Share News

ఏఐతో ఉద్యోగాలు ఉఫ్‌

ABN , Publish Date - Aug 27 , 2026 | 06:27 AM

కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత శరవేగ వృద్ధిపై మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ భయాందోళనలను వ్యక్తం చేశారు. ఏఐతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగాలు శాశ్వతంగా కనుమరుగు కావచ్చని ఆయన హెచ్చరించారు.

ఏఐతో ఉద్యోగాలు ఉఫ్‌

మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌

న్యూయార్క్‌: కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత శరవేగ వృద్ధిపై మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ భయాందోళనలను వ్యక్తం చేశారు. ఏఐతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగాలు శాశ్వతంగా కనుమరుగు కావచ్చని ఆయన హెచ్చరించారు. ఈ ఆధునిక టెక్నాలజీ భవిష్యత్‌లో మానవాళికి అత్యంత ప్రమాదకరంగా పరిణమించవచ్చన్నారు. టెక్నాలజీ ఇండస్ట్రీ మాత్రం ఈ ముప్పులను కప్పిపుచ్చుతోందని, ఈ రంగంలోకి లక్షల కోట్ల డాలర్ల నిధులు వచ్చి చేరుతుండటమే ఇందుకు కారణమని అన్నారు.


‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత విప్లవాత్మక సాంకేతికతలతో పోలిస్తే ఏఐ పూర్తి భిన్నమని బిల్‌గేట్స్‌ పేర్కొన్నారు. గత సాంకేతికతలతో నష్టపోయిన ఉద్యోగాల కంటే కొత్తగా పుట్టుకొచ్చిన ఉద్యోగాలే అధికమని.. ఏఐ విషయంలో ఇది విరుద్ధంగా ఉండవచ్చన్నారు. ఈ నేపథ్యంలో ఏఐ వినియోగంపై పన్ను విధించాలని ఆయన ప్రతిపాదించారు. దాన్ని టోకెన్‌ ట్యాక్స్‌గా అభివర్ణించారు. పన్ను విధింపుతో కంపెనీలకు ఉద్యోగులను ఏఐతో భర్తీ చేయడం మరింత ఖరీదుగా మారుతుందన్నారు. అంతేకాదు, కొన్ని ఉద్యోగాలను కేవలం మనుషుల కోసమే రిజర్వ్‌ చేయాలని కూడా బిల్‌ గేట్స్‌ ప్రతిపాదించారు.

Updated Date - Aug 27 , 2026 | 06:51 AM