన ల్యారీ పేజ్ నెట్‌వర్త్ 28,600 కోట్ల డాలర్లుగా ఉంది. అంతర్జాతీయ ఈ-కామర్స్, టెక్నాలజీ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 26,900 కోట్ల డాలర్ల సంపదతో మూడో స్థానంలో నిలిచారు. ఆల్ఫాబెట్ మరో వ్యవస్థాపకుడైన సెర్గే బ్రిన్ (26,600 కోట్ల డాలర్లు) , ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా సీఈఓ మార్క్ జుకెర్‌బర్గ్ (23,900 కోట్ల డాలర్లు) నెట్‌వర్త్‌తో వరుసగా 4,5 స్థానాల్లో ఉన్నారు.
ఇవి కూడా చదవండి
ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..