బిట్‌కాయిన్‌ను నేను సృష్టించలేదు.. బ్రిటిష్ క్రిప్టాలజిస్టు స్పష్టీకరణ
ABN , Publish Date - Apr 09 , 2026 | 04:56 PM
తానే బిట్‌కాయిన్ సృష్టికర్త అంటూ అంతర్జాతీయంగా వచ్చిన వార్తలపై బ్రిటన్ క్రిప్టాలజిస్టు ఆడమ్ బ్యాక్ స్పందించారు. తాను అసలు ఆ క్రిప్టోకరెన్సీని సృష్టించలేదని పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ సృష్టికర్త గురించి న్యూయార్క్ టైమ్స్‌లో ఇటీవల ప్రచురితమైన కథనం ప్రస్తుతం క్రిప్టో ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. బిట్‌కాయిన్‌ను సతోషీ నకమోటో అనే మారుపేరుతో ఒక వ్యక్తి సృష్టించారన్న కథనం తెలిసిందే. ఆ వ్యక్తి బ్రిటన్‌కు చెందిన క్రిప్టాలజిస్టు ఆడమ్ బ్యాక్ అని వ్యాసకర్త తన కథనంలో తాజాగా రాసుకొచ్చారు. సతోషీ, ఆడమ్ బ్యాక్‌ల ఆన్‌లైన్ యాక్టివిటీల్లో చాలా దగ్గరపోలికలు ఉన్నాయని చెప్పారు. తన వాదనకు బలం చేకూర్చే పలు ఆధారాలను కూడా కథనంలో పేర్కొన్నారు.
ఈ కథనం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ఆడమ్ బ్యాక్ తాజాగా స్పందించారు. తాను సతోషీని కాదని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని రాసిన వ్యక్తి పొరపాటు పడ్డారని వివరించారు. అయితే, అప్పట్లో తాను క్రిప్టోగ్రఫీతో సమాజానికి జరిగే మేలు గురించి ఆన్‌లైన్ వేదికల్లో చర్చించేవాడినని చెప్పారు. ఎలక్ట్రానిక్ క్యాష్, ఆన్‌లైన్ ప్రైవసీ వంటి అంశాలపై తన అభిప్రాయాలను పంచుకునే వాడినని అన్నారు.
సతోషీ పోస్టులు, ఈమెయిల్స్‌లో వాడిన భాషకు తన శైలికి మధ్య అనేక పోలీకలు ఉండటం యాదృచ్ఛికమని స్పష్టం చేశారు. ఈ రంగంలో ప్రవేశం ఉన్న వారు చాలా మంది అలాంటి పదజాలాన్నే వాడుతుంటారని చెప్పుకొచ్చారు. సతోషీ ఆన్‌లైన్‌లో యాక్టివ్‌గా ఉన్న సమయాల్లో ఆడమ్ మౌనంగా ఉండటం, సతోషీ తప్పుకున్న సమయాల్లో ఆడమ్ యాక్టివ్‌గా ఉన్న వైనం ఆ ఇద్దరూ ఒకరే అనేందుకు ఆధారమని న్యూయార్క్ టైమ్స్ కథనంలో వ్యాసకర్త పేర్కొన్నారు. ఇవన్నీ యాదృచ్ఛికమని ఆడమ్ స్పష్టం చేశారు.
కేవలం 21 మిలియన్‌ల బిట్‌కాయిన్స్ ఉండేలా సతోషీ ఈ వ్యవస్థను డిజైన్ చేశారు. సతోషీ వద్ద ఇప్పటికీ పెద్ద సంఖ్యలో బిట్‌కాయిన్స్ ఉన్నాయని టెక్ రంగం నిపుణులు అంచనా వేస్తున్నారు. వాటి విలువ నేటి రేట్స్ ప్రకారం 70 బిలియన్ డాలర్లకు పైనే ఉండవచ్చనేది ఒక అంచనా. అయితే, తన వద్ద బిట్‌కాయిన్స్ పెద్దగా లేవని ఆడమ్ చెప్పుకొచ్చారు. అప్పట్లో వాటి కోసం మరింతగా మైనింగ్ చేయనందుకు ఇప్పటికీ తనపై తనకు కోపమని అన్నారు.
ఈ వార్తలూ చదవండి:
మే 1 నుంచి హ్యుండయ్ కార్ల ధరల పెంపు
వెండి నాణేలు, నగలకూ బైబ్యాక్ సేవలు ఎంఎంటీసీ పాంప్