దివీస్ ల్యాబ్స్ @: రూ.3 లక్షల కోట్లు
ABN , Publish Date - Nov 10 , 2026 | 05:23 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న దివీస్ లేబొరేటరీస్ మరో రికార్డు నమోదు చేసింది. సోమవారం స్టాక్ మార్కెట్లో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న దివీస్ లేబొరేటరీస్ మరో రికార్డు నమోదు చేసింది. సోమవారం స్టాక్ మార్కెట్లో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారిగా రూ.3 లక్షల కోట్ల మార్కును అధిగమించింది. బీఎస్‌ఈలో దివీస్ షేరు వరుసగా 12 సెషన్ల నుంచి లాభాలను నమోదు చేస్తూ వస్తోంది. సోమవారం ఇంట్రాడేలో కంపెనీ షేరు 7 శాతం లాభంతో ఆల్‌టైమ్ రికార్డు స్థాయి రూ.11,818ని తాకింది. చివరకు 4.42 శాతం లాభం తో రూ.11,570 దగ్గర క్లోజైంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారిగా రూ.3 లక్షల కోట్ల మార్కును అధిగమించి రూ.3.07 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్ ప్రకారం చూస్తే కంపెనీ 30వ స్థానంలో ఉంది. కాగా గడచిన 12 ట్రేడింగ్ సెషన్లలో మదుపరులకు 32 శాతం మేర లాభాలను అందించింది. ముహూరత్ ట్రేడింగ్‌తో పాటు సోమవారం నాడు కంపెనీ షేరు 15 శాతం మేర పెరగటం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్ 2న కంపెనీ షేరు 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.5,648 నుంచి ఏకంగా 105 శాతం పెరగటం గమనార్హం. సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ ఆర్థిక ఫలితాలు అంచనాలకు మించి ఉండటమే షేరు దూకుడుకు ప్రధాన కారణంగా ఉంది. ఫార్మా విభాగంలో సన్ ఫార్మా రూ.4.6 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో అగ్రస్థానంలో ఉండగా రెండో స్థానంలో దివీస్ ఉంది. మరోవైపు దివీస్ ల్యాబ్స్‌తో పాటు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న గ్లాండ్ ఫార్మా, సాయి లైఫ్ సైన్సెస్ షేర్లు కూడా 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి.
ఈ వార్తలు కూడా చదవండి
దీపావళి బాణసంచా ప్రమాదాలు.. 32 మందికి కంటి గాయాలు