పండగ ముగియగానే ప్రియమాయె!
ABN , Publish Date - Nov 25 , 2026 | 05:43 AM
దేశంలో అతిపెద్ద పండగ సీజన్ దీపావళితో ముగిసింది. ఈ సమయంలో విక్రయాలపై ప్రభావం పడకుండా ఉండేందుకు ధరలు పెంచకుండా ఓపిక పట్టిన కంపెనీలు.. ఇక వడ్డింపులు మొదలు పెట్టాయి....
కారు.. మరింత కాస్ట్‌లీ
ఇప్పటికే ధరలు పెంచిన మారుతి సుజుకీ
అదేబాటలో టాటా మోటార్స్, హ్యుండయ్, ఆడి
మిగతా కంపెనీలూ త్వరలోనే ప్రకటించే చాన్స్
దేశంలో అతిపెద్ద పండగ సీజన్ దీపావళితో ముగిసింది. ఈ సమయంలో విక్రయాలపై ప్రభావం పడకుండా ఉండేందుకు ధరలు పెంచకుండా ఓపిక పట్టిన కంపెనీలు.. ఇక వడ్డింపులు మొదలు పెట్టాయి. దాంతో నిత్యావసరాలు, ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల నుంచి కార్ల వరకు అన్నీ ప్రియమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ధరలు పెంచేయగా.. మరికొన్ని త్వరలోనే ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి.
న్యూఢిల్లీ: కారు కొనుగోలు మరింత భారం కానుంది. మారుతి సుజుకీ సహా ప్రధా న కంపెనీలు తమ వాహన ధరలను పెంచేశాయి. ఏడాదిలో అత్యధిక వాహన విక్రయాలు నమోదయ్యే దసరా, దీపావళి సీజన్ ముగియగానే కంపెనీలు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గడిచిన కొన్ని నెలల్లో వాహన ఉత్పత్తి వ్యయం మరింత పెరగడంతో తమ మార్జిన్లను కాపాడుకునేందుకు కొంత భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయక తప్పడం లేదని కంపెనీలంటున్నాయి. దేశంలో అతిపెద్ద కార్ల విక్రయ సంస్థ మారుతి సుజుకీ ఈ నెల 22 నుంచి అమల్లోకి వచ్చేలా ఎంపిక చేసిన మోడళ్ల రేటును 0.31 శాతం వరకు పెంచింది. ఈ ఏడాదిలో సంస్థకిది నాలుగో పెంపు. తాజాగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ (టీఎంపీవీ), హ్యుండయ్ మోటార్ ఇండియా, జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి సైతం తమ వాహన ధరలను పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించాయి. టాటా, హ్యుండయ్ కార్ల ధరల పెరుగుదల ఈ డిసెంబరు 1 నుంచి అమల్లోకి రానుండగా.. ఆడి కార్ల ధరలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పెరగనున్నాయి. కాగా మిగతా కంపెనీలూ త్వరలోనే ధరల పెంపును ప్రకటించవచ్చని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
టాటా కార్లపై మరో అర శాతం..
టాటా మోటార్స్ తన అన్ని వాహన మోడళ్ల (కార్లు, ఎస్‌యూవీలు, పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహన వేరియంట్లు) ధరను సగటున 0.5 శాతం పెంచనున్నట్లు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో టీఎంపీవీ ధరలను పెంచడం ఇది నాలుగోసారి. ఈ ఏప్రిల్ 1 నుంచి సంస్థ సంప్రదాయ ఇంధన (పెట్రోల్, డీజిల్) వాహనాల రేటును సగటున 0.5 శాతం పెంచింది. జూలై 1 నుంచి పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ మోడళ్ల రేటు 1.5 శాతం వరకు ప్రియమయ్యాయి. సెప్టెంబరు 1 నుంచి అన్ని వాహనాల ధరను మోడల్, వేరియంట్ బట్టి రూ.25,000 వరకు పెంచింది.
