Share News

అత్యవసర నిధి ఉందా?

ABN , Publish Date - Nov 22 , 2026 | 07:31 AM

జీవితం మనం ఊహించిన మార్గంలో అరుదుగా సాగుతుంది. ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురవుతుండటం సహజం. ఒకరోజు చాలా సజావుగా గడిచిపోతుంది. మర్నాడు ఎలా ఉంటుందో..

అత్యవసర నిధి ఉందా?

జీవితం మనం ఊహించిన మార్గంలో అరుదుగా సాగుతుంది. ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురవుతుండటం సహజం. ఒకరోజు చాలా సజావుగా గడిచిపోతుంది. మర్నాడు ఎలా ఉంటుందో ఊహించలేము. ఏదైనా అనుకోని, అత్యవసర పరిస్థితి ఏర్పడవచ్చు. వైద్యపరమైన అత్యవసర పరిస్థితి లేదా ఉద్యోగం కోల్పోవడం లేదా ఇళ్లు, వాహనానికి మరమ్మతు చేయాల్సిన పరిస్థితి ఎదురుకావొచ్చు. అయితే ఇలాంటి వాటికయ్యే ఖర్చులను ఎదుర్కోవడానికి ముందుగానే సిద్ధపడి ఉండకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ తరహా అత్యవసర ఖర్చుల కోసం మీరు ఒక అత్యవసర నిధిని గానీ ఏర్పాటు చేసుకుని ఉంటే మీరు అప్పుల కోసం ఇతరుల ముందు చేయి చాచాల్సిన పరిస్థితి గానీ లేదా మీ దీర్ఘకాలిక పొదుపును వినియోగించుకోవాల్సిన అవసరం ఏర్పడకుండా ఉంటుంది.

జీవన వ్యయాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఆర్థిక పరిస్థితులు మారుతున్నాయి. ఆర్థిక బాధ్యతలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి తరుణంలో అత్యవసర నిధికి మరింత ప్రాధాన్యం ఏర్పడుతోంది. అయితే అత్యవసర నిధి అంటే ఏంటి? దీన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి? దీనివల్ల ప్రయోజనం ఎంత? అన్న విషయాల గురించి చూద్దాం..

భరోసా కోసం..

ఊహించని, అత్యవసర వ్యయాల కోసం మీరు సంపాదించే మొత్తంలో కొంత భాగాన్ని పక్కకు పెడుతూ డబ్బును పోగోసుకోవడాన్ని అత్యవసర నిధిగా చెప్పవచ్చు. దీనివల్ల మీకు చాలా భరోసా ఏర్పడుతుంది. మెడికల్‌ ఎమర్జెన్సీ ఏర్పడిన సందర్భంలో లేదా ఉద్యోగం పోయినప్పుడు లేదా ఆదాయంలో తాత్కాలికంగా అవరోధాలు ఏర్పడినప్పుడు, వాహనానికి అత్యవసరంగా రిపేర్లు చేయాల్సి వచ్చినప్పుడు, అనుకోకుండా ప్రయాణించాల్సి వచ్చినప్పుడు ఇది మీకు ఆర్థిక దన్నును ఇస్తుంది. ఈ నిధి ఉన్నట్టయితే మీరు ఊహించని ఖర్చులు ఎదురైనా అంత ఆందోళన చెందాల్సిన అవసరం ఏర్పడదు. మన అత్యవసరానికి డబ్బు అప్పటికప్పుడు కావాలంటే కొన్ని సందర్భాల్లో దొరక్కపోవచ్చు. ఒకవేళ డబ్బు లభించే మార్గం కనిపించినా అందుకు మీరు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఇలాంటి పరిస్థితి ఎదుర్కోకుండా ఉండేందుకు అత్యవసర నిధి దోహదపడుతుంది.


ఎంత నిధి ఉండాలి?

