Share News

బ్యాంకుల సేవా లోపాలు..

ABN , Publish Date - Nov 15 , 2026 | 04:27 AM

బ్యాంకింగ్‌ లావాదేవీలు మన నిత్య జీవితంలో భాగమైపోయాయి. ఒక్కోసారి ఈ సేవలు పొందడంలో సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సేవా లోపానికి బ్యాంకుల నుంచి...

బ్యాంకుల సేవా లోపాలు..

ఖాతాదారుల ‘పరిహార’ హక్కులు

బ్యాంకింగ్‌ లావాదేవీలు మన నిత్య జీవితంలో భాగమైపోయాయి. ఒక్కోసారి ఈ సేవలు పొందడంలో సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సేవా లోపానికి బ్యాంకుల నుంచి పరిహారాన్ని పొందవచ్చు. అయితే చాలా మందికి ఈ విషయం తెలియదు. ఏయే సేవా లోపాలకు బ్యాంకులు కస్టమర్లకు నష్టపరిహారం చెల్లిస్తాయో తెలుసుకుందాం.

మీ క్రెడిట్‌ కార్డు క్లోజ్‌ చేయమని బ్యాంకుకు దరఖాస్తు చేశారు. అయితే బ్యాంకు నిర్ణీత కాలం ముగిసినా ఆ పని చేయలేదు. ఇందుకోసం కాళ్లు అరిగేలా బ్యాంకుల చుట్టూ తిరిగినా ఒక్కోసారి పనులు కావు. పరపతి స్కోరు నివేదికలో తప్పుల సవరణ, డిజిటల్‌ చెల్లింపుల వైఫల్యం వంటి సేవల విషయంలోనూ చాలా మంది కస్టమర్లు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఇలాంటి సేవా లోపాలకు బ్యాంకుల పని పట్టేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌.. కస్టమర్లకు కొన్ని నష్టపరిహార హక్కులు కల్పించింది. అవేమిటంటే?

డిజిటల్‌ వైఫల్యాలకు..

ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేసేటప్పుడు.. ఒక్కోసారి నగదు విత్‌డ్రా కాకుండానే ఖాతా నుంచి డెబిట్‌ అయునట్టు చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా చేసే చెల్లింపుల్లో సమస్యలు ఏర్పడతాయి. యూపీఐ చెల్లింపుల్లోనూ కొన్నిసార్లు సమస్య లు తప్పవు. ఒకటి నుంచి ఐదు రోజుల్లో బ్యాంకులు ఈ సమస్యలను పరిష్కరించాలి. అంతకు మించి ఆలస్యమైతే మీరు అడక్కుండానే రోజుకు రూ.100 చొప్పున పరిహారం చెల్లించాలి. అయితే ఈ నష్టపరిహారాలు ఒక్కో సేవా లోపానికి ఒక్కోలా ఉంటాయి.


క్రెడిట్‌ కార్డు క్లోజర్‌..

కస్టమర్‌ నుంచి విజ్ఞప్తి అందిన వారం రోజుల్లోపు బ్యాంకులు, క్రెడిట్‌ కార్డు జారీ చేసే కంపెనీలు క్రెడిట్‌ కార్డును క్లోజ్‌ చేయాలి. ఈలోగా ఆ పని పూర్తి చేయలేక పోతే కార్డు క్లోజ్‌ చేసే రోజు వరకు.. రోజుకి రూ.500 చొప్పున కార్డుదారుడికి నష్టపరిహారంగా చెల్లించాలి. ఇటీవల ఒక బ్యాంకు ఇలాంటి విజ్ఞప్తిని నిర్ణీత గడువు లోగా పూర్తి చేయలేక పోవడంతో క్రెడిట్‌ కార్డుదారుడికి రూ.3.21 లక్షల నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది.

డాక్యుమెంట్ల అప్పగింత..