హ్యుండయ్.. రూ.80,000 వరకు పెంపు
ఈ డిసెంబరు నుంచి ఎంపిక చేసిన వాహన మోడళ్లు, వేరియంట్ల ధరను రూ.80,000 వరకు పెంచుతున్నట్లు హ్యుండయ్ మోటార్స్ తెలిపింది. ఈ సెప్టెంబరులోనూ సంస్థ తన కార్ల ధరలను 0.4 శాతం మేర, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 1.4 శాతం పెంచింది. తాజా పెంపు దీనికి అదనం.
ఆడి మరో 2 శాతం..
వచ్చే ఏడాది జనవరి నుంచి ఆడి కార్ల ధర మోడల్‌ను బట్టి 2 శాతం వరకు పెరగనుంది. ఏడాది కాలంలో కంపెనీ ధరలు పెంచటం ఇది రెండోసారి. ఈ ఏప్రిల్‌లోనూ సంస్థ తన కార్ల ధరలను 2 శాతం వరకు పెంచింది.
ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులపైనా..
గత త్రైమాసికంలో పామాయిల్, చక్కెర, పాలు, ప్యాకేజింగ్ వంటి ముడి సరుకుల ధరలు 7 శాతం వరకు పెరగడంతో ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) సంస్థలపైనా ఒత్తిడి పెరుగుతోంది. దాంతో ఈ రంగ కంపెనీలూ మరోమారు ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. కొన్ని ఉత్పత్తుల ధరలను పెంచడంతో పాటు తక్కువ విలువైన ప్యాకెట్ ఉత్పత్తుల సైజును మరింత తగ్గించనున్నట్లు బ్రిటానియా సంకేతాలిచ్చింది. టాటా కన్స్యూమర్ ఇప్పటికే ఉప్పు, సాస్ ఉత్పత్తుల రేట్లను పెంచింది. పెరిగిన ధరలతో కూడిన ప్యాకెట్లు త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి. అంతేకాదు, గత వారం అమూల్, మదర్ డెయిరీ పాల రేటును, ఐటీసీ సిగరెట్ ధరలనూ పెంచాయి.
ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు సైతం..
త్వరలోనే ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు సహా అన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల రేట్లు సైతం పెరగనున్నాయి. ఉత్పత్తి వ్యయాలు వేగంగా పెరుగుతూ పోతున్న తరుణంలో కంపెనీలు లాభాల మార్జిన్లను కాపాడుకునేందుకు మరో విడత వడ్డింపునకు సిద్ధమవుతున్నాయి. పండగ సీజన్ కూడా ముగియడంతో ఇదే మంచి తరుణమని భావిస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లైన సామ్‌సంగ్, షామీ ఇప్పటికే మొబైల్స్, ట్యాబ్లెట్ పీసీల రేట్లను 18 శాతం వరకు పెంచేశాయి. సోమవారం నుంచి షామీ తన టీవీ మోడళ్ల ధరనూ 7 శాతం వరకు పెంచింది. ప్రముఖ అప్లయెన్స్ కంపెనీలైన హాయర్, గోద్రేజ్ కూడా తమ ఉత్పత్తులన్నింటి ధరను ఏడు శాతం వరకు పెంచేశాయి. అన్ని ఎలకా్ట్రనిక్ ఉత్పత్తుల బ్రాండ్లు వచ్చే 7-10 రోజుల్లో ధరల పెంపును ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ల ధరలు 40 శాతానికి పైగా, టీవీల రేటు 20 శాతం పైగా పెరగనుండగా.. గృహోపకరణాలు 15-20 శాతం మేర ప్రియం కానున్నాయి.
ఇవి కూడా చదవండి:
ప్రియా సరోజ్‌కు రింకూ సింగ్ బర్త్‌డే విషెస్..
వైభవ్ సూర్యవంశీ పెను విధ్వంసం.. 28 సిక్సర్ల వీడియో వైరల్!