ఒక నెలలో మీ కుటుంబాన్ని నడిపించడానికి, ఇతరాలకు ఎంత ఖర్చు అవుతుందో మీకు ఒక అంచనా ఉంటుంది కదా. దీన్ని దృష్టిలో ఉంచుకుని మూడు నుంచి ఆరు నెలల అవసరాలకు సరిపడేలా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. నెలవారీ కుటుంబ వ్యయాలు, ఇంటి అద్దె లేదా గృహ రుణ చెల్లింపులు, యుటిలిటీ బిల్లులు, పిల్లల ఫీజులు, బీమా ప్రీమియంలు వంటి వాటికి ఎంత మొత్తం అవుతుందో ఒక అంచనా ఉంటుంది. కాబట్టి ఇందుకు అనుగుణంగా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. మీ ఆదాయంలో ఏవైనా అవాంతరాలు ఏర్పడిన సందర్భంలో ఈ డబ్బు మీకు నేనున్నానంటూ అండగా నిలుస్తుంది.

ఏం చేయాలంటే?

అత్యవసరం కోసం పోగేసుకునే డబ్బును మీ ఇతర డబ్బులో కలపొద్దు. ఎమర్జెన్సీ నిధి కోసం ప్రత్యేకంగా ఒక సేవింగ్స్‌ ఖాతాను తెరవడం మంచిది. ఒక నెలలో ఇంత మొత్తం పొదుపు చేయాలన్న లక్ష్యంతో ఉంటే ఇంకా బెటర్‌. పెద్ద మొత్తంతోనే ఈ నిధి ఏర్పాటు చేసుకోవాలన్న నియమమేమీ లేదు కాబట్టి ఎంతో కొంత మొత్తంతో ముందు నిధిని మొదలుపెట్టండి. క్రమంగా పెంచుకుంటూ వెళ్లండి. అయితే మీకుండే బాధ్యతలు, వృతిపరమైన ఒత్తిడులు వంటి వాటి మూలంగా మీరు ప్రత్యేకంగా తెరిచిన సేవింగ్స్‌ ఖాతాకు సొమ్మును బదిలీ చేయడం ఒక్కోసారి మరిచిపోయే అవకాశం ఉండవచ్చు. అలా జరగకుండా ఉండేందుకు మీ ఇతర ఖాతా నుంచి ఆటోమెటిక్‌ ట్రాన్స్‌ఫర్‌ సదుపాయాన్ని వినియోగించుకోండి. మీ చేతికి వార్షికంగా బోన్‌సలు లేదా ప్రోత్సాహకాలు వచ్చినా లేదా మీకు పన్ను రిఫండ్స్‌ గానీ వచ్చినా ఆ మొత్తాన్ని ఎమర్జెన్సీ నిధికి బదిలీ చేసుకుంటే బాగుంటుంది. అత్యవసర నిధి అనేది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే విధంగా ఉండేలా చూసుకోవాలి. సేవింగ్స్‌ ఖాతా అయితే మంచిది. మీరు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలనుకునే ముందు మీకు సరిపోయేంతగా అత్యవసర నిధి ఉందో లేదో ఒకసారి చూసుకోండి. ఈ నిధి విషయంలో నిర్లక్ష్యం వహించకుండా క్రమశిక్షణతో ఉండాలి. అత్యవసరాల కోసమే ఈ నిధిని వాడుకోవాలన్న నియమం పెట్టుకోండి. ఒకవేళ మీరు అత్యవసర నిధి నుంచి సొమ్మును తీసుకుంటే మళ్లీ దాన్ని వీలైనంత త్వరగా భర్తీ చేయడానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఏడాదికి ఒకసారైనా మీ నిధిని సమీక్షించుకోండి. మీ జీవన శైలికి అనుగుణంగా నిధి ఉన్నదా లేదా చూసుకోండి.


ఇలా చేయొద్దు..

మీ రోజువారీ వ్యయాలతో అత్యవసర నిధిని కలపకండి. ఈ నిధిలో డబ్బులు జమచేయడం పట్ల అశ్రద్ధ వహించొద్దు. అత్యవసరం కాని అవసరాల కోసం వాడొద్దు.

ఈ వార్తలనూ చదవండి:

డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక

భారత్‌ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక

Updated Date - Nov 22 , 2026 | 07:31 AM