తెలుగువారి కంపెనీల్లో దివీస్ టాప్
ABN , Publish Date - Jun 25 , 2026 | 06:07 AM
దేశంలోని అత్యంత విలువైన 500 ప్రైవేట్ కంపెనీల జాబితాలో తెలుగువారికి చెందిన 39 సంస్థలకు చోటు దక్కింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న...
డాక్టర్ రెడ్డీస్, ఎంఈఐఎల్‌కు 2, 3 స్థానాలు
హైదరాబాద్ నుంచి 39 కంపెనీలకు చోటు
వాటి మొత్తం విలువ రూ.12.1 లక్షల కోట్లు
గడిచిన ఐదేళ్లలో రోజుకు రూ.283 కోట్ల చొప్పున పెరిగిన తెలుగు కంపెనీల విలువ
దేశంలోని టాప్ 500 కంపెనీల జాబితా విడుదల చేసిన హురున్-బర్గండీ ప్రైవేట్
అన్ లిస్టెడ్ సంస్థల్లో ఎన్‌ఎస్ఈ కింగ్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): దేశంలోని అత్యంత విలువైన 500 ప్రైవేట్ కంపెనీల జాబితాలో తెలుగువారికి చెందిన 39 సంస్థలకు చోటు దక్కింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ అన్ని సంస్థల్లో దివీస్ లేబొరేటరీస్ రూ.1.7 లక్షల కోట్ల మార్కెట్ విలువతో అగ్రస్థానంలో నిలిచింది. డాక్టర్ రెడ్డీస్ (రూ.1.1 లక్షల కోట్లు), మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (రూ.83,800 కోట్లు) వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నాయి.
2025 సంవత్సరానికిగాను యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన బర్గండీ ప్రైవేట్, హురున్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన ఈ రిపోర్టులోని మరిన్ని ముఖ్యాంశాలు..
తెలుగువారి కంపెనీల మొత్తం విలువ రూ.12.1 లక్షల కోట్లకు పెరిగింది. 2021తో పోలిస్తే రూ.5.2 లక్షల కోట్లు (75 శాతం) పెరిగింది. ఐదేళ్లలో కంపెనీల సంఖ్య కూడా 30 నుంచి 39కి చేరింది. అందులో 16 హెల్త్‌కేర్ రంగానికి చెందినవే కావడం గమనార్హం. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగం నుంచి 5 కంపెనీలకు చోటు లభించగా.. ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్ రంగాల నుంచి 3 చొప్పున సంస్థలున్నాయి.
గత ఏడాదిలో మనోళ్ల కంపెనీల మొత్తం విక్రయాలు రూ.2.6 లక్షల కోట్లకు పెరిగాయి. ఐదేళ్లలో సేల్స్ రూ.83,625 కోట్ల (47 శాతం) మేర వృద్ధి చెందాయి. వీటిల్లో మొత్తం 3.4 లక్షల మంది పనిచేస్తున్నారు. గత ఐదేళ్లలో వీరి సంఖ్య 70 శాతం పెరిగింది. తెలుగోళ్ల కంపెనీల సగటు వయసు 37 ఏళ్లుగా ఉంది.
అత్యధిక మంది మహిళలు పనిచేస్తున్న తెలుగు కంపెనీల్లో డాక్టర్ రెడ్డీస్ (8,480 మంది) టాప్‌లో ఉంది. మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్(8,143 మంది), రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్ (3,427 మంది) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
5 ఐపీఎల్ ఫ్రాంచైజీలకూ చోటు
తొలిసారిగా ఐదు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సైతం ఈ జాబితాలో చోటు దక్కింది. వీటి మొత్తం విలువ రూ.71,000 కోట్లుగా నమోదైంది. భారత్‌లో క్రీడల ఫ్రాంచైజీల వాణిజ్య విలువలో భారీ వృద్ధిని ఇది ప్రతిబింబిస్తోందని హురున్ పేర్కొంది.
ర్యాంక్ ఫ్రాంచైజీ విలువ (రూ.కోట్లు)
270 కోల్‌కతా నైట్ రైడర్స్ 20,850
285 చెన్నై సూపర్ కింగ్స్ 19,550
330 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 16,700
343 రాజస్థాన్ రాయల్స్ 15,700
390 పంజాబ్ కింగ్స్ 14,050
టాప్-10 తెలుగు కంపెనీలు
ర్యాంక్ సంస్థ విలువ (రూ.కోట్లు)
1 దివీస్ లేబొరేటరీస్ 1,72,630
2 డాక్టర్ రెడ్డీస్ 1,10,420
3 మేఘా ఇంజనీరింగ్ 83,800
4 అరబిందో ఫార్మా 80,710
5 గ్రీన్‌కో 71,100
6 లారస్ ల్యాబ్స్ 59,440
7 ప్రీమియర్ ఎనర్జీస్ 46,130
8 ఎంఎ్‌సఎన్ ల్యాబ్స్ 34,770
9 హెటిరో ల్యాబ్స్ 33,850
10 కిమ్స్ హాస్పిటల్స్ 26,680
ఐదో సారీ రిలయన్సే నం.1
భారత్‌లోని టాప్ 500 ప్రైవేట్ (లిస్టెడ్, అన్‌లిస్టెడ్) కంపెనీల మొత్తం విలువ 3.4 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.320 లక్షల కోట్లు) దాటేసింది. అందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.19.36 లక్షల కోట్లతో వరుసగా ఐదో ఏడాదీ దేశంలోని అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ రూ.11.87 లక్షల కోట్లతో రెండో స్థానాన్ని దక్కించుకోగా.. భారతీ ఎయిర్‌టెల్ రూ.11.49 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉంది. కాగా, రూ.4.86 లక్షల కోట్లతో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ( ఎన్‌ఎస్ఈ) అత్యంత విలువైన అన్ లిస్టెడ్ కంపెనీగా నిలిచింది.
8గత ఏడాదికి లిస్ట్‌లోని 40 శాతం(198) కంపెనీల విలువలో మాత్రమే వృద్ధి నమోదైంది. దేశంలోని టాప్ టెన్ కంపెనీల మొత్తం విలువ రూ.86 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది భారత జీడీపీలో దాదాపు నాలుగో వంతు. కెనడా జీడీపీ కంటే అధికం. ఇండోనేషియా, స్పెయిన్‌ల మొత్తం జీడీపీ కంటే కూడా ఎక్కువ. అంతేకాదు, టాప్ 500 కంపెనీల మొత్తం విలువలో 27 శాతానికి సమానం. టాప్ టెన్ లిస్ట్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ అత్యధికంగా రూ.1.8 లక్షల కోట్లు పెరగగా.. బజాజ్ ఫైనాన్స్ విలువలో అత్యధికంగా 37 శాతం వృద్ధి నమోదైంది.
ఇవి కూడా చదవండి..
నేరారోపణలు ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్లకు అమెరికా ప్రవేశం నిరాకరణ: సుప్రీంకోర్టు కీలక తీర్పు
భారీ నష్టాల నుంచి కోలుకున్నాయ్.. లాభాల్లో దేశీయ సూచీలు