Share News

హెచ్‌ఆర్ ఉద్యోగులు అందర్నీ తొలగించిన ఫిన్‌టెక్ సంస్థ సీఈఓ

ABN , Publish Date - May 22 , 2026 | 05:14 PM

తన సంస్థలోని హెచ్ఆర్ ఉద్యోగులందర్నీ తొలగించిన బోల్ట్ కంపెనీ సీఈఓ రయన్ బ్రెస్లో సంచలనానికి తెరతీశారు. వారి వల్ల కొత్త సమస్యలు రావడం మినహా మరో ప్రయోజనం లేదంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

హెచ్‌ఆర్ ఉద్యోగులు అందర్నీ తొలగించిన ఫిన్‌టెక్ సంస్థ సీఈఓ
BOLT Ceo Fires Entire HR Team

ఇంటర్నెట్ డెస్క్: అమెరికన్ ఫిన్‌టెక్ కంపెనీ బోల్ట్ సీఈఓ రయన్ బ్రెస్లో గత నెలలో తన సంస్థలోని హెచ్ఆర్ ఉద్యోగులు అందర్నీ తీసేసిన ఉదంతం కలకలం రేపుతోంది. హెచ్‌ఆర్‌ వారు కొత్త సమస్యలు సృష్టిస్తున్న కారణంగా యావత్ డిపార్ట్‌మెంట్‌ను తీసేయకతప్పలేదని బ్రెస్లో తాజాగా తెలిపారు. ప్రస్తుతం తమ సంస్థ యుద్ధ సన్నద్ధతతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. ఇందుకు ప్రతిబంధకంగా ఉన్న హెచ్‌ఆర్‌ను తప్పించామని అన్నారు. అట్లాంటాలో ఇటీవల జరిగిన ఫార్చూన్ వర్క్‌ఫోర్స్ ఇన్నోవేషన్ సమ్మిట్‌లో ఈ కామెంట్స్ చేశారు.

‘మాకో హెచ్ఆర్ టీమ్ ఉండేది. కానీ వారు కొత్త సమస్యలు సృష్టిస్తుండేవారు. వారు పోయాక ఆ సమస్యలన్నీ తొలగిపోయాయి’ అని బ్రెస్లో చెప్పుకొచ్చారు. తమ సంస్థలో ప్రస్తుతం సంప్రదాయక హెచ్ఆర్ విభాగం లేదని అన్నారు. కొందరు ఉద్యోగుల బృందం హెచ్ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటుందని చెప్పారు. సంస్థలో కార్యనిర్వాహక అడ్డంకులను తొలగించి మేనేజర్లకు వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వడమే తన లక్ష్యమని చెప్పారు. నిధుల రాకడ కొనసాగుతుండటంతో కంపెనీలో కాస్త అలసత్వం పెరిగిందని కూడా చెప్పారు. ఉద్యోగులు కష్టపడి పనిచేయట్లేదని అన్నారు. సంస్థ తొలినాళ్లల్లో ఉన్న సంస్కృతిని, ఆ స్టార్టప్ దృక్పథాన్ని తిరిగి సాధించుకోవాలని అభిప్రాయపడ్డారు.


2014లో బోల్ట్‌ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అనతి కాలంలోనే బోల్ట్ అత్యధిక వృద్ధిసాధిస్తున్న ఫిన్ టెక్ సంస్థగా అమెరికాలో గుర్తింపు పొందింది. ఆన్‌లైన్ కామర్స్ వృద్ధి, చెకౌట్ టెక్నాలజీకి డిమాండ్ పెరగడంతో బోల్ట్ కూడా అభివృద్ధిబాటలో దూసుకెళ్లింది. ఈ క్రమంలో 2022లో బోల్ట్ సంస్థ సీఈఓ బాధ్యతల నుంచి బ్రెస్లో తప్పుకున్నారు. ఆ తరువాత కంపెనీకి గడ్డుకాలం ప్రారంభమైంది. మార్కెట్ విలువ క్రమంగా తగ్గడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో గతేడాది బ్రెస్లో మళ్లీ సీఈఓగా పగ్గాలు చేపట్టారు. బోల్ట్‌ను మళ్లీ అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

సానుకూల సంకేతాలతో మార్కెట్ల ర్యాలీ..

భారతీయుల్లో రియల్టీ, బంగారంపై తగ్గుతున్న మోజు

Updated Date - May 22 , 2026 | 05:31 PM