బంగారం మరింత భారం
ABN , Publish Date - May 14 , 2026 | 01:54 AM
బంగారం, వెండి, ప్లాటినం వంటి విలువైన లోహాల కొనుగోలు మరింత భారంగా మారింది. ఎందుకంటే, వీటి దిగుమతులపై సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం రెండింతలకు పైగా పెంచింది. పసిడి, వెండిపై...
పసిడి, వెండిపై దిగుమతి సుంకం
6 శాతం నుంచి 15 శాతానికి పెంపు
ప్లాటినంపై 6.4 శాతం నుంచి 15.4 శాతానికి..
బుధవారం నుంచే పెంపు అమల్లోకి..
బులియన్ దిగుమతులకు అడ్డుకట్ట వేసేందుకు,
రూపాయిని ఆదుకునేందుకు కేంద్రం కీలక నిర్ణయం
దేశీయ మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు
న్యూఢిల్లీ: బంగారం, వెండి, ప్లాటినం వంటి విలువైన లోహాల కొనుగోలు మరింత భారంగా మారింది. ఎందుకంటే, వీటి దిగుమతులపై సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం రెండింతలకు పైగా పెంచింది. పసిడి, వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి, ప్లాటినంపై 6.4 శాతం నుంచి 15.4 శాతానికి పెంచింది. గోల్డ్, సిల్వర్ డోర్, నాణేలు, ఫైండింగ్స్‌కూ ఇది వర్తిస్తుంది. ఈ పెంపు బుధవారం నుంచే అమల్లోకి వచ్చింది. పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో విలువైన లోహాల దిగుమతులను తగ్గించుకోవడం ద్వారా విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలను కాపాడుకోవడంతో పాటు భారీగా క్షీణిస్తున్న రూపాయికి మద్దతుగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. విదేశీ మారకం నిల్వలను ఆదా చేసుకునేందుకు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని, పెట్రోల్, డీజిల్‌తో పాటు వంట నూనెల వినియోగాన్ని తగ్గించాలని, విదేశీ పర్యటనలను వాయిదా వేసుకోవాలని, పనికి వెళ్లేందుకు ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలని, వీలైతే ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రమ్ హోమ్)ని ఎంచుకోవాలని హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రజలను కోరారు. ఆ తర్వాత రెండు రోజులకే మోదీ సర్కారు విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచడం గమనార్హం.
పసిడి వినియోగంలో భారత్ నంబర్ 2
ప్రపంచ దేశాల పసిడి వినియోగంలో చైనా తర్వాత రెండో స్థానం భారత్‌దే. ముడి చమురు తర్వాత మనం అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న కమోడిటీ కూడా బంగారమే. ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా గడిచిన ఏడాదిన్నర కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి. దాంతో వీటి దిగుమతుల కోసం భారీగా విదేశీ మారక నిల్వలను వెచ్చించాల్సి వస్తోంది. ఇది రూపాయి మారకం విలువపైనా ఒత్తిడి పెంచుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూపాయి మారకం విలువ 11 శాతానికి పైగా క్షీణించింది.

14 శాతానికి పసిడి, వెండి దిగుమతుల వాటా
గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో బంగారం, వెండి దిగుమతుల విలువ వార్షిక ప్రాతిపదికన 26.7 శాతం పెరిగి 10,250 కోట్ల డాలర్లకు (ప్రస్తుత మారకం రేటు ప్రకారం సుమారు రూ.9.81 లక్షల కోట్లు) చేరుకుంది. అంతేకాదు, అంతక్రితం ఆర్థిక సంవత్సరానికి (2024-25) మొత్తం దిగుమతుల్లో బులియన్ వాటా 11.8 శాతంగా ఉండగా.. 2025-26లో ఇది 14 శాతానికి పెరిగింది.
ధరలు పెరుగుతాయే తప్ప
దిగుమతులు తగ్గవు: జీజేఈపీసీ
సుంకం పెంపుతో మార్కెట్లో బంగారం ధరలు మరింత పెరుగుతాయే తప్ప దిగుమతులు తగ్గవని ది జెమ్ అండ్ జువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) అంటోంది. గడిచిన కొన్ని నెలల్లో బంగారం ధరలు రెట్టింపైనప్పటికీ, దిగుమతులు తగ్గకపోవడమే ఇందుకు నిదర్శనమని అంటోంది. దిగుమతులను తగ్గించుకునేందుకు సరైన పరిష్కారాల కోసం ప్రభుత్వం పరిశ్రమ వర్గాలతో చర్చలు జరపాలని కోరింది.
రూ.8,550 పెరిగిన బంగారం
సుంకం పెంపు ప్రభావంతో మార్కెట్లో పసిడి, వెండి ధరలూ భారీగా పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం రేటు రూ.8,550 (5 శాతానికి పైగా) పెరిగి రూ.1.65,350కి చేరుకుంది. కిలో వెండి ఏకంగా రూ.20,500 ఎగబాకి రూ.2,97,500 ధర పలికిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ రేటు 0.3 శాతం తగ్గి 4,700 డాలర్లు, సిల్వర్ 1 శాతం పెరుగుదలతో 87.45 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి.
ఇక గోల్డ్ వయా దుబాయ్..!
సుంకం పెంపుతో దుబాయ్ నుంచి బంగారం, వెండి దిగుమతులు మరింత పెరగవచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్షియేటివ్ (జీటీఆర్‌ఐ) అంటోంది. ఎందుకంటే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో భారత్ 2022 మే నెలలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకుంది. అందులో భాగంగా మన ప్రభుత్వం విధించే సుంకం (15 శాతం) కంటే ఒక శాతం తక్కువకే (14 శాతం) దుబాయ్ నుంచి దిగుమతి చేసుకునే వెసులుబాటు ఉంటుంది. 2022లో దుబాయ్ నుంచి 120 టన్నుల వరకు బంగారం తక్కువ సుంకంతో దిగుమతి చేసుకునేందుకు భారత్ వీలు కల్పించింది. 2027లో ఈ వాటా 200 టన్నులకు చేరుకోనుంది. మన వార్షిక దిగుమతుల్లో దాదాపు దాదాపు పాతిక శాతమన్నమాట. అంతేకాదు, ఒప్పందంలో భాగంగా దుబాయ్ నుంచి వెండి దిగుమతులపై సుంకాన్ని 2002లో 10 శాతం నుంచి పదేళ్ల కాలంలో క్రమంగా సున్నాకు తగ్గించేందుకు భారత్ ఒప్పుకుంది. ప్రస్తుతం దుబాయ్ నుంచి సిల్వర్ దిగుమతులపై సుంకం 7 శాతంగా ఉంది. తాజా సుంకం పెంపు నేపథ్యంలో దుబాయ్ నుంచి వెండి దిగుమతిపై 8 శాతం సుంకం ఆదా కానుంది.
ఊపందుకోనున్న గోల్డ్ స్మగ్లింగ్!
సుంకాల పెంపుతో బంగారం స్మగ్లింగ్ మరింత ఊపందుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ)తోపాటు కస్టమ్స్ అధికారులు నిఘా పెంచారు. ముఖ్యంగా స్మగ్లింగ్ ఎక్కువగా జరిగే సరిహద్దు, భూమార్గాలు, ఎయిర్‌పోర్టుల వద్ద తనిఖీలను మరింత ముమ్మరం చేసే అవకాశముంది.
ఈ వార్తలు కూడా చదవండి
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్