ఆస్తుల హామీపై తీసుకున్న రుణాలను పూర్తిగా చెల్లించిన నెల రోజుల్లోగా.. బ్యాంకులు ఆ ఆస్తుల అసలు పత్రాలను రుణగ్రహీతలకు అప్పగించాలి. లేకపోతే రోజుకు రూ.5,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. ఒకవేళ తన వద్ద ఉన్న ఈ పత్రాలు పోయినా, పాడైపోయినా ఈ నష్టపరిహారంతో పాటు వాటి డూప్లికేట్‌ లేదా సర్టిఫైడ్‌ కాపీలు పొందేందుకు బ్యాంకులు రుణగ్రహీతలకు సాయం చేయాలి.

క్రెడిట్‌ నివేదికలో తప్పులు, దిద్దుబాట్లు..

క్రెడిట్‌ నివేదికలో ఏమైనా తప్పులు లేదా దిద్దుబాటు ఉంటే ఖాతాదారుడి నుంచి విజ్ఞప్తి అందిన నెల రోజుల్లో బ్యాంకులు ఆ లోపాలను సరిచేయాలి. అలా చేయలేకపోతే రోజుకు రూ.100 చొప్పున ఖాతాదారుడికి నష్టపరిహారంగా చెల్లించాలి.

లాకర్లలోని వస్తువులు పోయినప్పుడు..

నిర్లక్ష్యం, అగ్ని ప్రమాదం లేదా మోసాల కారణంగా ఒక్కోసారి లాకర్లలోని వస్తువులు పోతుంటాయి. అలాంటప్పుడు బ్యాంకులు లాకర్‌ వార్షిక ఫీజుకు 100 రెట్ల మొత్తాన్ని ఖాతాదారుడికి నష్టపరిహారంగా చెల్లించాలి.

డిజిటల్‌ మోసాలకు..

బ్యాంకుల తప్పిదాలతో జరిగే డిజిటల్‌ చెల్లింపుల మోసాలకు ఖాతాదారుడికి బాధ్యత ఉండదు. థర్డ్‌ పార్టీతో జరిగే మోసాలైతే మూడు పని దినాల్లో బ్యాంకుకు తెలియజేసినా, ఖాతాదారుడిపై భారం ఉండదు. బ్యాంకుల తప్పిదాలతో జరిగే చిన్న చిన్న డిజిటల్‌ మోసాలకి కూడా రూ.25,000 వరకు నష్ట పరిహారం పొందవచ్చు. పర్యవసానాలను బట్టి డిజిటల్‌ మోసాలకు.. ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌ ద్వారా రూ.30 లక్షల వరకు నష్టపరిహారం పొందవచ్చు. ఇలాంటి కేసుల్లో బ్యాంకులు ఖాతాదారుడిని వేధించినట్టు తేలితే రూ.3 లక్షల వరకు పెనాల్టీ కూడా చెల్లించాలి.


ఎలా ఫాలో అప్‌ చేయాలి?

  • ఖాతాదారులు ముందుగా తమకు జరిగిన సేవా లోపం ఆర్‌బీఐ పేర్కొన్న నష్టపరిహారం జాబితాలోకి వస్తాయా? లేదా? అనే విషయం తెలుసుకోవాలి.

  • నిర్ణీత గడువులోగా నష్టపరిహార విజ్ఞప్తి అందజేయాలి.

  • అకౌంట్‌ స్టేట్‌మెంట్‌, లావాదేవీల ఐడీ, అలర్ట్స్‌, లోన్‌ క్లోజర్‌ను నిరూపించే సాక్ష్యాలు, డాక్యుమెంట్లు, బ్యాంకుతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలు భద్రపరుచుకోవాలి.

  • ఫిర్యాదు చేసిన 30 రోజుల్లో బ్యాంకులు సమాధానం ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే 90 రోజుల్లోగా అన్ని వివరాలతో ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయాలి.

ఈ వార్తలనూ చదవండి:

జెన్సన్ హువాంగ్ రీఎంట్రీకి ప్రయత్నాలు.. మద్దతుగా మస్క్

ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో కమ్యూనికేషన్ సమస్య.. అమెరికాలో విమాన సేవల నిలిపివేత..

Updated Date - Nov 15 , 2026 | 04:28 AM