Share News

అరటి సాగులోకి ఎఫ్‌డీఐ

ABN , Publish Date - Sep 07 , 2026 | 01:30 AM

అరటి వంటి మరిన్ని వాణిజ్య పంటలను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిధిలోకి తీసుకురావడం ద్వారా ప్లాంటేషన్‌ (తోటల పెంపకం) రంగంలో విదేశీ పెట్టుబడులకు మరింత అవకాశం కల్పించే అంశా న్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.

అరటి సాగులోకి ఎఫ్‌డీఐ

న్యూఢిల్లీ: అరటి వంటి మరిన్ని వాణిజ్య పంటలను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిధిలోకి తీసుకురావడం ద్వారా ప్లాంటేషన్‌ (తోటల పెంపకం) రంగంలో విదేశీ పెట్టుబడులకు మరింత అవకాశం కల్పించే అంశా న్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ మేరకు ఈ రంగంలో ఎఫ్‌డీఐ నిబంధనలను సరళీకరించాలనుకుంటోంది. ఈ అంశంపై సంబంధిత వర్గాలతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతోందని ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం టీ ప్లాంటేషన్‌, కాఫీ, రబ్బరు, యాలకులు, పామ్‌, ఆలివ్‌ ఆయిల్‌ ట్రీ ప్లాంటేషన్‌ వంటి రంగాల్లో ఆటోమెటిక్‌ రూట్‌లో 100 శాతం ఎఫ్‌డీఐని అనుమతిస్తున్నారు. అయితే ఇతర ఏ ప్లాంటేషన్‌ రంగం లేదా కార్యకలాపాల్లోకి మాత్రం ఎఫ్‌డీఐని అనుమతించడంలేదు. 2000 ఏప్రిల్‌-2026 మార్చి కాలంలో టీ, కాఫీ రంగంలోకి 29.52 కోట్ల డాలర్లు, రబ్బర్‌ గూడ్స్‌లోకి 393 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐని భారత్‌ పొందింది.

ఏపీ టాప్‌: కాగా వార్షికంగా 3 కోట్ల టన్నులకు పైగా ఉత్పత్తితో భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద అరటి ఉత్పత్తి దేశంగా ఉంది. ప్రపంచ మొత్తం అరటి ఉత్పత్తి (3.53 కోట్ల మెట్రిక్‌ టన్నులు)లో భారత్‌ 26.45 శాతం వాటాను కలిగి ఉన్నప్పటికీ ప్రపంచ మార్కెట్లో మాత్రం మన దేశ ఎగుమతుల వాటా కేవలం ఒక శాతమే ఉంది. 2024-25లో భారత్‌ దాదాపు 30 శాతం వార్షిక వృద్ధితో 37.75 కోట్ల డాలర్ల విలువైన అరటిని ఎగుమతి చేసింది. ఇక అరటి ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ ఉన్నాయి

Updated Date - Sep 07 , 2026 | 01:43 AM