Share News

ఏఐతో మన ఉనికికే ముప్పు పొంచి ఉంది.. ఎలాన్ మస్క్ హెచ్చరిక

ABN , Publish Date - Apr 29 , 2026 | 03:42 PM

ఓపెన్ ఏఐపై టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ వేసిన కేసులో మంగళవారం విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏఐపై మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐతో మానవాళికి ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.

ఏఐతో మన ఉనికికే ముప్పు పొంచి ఉంది.. ఎలాన్ మస్క్ హెచ్చరిక
Artificial Intelligence

ఇంటర్నెట్ డెస్క్: ఓపెన్ ఏఐ సంస్థపై టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ వేసిన కేసుకు సంబంధించి మంగళవారం అమెరికా కోర్టులో విచారణ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఈ కేసులో తొలి రోజు విచారణకు హాజరైన మస్క్ ఓపెన్ ఏఐ సంస్థపై పలు ఆరోపణలు చేశారు. లాభాపేక్ష రహితంగా ఉంటామంటూ సంస్థ ఏర్పాటైన తొలినాళ్లల్లో తనకు ఇచ్చిన మాటను తప్పారని ఆరోపించారు. సంస్థ ప్రస్తుతం ధనార్జనే లక్ష్యంగా ముందుకు సాగుతోందని అన్నారు.

లాభాలే లక్ష్యంగా ఏఐ సంస్థలు ఉండకూడదనే ఉద్దేశంతోనే తాను ఓపెన్ ఏఐ ఏర్పాటుకు సహకరించానని మస్క్ చెప్పుకొచ్చారు. ఏఐ విషయంలో గూగుల్‌కు పోటీగా ఒక లాభాపేక్ష రహిత సంస్థ ఉండాలని భావించి తాను శామ్ ఆల్ట్‌మన్‌తో (ఓపెన్ ఏఐ ప్రస్తుత సీఈఓ) చేతులు కలిపానని అన్నారు.


‘కావాలనుకుంటే నేనే ఒక కార్పొరెట్ ఏఐ సంస్థను ఏర్పాటు చేసి ఉండే వాడిని. కానీ నేను అలా చేయదలుచుకోలేదు. వాస్తవానికి చిన్న స్థాయిలో ఫర్-ప్రాఫిట్ సంస్థ ఏర్పాటుకు వ్యతిరేకమేమీ కాదు. కానీ తోక కుక్కను ఊపే స్థాయిలో పరిస్థితి దిగజారకూడదు. లాభాపేక్ష ఉన్న సంస్థగా ఓపెన్ ఏఐ మారడమంటే నా పెట్టుబడులను తప్పుదారి పట్టించినట్టే. టర్మినేటర్ సినిమాల్లోలా ఏఐ వల్ల మానవాళి భవిష్యత్తు చీకటి కాకూడదు. ఆశాజనక మార్గంలో మనం ముందుకు వెళ్లాలి’ అని మస్క్ చెప్పుకొచ్చారు.

ఏఐ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని మస్క్ అన్నారు. మరికొన్నేళ్లల్లో మానవ మేధను కృత్రిమే మేధ అధిగమిస్తుందని కూడా చెప్పారు. ఏఐ విషయంలో తాను ఆందోళనతో ఉన్నానని, ఈ భయాలు తనకు ఎప్పటి నుంచో ఉన్నాయని తెలిపారు.


2015లో గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్‌తో ఒక చర్చా కార్యక్రమంలో మస్క్ పాల్గొన్నారు. ఏఐ భవితవ్యంపై పేజ్ అభిప్రాయాలతో మస్క్ చర్చ సందర్భంగా విభేదించారు. ఏఐతో మానవాళి అంతమైపోతుందని కూడా హెచ్చరించారు. అయితే మస్క్ వాదనలను పేజ్ కొట్టిపారేశారు. కృత్రిమ మేధపై మస్క్ అనవసర అనుమానాలు పెంచుకున్నారని అభిప్రాయపడ్డారు. అయితే, 2015 నాటి చర్చే తనకు లాభాపేక్ష రహిత ఏఐ సంస్థను నెలకొల్పాలన్న ఆలోచనను కలిగించిందని కూడా మస్క్ తాజాగా కోర్టు విచారణలో చెప్పారు.

మస్క్, శామ్ ఆల్ట్‌మన్, మరికొందరు కలిసి 2015లో ఓపెన్ ఏఐని లాభాపేక్ష రహిత సంస్థగా ఏర్పాటు చేశారు. అయితే, 2018లో మస్క్ సంస్థ బోర్డు నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత ఏఐపై పరిశోధన కోసం పెట్టుబడులను ఆకర్షించేందుకు ఓపెన్ ఏఐ 2019లో ఒక అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. ఇందులోని పెట్టుబడులపై వచ్చే లాభాలపై పరిమితి విధించింది. పరిమితికి మించిన లాభాలన్నీ లాభాపేక్ష రహిత మాతృసంస్థకు చెందుతాయని పేర్కొంది. అయితే, ఈ మార్పులపై సందేహాలను వ్యక్తం చేస్తూ మస్క్ కోర్టుకెక్కారు.

Updated Date - Apr 29 , 2026 | 04:28 PM