Share News

దేశీ హాస్పిటల్స్‌పై విదేశీ పాగా

ABN , Publish Date - Oct 06 , 2026 | 04:20 AM

దేశీయ వైద్య సేవల రంగం మారిపోతోంది. బ్లాక్‌స్టోన్‌, కేకేఆర్‌, టీపీజీ, జనరల్‌ అంట్లాంటిక్‌, టెమాసెక్‌ వంటి అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) సంస్థలు క్రమంగా దేశీయ హాస్పిటల్స్‌ను కొనేస్తున్నాయి...

దేశీ హాస్పిటల్స్‌పై విదేశీ పాగా

గత ఐదేళ్లలో రూ.96,000 కోట్ల

పీఈ పెట్టుబడులు ఆకర్షిస్తున్న భారీ లాభాలు

దేశీయ వైద్య సేవల రంగం మారిపోతోంది. బ్లాక్‌స్టోన్‌, కేకేఆర్‌, టీపీజీ, జనరల్‌ అంట్లాంటిక్‌, టెమాసెక్‌ వంటి అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) సంస్థలు క్రమంగా దేశీయ హాస్పిటల్స్‌ను కొనేస్తున్నాయి. గత ఐదేళ్లలో ఈ సంస్థలు ఇందుకోసం 1,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.96,000 కోట్లు) వరకు ఖర్చు చేసినట్టు ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఈవై) అనే అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ ఒక నివేదికలో తెలిపింది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే కేర్‌ హాస్పిటల్స్‌ సహా మరికొన్ని హాస్పిటల్స్‌ ఇప్పటికే బ్లాక్‌స్టోన్‌, ఇతర పీఈ సంస్థల నిర్వహణలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కాగా ఈ మధ్య కాలంలోనే మెడికవర్‌ హాస్పిటల్స్‌ను పీఈ సంస్థ కేకేఆర్‌ చేజిక్కించుకుంది. ప్రస్తుతం దేశంలోని హాస్పిటల్‌ బెడ్స్‌లో 5 శాతం వరకు అంతర్జాతీయ పీఈ సంస్థల నిర్వహణలోని హాస్పిటల్స్‌ చేతిలో ఉన్నట్టు అంచనా.

ఎందుకంటే?

మన దేశంలో ప్రభుత్వ వైద్య సేవలు అంతంత మాత్రమే. ప్రపంచంలో ప్రతి 1,000 మంది జనాభాకు సగటున 3.3 బెడ్స్‌ ఉంటే, మన దేశంలో అది 1.3 మాత్రమే. దీనికి తోడు జీవన శైలి మార్పులతో దేశంలో ఏటికేటికి హృద్రోగాలు, క్యాన్సర్‌, కిడ్నీ, కాలేయ సమస్యలు పెరిగి పోతున్నాయి. ఈ సమస్యల చికిత్సకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన ఆధునిక వైద్య పరికరాలు గానీ, వసతులుగానీ లేవు. దీంతో ప్రైవేట్‌ హాస్పిటల్స్‌కు గిరాకీ పెరిగింది. అనేక మంది నిపుణులైన డాక్టర్లు దీన్ని అవకాశంగా తీసుకుని సొంతంగా హాస్పిటల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. వీరిలో కొందరికి పీఈ సంస్థలు పెట్టుబడులు సమకూరుస్తున్నాయి. సంపన్న, ఎగువ మధ్య తరగతి వర్గాల్లో ఎక్కువ మంది ప్రస్తుతం తమ అనారోగ్య సమస్యల చికిత్స కోసం ఈ హాస్పిటల్స్‌నే ఆశ్రయిస్తున్నారు.

దీంతో అనేక హాస్పిటల్‌ చెయిన్స్‌ మంచి ఆదాయంతో పాటు లాభాలూ ఆర్జిస్తున్నాయి. 2017లో మణిపాల్‌ హాస్పిటల్స్‌లో టెమాసెక్‌ హోల్డింగ్స్‌ అనే విదేశీ పీఈ సంస్థ పెట్టుబడులు పెట్టి.. ఈ ఏడాది వచ్చిన మణిపాల్‌ హాస్పిటల్స్‌ పబ్లిక్‌ ఇష్యూలో కొంత వాటాను 10 రెట్ల లాభానికి అమ్ముకుంది. అంతర్జాతీయ పీఈ సంస్థలు భారతీయ హాస్పిటల్స్‌ చెయిన్స్‌ను కొనుగోలు చేయడం వెనక ఈ భారీ లాభాలే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.


కళ్లు తిరిగే బిల్లులు

అత్యాధునిక సదుపాయాలు, ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌ను తలపించే ఈ ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ బిల్లులు చూస్తే మతి పోవాల్సిందే. ప్రభుత్వ హాస్పిటల్స్‌తో పోలిస్తే పీఈ సంస్థల నిర్వహణలోని ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో బిల్లులు ఐదు నుంచి పది రెట్లు ఎక్కువ ఉంటున్నాయి. దీంతో సంపన్న వర్గాలు, ఎగువ మధ్య తరగతి ప్రజలు తప్ప, సామాన్యులెవరూ ఈ హాస్పిటల్స్‌ గడప తొక్కేందుకు కూడా సాహసించడం లేదు. వీటి దందాపై పార్లమెంటరీ కమిటీలు, బీమా కంపెనీలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. పార్లమెంటరీ కమిటీలైతే ఈ హాస్పిటల్స్‌ బిల్లులపై నియంత్రణ ఉండాలని సిఫారసు చేసింది. అయినా ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మొత్తం మీద ప్రజల అనారోగ్య సమస్యలు పీఈ సంస్థల నిర్వహణలోని ప్రైవేట్‌ హాస్పిటల్స్‌కు కనక వర్షం కురిపిస్తున్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

త్వరలో GST కౌన్సిల్ భేటీ.. సంచలన సంస్కరణలకు శ్రీకారం!

స్థిరంగా పసిడి ధరలు.. ప్రస్తుతం రేట్స్ ఇవీ

Updated Date - Oct 06 , 2026 | 04:20 AM